Food

మెదడు చురుకుదనానికి ఆక్రోట్లు

మెదడు చురుకుదనానికి ఆక్రోట్లు

అక్రోటు… మెదడుకి మేత!
పండ్లూ డ్రైనట్సులో… ఏది తీసుకున్నా ఒక్కోదానికీ ఒక్కో రుచి ఉంటుంది. ఆకర్షణీయమైన వాటి రంగో రూపమో చూసి కొన్ని రకాల పండ్లనీ, రుచి కారణంగా మరికొన్నింటినీ ఇష్టంగా తింటుంటాం. కానీ రంగూ రుచీ రూపమూ ఏదీ పెద్దగా నచ్చకున్నా కూడా అందరూ ఇష్టంగా తినే నట్‌ ఒకటి ఉంది. అదే వాల్‌నట్‌ ఉరఫ్‌ అక్రోటు. ఇది ఆరోగ్యాన్నందించే పోషకాహారం మాత్రమే కాదు, ప్రత్యేకించి మెదడు పనితీరుని పెంచే మంచి ఆహారం..!
**అష్టవంకరలతో ఒకలాంటి వగరు రుచితో ఉండే అక్రోట్ల వాడకం మనదగ్గర పెద్దగా లేదనే చెప్పాలి. ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ఈమధ్య నట్స్‌లో భాగంగా వీటిని తినేవాళ్ల సంఖ్య పెరిగింది. నిజంగానే మనిషికి ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం వాల్‌నట్‌. మెదడుని పోలి ఉండే అక్రోటు దాని పనితీరుకీ ఆరోగ్యానికీ తోడ్పడుతుందని పరిశోధనలూ స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ చెట్టుని తెలివితేటలకు సంకేతంగానూ శక్తి కేంద్రంగానూ విశ్వసిస్తారు స్థానిక అమెరికన్లు.
స్టోన్‌ఫ్రూట్స్‌లో ఒకటైన అక్రోటు కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పక్వానికి వచ్చాక తొక్క పగిలి లోపలి గింజ కనిపిస్తుంది. ఆ దశలోనే వాటిని కోసి ఆ గింజని పగులకొట్టి పప్పుని బయటకు తీస్తారు. ఈ పప్పులమీద ఉండే పలుచని పొర గాల్లోని ఆక్సిజన్‌ వల్ల అవి పాడవకుండా రక్షణ కవచంలా పనిచేస్తుందట. అయితే ఒలిచినప్పుడు ఆ పొర చెదరడం వల్ల అవి ఎక్కువకాలం నిల్వ ఉండవు. ఆ కారణంతోనే పెంకుతో ఉన్న అక్రోట్లనే ఎక్కువగా విక్రయిస్తారు.
**తియ్యని వాల్‌నట్స్‌!
రాయల్‌నట్స్‌గా పిలిచే అక్రోట్ల స్వస్థలం పర్షియా, అమెరికా దేశాలైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పండుతోన్న 45 లక్షల టన్నుల అక్రోట్లలో చైనా వాటా 56 శాతం పైనే. అయినప్పటికీ కిర్కిస్థాన్‌లోని బబషటా అడవులు సహజ వాల్‌నట్స్‌కి పెట్టింది పేరు. అక్కడున్న చెట్ల నుంచే ఏటా సుమారు 1500 టన్నుల అక్రోట్లు పండుతాయి. ఆ చెట్లను మహమ్మద్‌ ప్రవక్త వేశాడనీ రెండువేల ఏళ్ల క్రితం అలెగ్జాండర్‌ సైన్యం ఈ అడవుల్లో సేదతీరి వీటిని తిని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లిందనీ, అలా వెళ్లేటప్పుడు కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకెళ్లి గ్రీసులోనూ నాటిందనీ చెబుతారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కలి పట్టణాల్లో డబ్బులకి బదులు వస్తుమార్పిడి పద్ధతిలో కొన్ని అక్రోట్లు ఇచ్చి ఆహారపదార్థాలను తెచ్చుకుంటారట.
కొద్దిపాటి వ్యత్యాసాలతో అక్రోట్లలో రకాలనేకం. కానీ పర్షియాలో పండించే పర్షియన్‌, ఉత్తర అమెరికాల్లో పెరిగే బ్లాక్‌ వాల్‌నట్స్‌… ఈ రెండే ప్రధానమైనవి. హార్టీకల్చరల్‌ నిపుణులూ రైతులూ కలిసి పర్షియన్‌ రకంలోనే అనేక కొత్త వంగడాలను తీసుకురావడంతో అవి ఎరుపు, వంకాయ రంగు, పసుపు, గోధుమ, తెలుపు… ఇలా భిన్న రంగుల్లోనూ ఛాయల్లోనూ పండుతున్నాయి. ఉత్తర అమెరికాలో పెరిగే బ్లాక్‌ వాల్‌నట్స్‌కయితే పెంకూ భిన్నంగానే ఉంటుంది.
మిగిలిన వాల్‌నట్స్‌ కన్నా వీటిల్లో ఔషధగుణాలు ఎక్కువట. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు అభివృద్ధి చేసిన ఎరుపు రంగు అక్రోట్లలో ఆమ్లగుణం తక్కువగా ఉండటంతో అవి కాస్త తియ్యగా ఉంటాయి. కెనడా, తూర్పు ఆమెరికాలో ఎక్కువగా పెరిగే బటర్‌ లేదా వైట్‌ వాల్‌నట్స్‌ ఎంతో రుచిగా ఉంటాయట. వీటిని స్థానికులు వ్యాధులకి మందుగానూ వాడతారు. జపాన్‌కు చెందిన హార్ట్‌ వాల్‌నట్స్‌లో గుండెకు మేలు చేసే మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాల శాతం ఎక్కువగా ఉంటుందట.
