NRI-NRT

ఈ ఇటలీ గ్రామంలో ఉంటే ₹22లక్షలు ఇస్తారు

ఈ ఇటలీ గ్రామంలో ఉంటే ₹22లక్షలు ఇస్తారు

ఓ పక్కన చూడచక్కని ఎత్నా పర్వతం. మరోపక్క అడవులూ సరస్సులూ నారింజ తోటలూ… ఆ మధ్యలో కొండమీద ప్రాచీన సౌందర్యం ఉట్టిపడే ఇళ్లతో ఊరు. అదే ఇటలీలోని సిసిలీ దీవిలో ఉన్న ట్రొయినా గ్రామం. ఆ దేశంలోనే అందమైన పల్లెల్లో ఒకటిగా పేరుపొందిందీ ప్రాంతం. కానీ అక్కడి ప్రజలు చాలామంది తమ పాత ఇళ్లను వదిలేసి మరోచోట అధునాతన ఇళ్లను కట్టుకోవడం, నగరాలకు వలసవెళ్లడం గత కొంతకాలంగా బాగా పెరిగిందట. దాంతో ఊళ్లో చాలా ఇళ్లు పాడుబడిపోయాయి. అందువల్ల గ్రామం అందం పోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోందట. దీనికి పరిష్కారంగానే స్థానిక మేయర్‌ తమ గ్రామంలో ఉండాలనుకునేవారికోసం అక్కడి ఇళ్లను కేవలం ఒక్క యూరో(సుమారు రూ.87)కే అమ్మేందుకు ఓ పథకాన్ని రూపొందించారు. అయితే, ఇల్లు దాదాపు ఉచితంగానే వచ్చినా ఆ పాత ఇళ్లను ఉండడానికి అనువుగా అందంగా మార్చుకోవడానికి ఖర్చు అవుతుందని కొందరు వెనకాడుతున్నారట. అది గమనించి, ఇప్పుడు… ‘ఇల్లు బాగు చేసుకోవడానికి కూడా మేమే సాయం చేస్తాం’ అంటూ స్థానిక ప్రభుత్వం ఒక్కో ఇంటికీ సుమారు 25వేల యూరోల(22లక్షల రూపాయలు)ను ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఎంత మంచి అవకాశమో!