WorldWonders

సబ్‌జైలుకు మదనపల్లె హత్యకేసు నిందితులు

సబ్‌జైలుకు మదనపల్లె హత్యకేసు నిందితులు

‘పెద్ద కుమార్తె శివుడు.. చిన్న కుమార్తె పార్వతి.. నేను కాళిక.. పెద్ద కుమార్తె రోజూ దేవుడితో మాట్లాడుతోంది’ అనే భావనతో చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఇద్దరు కుమార్తెల హత్య కేసులో నిందితురాలు పద్మజ ఉన్నట్లు తెలుస్తోంది. దేవుడు ఏ రోజు ఏం చేయాలో శివుడికి (పెద్ద కుమార్తె) చెబుతాడని.. ఆ ఆజ్ఞల ప్రకారం తాము పనులు చేస్తామని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. రిమాండ్‌ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. అలేఖ్య, సాయిదివ్య ఇటీవల కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను చనిపోతాననే భావనతో సాయిదివ్య ఉండేది. సోదరి అలేఖ్య కూడా ఆ అనుమానాన్ని బలపరుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న తల్లిదండ్రులు ఓ మంత్రగాడితో తాయత్తు కట్టించారు. మరుసటిరోజు సాయిదివ్య రెండో అంతస్తులోని పడకగదిలో తాను చనిపోతానని బిగ్గరగా ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో ఆమె మరింత గట్టిగా రోదించింది. దాంతో ఈసారి దెయ్యాన్ని వదిలించాలని వారు డంబెల్‌తో ఆమె తలపై కొట్టారు. తర్వాత నుదుటిపై కత్తితో కోశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సాయిదివ్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకొస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పి మొదటి అంతస్తులోని పూజ గదికి వెళ్లింది. అనంతరం అలేఖ్య చెప్పినట్లే.. తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజలు ఆమె నోటిలో రాగి కలశం ఉంచి డంబెల్‌తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించింది. ఈ రెండు హత్యల తర్వాత పురుషోత్తంనాయుడు విశ్రాంత అధ్యాపకుడు గౌరీశంకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు సంఘటన స్థలానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. మంగళవారం సాయంత్రం పురుషోత్తంనాయుడు, పద్మజలను మదనపల్లె ప్రత్యేక సబ్‌ జైలుకు తరలించారు.