NRI-NRT

మయాన్మార్‌లో సైనిక తిరుగుబాటు-తాజావార్తలు

మయాన్మార్‌లో సైనిక తిరుగుబాటు-తాజావార్తలు

* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైకాపా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌పై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘‘ కేంద్ర బడ్జెట్‌ చాలా నిరాశాజనకంగా ఉంది. ఏపీకి శారాఘాతంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపారు. గతంలో వచ్చిన బడ్జెట్‌ల కంటే చాలా చెత్తగా ఉంది. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ విభజన జరిగినప్పటి నుంచి విశాఖ, విజయవాడకు మెట్రో రైలు అడుగుతూనే ఉన్నాం… కానీ బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏమీ కేటాయించలేదు. గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాగే చేసింది. ఒక వైరాలజీ సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. ధాన్యం సేకరణలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి. రాష్ట్రంలో 26 జిల్లాలు చేయబోతున్నాం.. వాటికి కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి.

* మయన్మార్​ కీలకనేత ఆంగ్ ​సాన్​ సూకీని ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. సూకీ సహా అధికార నేషనల్ లీగ్ ఫర్ ​డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ఛైర్మన్‌ను సోమవారం ఉదయం సైన్యం అదుపులోకి తీసుకునట్లు మయన్మార్​ మీడియా తెలిపింది. రాజధాని నేపిడాలో టెలిఫోన్​, ఇంటర్నెట్​ సేవలు నిలిపివేశారని పేర్కొంది. ఎన్ఎల్‌డీ పార్టీ నాయకులెవరూ ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదని తెలిపింది. అనంతరం మయన్మార్ ఇప్పుడు పూర్తిగా తమ నియంత్రణలో ఉందని సైన్యం ప్రకటించింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని ఆర్మీ వెల్లడించింది. గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు మయన్మార్​ చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం కావాల్సి ఉంది. ఈ ఎన్నికలు అక్రమంగా జరిగాయని సైనిక తిరుగుబాటు తప్పదని సైనికాధికారులు కొద్ది రోజుల క్రితమే హెచ్చరించారు. నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ 476 స్థానాలకు గానూ.. 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. దశాబ్దాల సైనిక పాలన నుంచి విముక్తి కల్పిస్తూ 2015లో తొలిసారి సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

* మయన్మార్‌లో అన్ని విమాన ప్రయాణాలను రద్దు చేసినట్లు ఆ దేశ విమానయానశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. మయన్మార్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం సెక్యూరిటీ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులపై అవగాహనతో ఉన్నామని యూఎస్‌ ఎంబసీ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున మయన్మార్‌ సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సూచనలు చేస్తూ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాశారు. కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు పాటించాల్సిన నిబంధనలను అందులో ప్రస్తావించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లు పర్యటిస్తే ఎన్నికల ప్రచారంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పర్యటనల్లో ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు, వనరులు వినియోగించరాదని తేల్చిచెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ప్రభుత్వ అధికారులను ఛైర్మన్లు తమ వెంట తీసుకెళ్లరాదని ఎస్‌ఈసీ ఆదేశించారు.

* సింఘు, గాజీపూర్‌, టిక్రీ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది. తాజాగా ఈ నిషేధాన్ని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో రైతులు రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

* పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేలా లేదని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడారు. ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం దుర్మార్గమన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చింది శూన్యమని ఆరోపించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 21,922 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 64 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,900కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,154 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 99 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,504కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,242 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,31,59,794 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ..పురుషోత్తపట్నం పోలవరంలో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం తీరుస్తుందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని జస్టిస్‌ నారీమన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

* 40 ఏళ్ల తన సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. తన పరిధి, బాధ్యత తెలుసని.. స్వీయ నియంత్రణ పాటిస్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ప్రతి వ్యవస్థకూ రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని చెప్పారు.

* తల్లిదండ్రులు చనిపోయినా పట్టించుకోని పిల్లలున్న ఈరోజుల్లో ఓ మహిళా ఎస్సై అనాథ శవాన్ని భుజంపై మోసుకెళ్లారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కాశీబుగ్గ సమీపంలోని అడవి కొత్తూరు గ్రామంలో 60 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై శిరీషకు సమాచారం అందింది. దీంతో ఈరోజు ఆమె అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో లలిత చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుల సాయంతో మృతదేహాన్ని ఎస్సై శిరీష తన భుజంపై మోసుకుంటూ పొలంగట్ల మీదుగా సుమారు 2కి.మీ తీసుకెళ్లి సమీపంలోని రోడ్డుపైకి చేర్చారు. అనంతరం మృతదేహాన్ని ట్రస్ట్‌ సభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. ఓ మహిళా ఎస్సై అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లడాన్ని చూసిన పలువురు ఆమెను అభినందిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర అధికారులు అభినందించారు. మృతదేహాన్ని ఎస్సై మోసుకెళ్తున్న వీడియోను ఏపీ పోలీస్‌శాఖ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌-2021పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ మేరకు బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. ఆశగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. బడ్జెట్‌ సామాన్యునికి అనుకూలంగా లేదని, తెలంగాణకు కేంద్ర మళ్ళీ మొండి చేయి చూపించిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. సామాన్యునికి, పేదలకు, చిన్న చిన్న ఆర్థిక రంగాలకు బడ్జెట్‌ ఏ మాత్రం చేయూతనివ్వలేదని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెట్టలేదని, దేశంలోని ఆర్థిక వ్యవస్థలన్నింటిని విదేశీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పెద్దిరామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై చేసిన ఫిర్యాదును అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం సీరియస్‌గా తీసుకున్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మిగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిని పూర్తిస్థాయిలో పరిశీలించిన స్పీకర్‌ తమ్మినేని ఎస్‌ఈసీపై చర్యలు ప్రారంభించారు. నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవల్సిందిగా ప్రివిలైజ్‌ కమిటీకి సోమవారం సిఫార్సు చేశారు. మంత్రుల ఫిర్యాదును పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవలని స్పీకర్‌ ఆదేశించారు. దీనిపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ చేపట్టనుంది.

* కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తుల మీద పన్నుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు 6.5 శాతానికి పైగా పెరిగాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఇతర సిగరెట్ తయారీ సంస్థల షేర్ ధరలు కూడా పెరిగాయి. విఎస్‌టి ఇండస్ట్రీస్, గోల్డెన్ టొబాకో, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీల షేర్లు కూడా 2.06 శాతం, 7.94 శాతం, 0.83 శాతం పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున బడ్జెట్ కు ముందు పొగాకు, మద్యం వంటి వాటిపై పన్ను పెంపు ఉంటుందని అందరు భావించారు. కానీ ఎటువంటి పెంపులేకపోవడంతో సిగరెట్ తయారీ దారులు ఊపిరి పీల్చుకున్నారు.