రకమేదయినా అక్రోట్లని 25 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తేమ లేకుండా నిల్వ చేయాలి. లేదంటే ఫంగస్‌ చేరి పాడవుతాయి. మనదగ్గర కశ్మీర్‌లోనూ అక్రోట్లు పండుతున్నాయి. వీటిని స్నోవైట్‌ వాల్‌నట్స్‌గా పిలుస్తారు. అక్రోట్లను నేరుగా తినడంతోపాటు కేకులూ కుకీలూ సూపుల్లోనూ వాడుతుంటారు. పచ్చడి లేదా మురబ్బా రూపంలో నిల్వ చేసుకునీ తింటుంటారు. ఇరాన్‌వాసులు సాస్‌ల తయారీలోనూ; చికెన్‌, మటన్‌ కూరల్లో వేస్తుంటారు. ఐస్‌క్రీముల్లోనూ వీటి వాడకం ఎక్కువే. వీటినుంచి నూనెను తీసి మందుల్లో, సప్లిమెంట్లలోనూ వాడతారు.
**ఆరోగ్యానికి అక్రోట్లు!
వాల్‌నట్స్‌ అన్ని రోగాలకూ అంతో ఇంతో మందులా పనిచేస్తాయట. రోగాలకు మూలమైన ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం వీటిల్లో మెండుగా ఉందని గుర్తించారు. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు తోడ్పడటం ద్వారా ఇవి అనేక వ్యాధుల్ని నియంత్రిస్తాయి అంటున్నారు. రోజూ 40 గ్రా. చొప్పున వాల్‌నట్స్‌ తీసుకున్నవాళ్లలో హృద్రోగ సమస్యలు తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరిగిందనీ బీపీ అదుపులో ఉందనీ, దాంతో గుండె ఆరోగ్యం మెరుగైందనీ కూడా గుర్తించారు. వీటిని తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉన్నాయనీ; రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు వచ్చినవాళ్లకి గడ్డలు కూడా తగ్గాయనీ స్పష్టం చేస్తున్నారు. పురుషుల్లో సంతాన సాఫల్యతనీ పెంచినట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
అక్రోట్లు క్రమం తప్పక తినేవాళ్లలో పిత్తాశయ వ్యాధుల శాతం తక్కువట. అలాగే వీటిల్లో అధికశాతంలో ఉన్న కాపర్‌, మెగ్నీషియం, కాల్షియం కారణంగా మృదు కణజాలం పెరగడంతో ఎముకల వ్యాధులూ రావడం లేదట. అన్ని నట్స్‌లోనూ ఆరోగ్యకరమైన మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అయితే మిగిలిన నట్స్‌తో పోలిస్తే వాల్‌నట్స్‌లో లినోలిక్‌, ఆల్ఫాలినోలిక్‌ ఆమ్లంతోపాటు ఇతరత్రా పాలీఫినాలిక్‌ పదార్థాల శాతం ఎక్కువ. ఇవి మెదడు పనితీరుని దెబ్బతీసే ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌లను తగ్గిస్తాయి. దాంతో రక్తసరఫరా మెరుగై నాడీకణాల పనితీరు బాగుంటుంది. అందుకే వీటిని తినేవాళ్లలో ఆల్జీమర్స్‌, మతిమరుపు వంటి సమస్యలు తక్కువగా ఉంటున్నాయి అంటున్నారు. 30-45 గ్రా. వాల్‌నట్స్‌ తిన్న ఎలుకల్లో అధ్యయన శక్తి, జ్ఞాపకశక్తి పెరగడమే కాదు, ఆందోళన తగ్గినట్లూ తేలింది. వృద్ధుల్లో కూడా గతంలో కన్నా వీటిని తిన్నప్పుడు ఆలోచనాశక్తి పెరిగినట్లు గుర్తించారు. అందుకే అక్రోట్లు మెదడుకి మేలు చేసే ఆహారం అంటున్నారు.
మాంగనీస్‌ లోపం వల్ల తలెత్తే మూర్ఛ సమస్యకి వాల్‌నట్స్‌ మంచి సప్లిమెంట్‌ కూడా. వీటిల్లో బయోటిన్‌, విటమిన్‌-ఇ సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకీ చర్మ ఆరోగ్యానికీ కూడా తోడ్పడతాయి.
**నల్లానల్లని అక్రోట్లు!
మిగిలినవాటికన్నా బ్లాక్‌ వాల్‌నట్స్‌లో ప్రొటీన్‌ శాతం 75 శాతం ఎక్కువ. కార్బొహైడ్రేట్లు తక్కువ. దాంతో ఊబకాయులకి ఇవి మరీ మంచివని చెబుతారు. వీటిల్లోని ప్రొయాంథోసైనెడిన్లు కంటిచూపుని పెంచి, యూవీకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తాయట. వీటిల్లో ఎక్కువగా ఉండే ఎలాజిక్‌ ఆమ్లం రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేస్తుందనీ, జగ్లోన్‌ క్యాన్సర్‌ కంతుల్ని నివారిస్తుందనీ చెబుతున్నారు. యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా వీటిల్లో అధికం.
వీటిల్లోని ఆర్జినైన్‌ అనే అమైనో ఆమ్లం శరీరంలోకి వెళ్లాక నైట్రిక్‌ ఆమ్లంగా మారి, రక్తనాళాల్ని వ్యాకోచించేలా చేయడం ద్వారా బీపీనీ తగ్గిస్తుందట. సో, అష్ట వంకరలతో ఉండే అక్రోట్లు ఆరోగ్యానికి చేసే మేలు ఇంతింత కాదయా… అనడం సమంజసమే కదూ!