Politics

బట్టలూడదీసి కొడతాం-చంద్రబాబు హెచ్చరిక

Chandrababu Warns YS Jagan Govt On Attack Over Pattabhi

‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? అవినీతిని వెలుగులోకి తెస్తే దాడులు చేస్తారా? ఇదేం బరితెగింపు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి’ అని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై దుండగుల దాడి సమాచారంతో ఆయన నివాసానికి చంద్రబాబు మంగళవారం వచ్చి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఇది పులివెందుల కాదు. శాంతిభద్రతల నియంత్రణేదీ? చంపుతారా? ఎంతమందిని చంపుతారు? ఖబడ్దార్‌. ముఖ్యమంత్రి.. మీ బూతుల మంత్రికి, రౌడీ ఎమ్మెల్యేలకు చెప్పు.. ఇలాంటివి పునరావృతమైతే బట్టలు విప్పి తరిమే పరిస్థితి వస్తుంది’ అని హెచ్చరించారు. పట్టాభిపై మొదటిసారి దాడి జరిగినప్పుడే డీజీపీ చర్యలు తీసుకొని ఉంటే ఇది పునరావృతమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ‘తొలుత దాడి జరిగి 3నెలలైనా ఎవరినీ గుర్తించలేదు. పట్టాభి నివసించే కాలనీలో హైకోర్టు జడ్జి, ఐఏఎస్‌లు, ఇతర ప్రముఖులు ఉంటారు. అలాంటి కాలనీలో పట్టపగలు దాడిని ఖండిస్తున్నా. ప్రభుత్వ అవినీతిని, సీఎం సొంత వ్యాపారం భారతి సిమెంటు కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో పట్టాభి బయటపెట్టారు. అందుకే పట్టాభిపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. యువకుడు కాబట్టి దాడిని కొంతవరకు ప్రతిఘటించగలిగారు. రాష్ట్రమంతా సీసీ కెమెరాలు పెట్టామని డీజీపీ అన్నారు. ఏమయ్యాయి మీ మాటలు?’ అంటూ నిలదీశారు. ‘పట్టాభి ఎవరికీ శత్రువు కాదు. వ్యక్తిగతంగానూ శత్రువులు లేరు. ప్రజల కోసం పోరాడితే చంపుతారా? ఇలా ఎంతమందిని?’ అంటూ ప్రశ్నించారు. ‘ప్రజల కోసం పోరాడుతుంటే నన్నూ చంపుతారా?’ అని నిలదీశారు.