Business

అక్షయ తృతీయ నాడు బంగారానికి నో డిమాండ్-వాణిజ్యం

అక్షయ తృతీయ నాడు బంగారానికి నో డిమాండ్-వాణిజ్యం

* బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. ఇదంతా గతం. కోవిడ్‌–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్‌ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్‌ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. పుత్తడి కొనాలన్న సెంటిమెంటూ లేకపోవడంతో శుక్రవారం అక్షయ తృతీయ మెరుపులు కానరాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు.

* చాలా రోజుల విరామం తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ నెల 28న వర్చువల్‌గా ఈ భేటీ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే 43వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19 సంబంధిత ఔషధాలు, ఆక్సిజన్‌ పరికరాలు, వ్యాక్సిన్లు వంటి వాటిపై పన్ను రేట్ల అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

* ఈ మే 17 నుండి 5 రోజుల పాటు చందా కోసం తెర‌వ‌బ‌డే సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం (సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్) ఇష్యూ ధ‌ర గ్రాముకు రూ. 4,777గా నిర్ణ‌యించిన‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మే 2021 నుండి 2021 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 6 విడ‌త‌ల‌లో బాండ్ల‌ను జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్‌బీఐ ఈ బాండ్ల‌ను జారీ చేస్తుంది.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 8 మంది అధికారులకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా, 22 మందిని చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా పదోన్నతులు కల్పించింది. కొత్త డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన మహేశ్‌ కుమార్‌ శర్మ, సంజయ్‌ డి.నాయక్‌, సుబ్రతా బిశ్వాస్‌, రామనాథన్‌ విశ్వనాథన్‌, అమర రామమోహన్‌ రావు, పొలుదాసు కిశోర్‌ కుమార్‌, ఓం ప్రకాశ్‌ మిశ్రా, బాలకృష్ణ రాఘవేంద్రరావు శుక్రవారం నూతన బాధ్యతలు చేపట్టారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్న ఓమ్‌ ప్రకాశ్‌ మిశ్రా ఇప్పుడు డిప్యూటీ ఎండీ అయ్యారు. హైదరాబాద్‌ సర్కిల్‌ జనరల్‌ మేనేజరుగా ఉన్న అజయ్‌కుమార్‌ సింగ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అయ్యారు.

* గూగుల్‌తో స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ జతకట్టారు. వీరిద్దరి కలయికతో ఇప్పుడు ఉపగ్రహానికి హై స్పీడ్ ఇంటర్నెట్, సురక్షిత కనెక్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతని శాటిలైట్-టు-ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్‌ఎక్స్. దీనిని ‘స్టార్‌లింక్’ అని పిలుస్తారు.