Politics

వారికి నారా 420 వైరస్ సోకింది-తాజావార్తలు

Kodali Nani Slams Chandrababu Ramojirao ABN Radhakrishna

* కరోనా కట్టడికై ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపడుతోందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకాలు వేశామని, మరిన్ని వ్యాక్సిన్లు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారన్నారు. అయినప్పటికీ, చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులకు ఇవేమీ కనిపించవని, అసత్య ప్రచారాలు చేయడమే వారి పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో నలుగురు వ్యక్తులు ఉన్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. ‘‘రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సిద్దంగా ఉన్నాం. రూ.1600 కోట్లను ఎక్కడి పంపించాలో చెప్పండి.. ఇచ్చేందుకు సిద్ధం. ప్రభుత్వంపై జూమ్‌ యాప్‌లో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలి. ఎవరు చనిపోయినా కరోనాతోనే చనిపోయారని బాబు విష ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో ఎన్‌440కే వైరస్ ఉందని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్‌ 420 అనేది నారావారిపల్లెలో పుట్టింది. చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరుకుంది’’ అని చంద్రబాబు తీరును విమర్శించారు.

* కోవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో)కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్లో‌ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్‌ రూపొందించిన యాంటీ కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. తీవ్రమైన కోవిడ్‌ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్‌డీవో తాజాగా ప్రకటించింది.

* కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ భబతోష్‌ బిశ్వాస్‌, గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.నరేష్‌ ట్రెహన్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లోని 12 మందిలో వైద్య నిపుణులు, డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగం కానున్నారు.

* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారో తెలియదు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 23 మంది ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని బారా హిందూ రావ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మాయమవుతుండడంతో ఆస్పత్రి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

* కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి.. వ‌చ్చిందే త‌డ‌వుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆక్సిజ‌న్ సేక‌ర‌ణ కోసం భ‌ద్రాచ‌లంలోని ఐటీసీ, హైద‌రాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘ‌మేఘాల మీద ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

* తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం కిందట వరకు దాదాపు 8 వేలకు నమోదైన కేసులు ఇప్పుడు ఐదు వేలకు చేరాయి. తాజాగా నమోదైన కేసులు 5,186 కాగా, 38 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొందుతూ డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్‌ విడుదల చేయడం ప్రారంభించింది. నిన్నటి వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు.

* అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్‌ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. కోవాగ్జిన్ టీకా మన హైదరాబాద్‌లోనే తయారవుతున్నా.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఆక్సిజన్ కొరతతో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో 15 మంది, సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో 11 మంది చనిపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు.