Agriculture

ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు

ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు

ఈ ఏడాది నైరుతి రుతు పవనాలపై ప్రముఖ ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ ‘స్కైమెట్‌’ శుభవార్త చెప్పింది. దేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది. రుతుపవన కాలమైన జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) వర్షపాతం 103 శాతం (5% అటు, ఇటుగా) ఉంటుందని స్కైమెట్‌ అధ్యక్షుడు (మెటలర్జీ) జీపీ శర్మ తెలిపారు. 60% సాధారణ.. 15% సాధారణం కంటే ఎక్కువగాను వర్షపాతానికి అవకాశంఉన్నట్లు తెలిపారు. రుతుపవన వర్షపాతానికి సంబంధించి ఎల్‌పీఏ 96 నుంచి 104% మధ్య ఉంటే దాన్ని సాధారణంగా లెక్కిస్తారు. జూన్‌లో ఇది106%, జులైలో 97%, ఆగస్టులో 99%, సెప్టెంబరులో 116% ఉండొచ్చని స్కైమెట్‌ అంచనా వేసింది. గత రెండేళ్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో.. వరుసగా మూడోసంవత్సరం (2021) లోనూ మంచి రుతుపవన కాలం ఉంటుందని శర్మ పేర్కొన్నారు. ఉత్తర భారత మైదాన ప్రాంతం, ఈశాన్య ప్రాంతంలోని కొద్దిచోట్ల వర్షపాతం తగ్గే అవకాశాలున్నట్లు స్కైమెట్‌ పేర్కొంది. ‘‘కర్ణాటకలోని మారుమూల ప్రాంతాలు జులై, ఆగస్టుల్లో వర్షాభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. రుతుపవనాలు ప్రారంభమయ్యే జూన్‌, ముగిసే సెప్టెంబరులోనూ దేశవ్యాప్తంగా మంచివర్షాలు కురుస్తాయి’’ అని తెలిపింది. గతేడాదినుంచి పసిఫిక్‌ మహా సముద్రంలో ‘లా నినా’ పరిస్థితులున్నాయని.. ఈసారి రుతుపవన కాలంలోనూ అవి తటస్థంగానే ఉండొచ్చని స్కైమెట్‌ సీఈఓ యోగేశ్‌ పాటిల్‌ తెలిపారు. రుతుపవనాలను దెబ్బతీసే ‘ఎల్‌నినో’ పరిస్థితులకు అవకాశమే లేదన్నారు. స్కైమెట్‌ జనవరి అంచనాల్లోనూ ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని తెలిపింది.