Movies

కీర్తి చిత్రంపై వదంతులు

కీర్తి చిత్రంపై వదంతులు

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ దర్శకుడు. సుధీర్‌ చంద్ర పదిరి, శ్రావ్య వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌గా ఎలా మారిందనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దీంట్లో కీర్తి ఓ గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈనెల 3నే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతితో వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందంటూ నెట్టింట వార్తలు మొదలయ్యాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు చిత్ర బృందం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘గుడ్‌ లక్‌ సఖి’ ఓటీటీలో విడుదల కానుందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. దయచేసి వదంతులను ప్రచారం చేయకండి. ఏదైనా కొత్త అప్‌డేట్‌ ఉంటే మేమే వెల్లడిస్తాం. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాం’’ అంటూ నిర్మాతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.