Business

6.5 శాతానికే కోటక్ బ్యాంకు ఇంటి రుణం-వాణిజ్యం

6.5 శాతానికే కోటక్ బ్యాంకు ఇంటి రుణం-వాణిజ్యం

* సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌నుకునే వారికి కొట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ తీపిక‌బురు అందించింది. ఇండ్ల కొనుగోలుదారుల‌కు బ్యాంకు పండుగ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రాబోయే రెండు నెల‌ల వ‌ర‌కూ కొట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను భారీగా తగ్గించింది. రికార్డు స్ధాయిలో కేవ‌లం 6.50 శాతానికే హోం లోన్‌ల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. ఆఫ‌ర్ వ్య‌వ‌ధి సెప్టెంబ‌ర్ 10 నుంచి న‌వంబ‌ర్ 8 వ‌ర‌కూ ఉంటుంద‌ని బ్యాంక్ పేర్కొంది.

* రిల‌య‌న్స్ రిటైల్‌లో ఫ్యూచ‌ర్ గ్రూప్ విలీనం వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ వివాదంపై సింగ‌పూర్ అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని అమెజాన్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ఒప్పందం అమ‌లు చేయొచ్చున‌ని ఎటువంటి ధృవీక‌ర‌ణ నిర్ణ‌యాలు వెలువ‌రించొద్ద‌ని ఎన్సీఎల్టీ, సీసీఐ, సెబీల‌కు కూడా ప్ర‌త్యేక ఆదేశాలు జారీ చేసింది. సింగ‌పూర్ అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టు తుది ఆదేశాల కోసం వేచి చూస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. త‌దుప‌రి ఈ కేసు విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది. రూ.24,713 కోట్ల‌కు రిల‌య‌న్స్ రిటైల్‌లో ఫ్యూచ‌ర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థల మ‌ధ్య గ‌తేడాది ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

* తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించే ముంబైకి చెందిన శ్రీరామ్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌..తెలుగు రాష్ర్టాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి 350 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో 50 శాఖలు ఉండగా, వచ్చే ఏడాదిలోగా వీటిద్వారా నెలకు రూ.100 కోట్ల రుణ వితరణ లక్ష్యంగా పెట్టుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏపీలో రూ.5,730 కోట్లు, తెలంగాణలో రూ.17,970 కోట్ల మేర రుణాలు అందించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ..చౌక ధర కలిగిన ఇండ్లకు ఎనలేని డిమాండ్‌ ఉండటంతో వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

* మ‌హీంద్రాతో ఫోర్డ్స్ జాయింట్ వెంచ‌ర్ ముగిసిన త‌ర్వాత‌ అమెరిక‌న్ బ్రాండ్ భార‌త కార్య‌క‌లాపాల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. భార‌త కార్య‌క‌లాపాల కోసం నూత‌న భాగ‌స్వామిని అన్వేషిస్తున్నామ‌ని ఫోర్డ్ ఈ ఏడాది ఆరంభంలో ప్ర‌క‌టించినా అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. భార‌త్ ఆప‌రేష‌న్స్‌ను ఫోర్డ్ నిలిపివేస్తుంద‌ని మీడియాలో క‌ధ‌నాలు వెల్లువెత్తాయి. ఇక భార‌త్‌లో కార్య‌క‌లాపాల‌ను ముగిస్తున్నామ‌ని, దేశంలో కార్ల త‌యారీని నిలిపివేస్తామ‌ని పోర్డ్ ధ్రువీక‌రించింది.

* అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌. వ్యాపారాలకు అడ్డా. పరిశ్రమలకు నెలవు. రంగం ఏదైనా.. అందులో హైదరాబాద్‌కు ప్రముఖ స్థానం ఉండాల్సిందే. అందుకే భాగ్యనగరంపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకుంటారు. అందుకు తగ్గట్లే ఈ రాజధాని కూడా అందరికీ కావాల్సినన్ని అవకాశాల్ని ఇస్తున్నది. ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా ప్రభావం నుంచీ వేగంగా కోలుకున్న హైదరాబాద్‌.. మునుపటితో పోల్చితే కొలువుల్లో మరింత దూకుడు పెంచి దూసుకుపోతున్నది. దేశ, విదేశీ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాద్‌.. తెలంగాణకేగాక యావత్‌ భారతానికే బ్రాండ్‌ ఇమేజ్‌లా నిలుస్తున్నదిప్పుడు. కరోనా సంక్షోభంలోనూ హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు పదిలంగా ఉన్నాయి. కొవిడ్‌కు ముందున్న పరిస్థితులతో పోల్చితే మరింతగా ఇక్కడి జాబ్‌ మార్కెట్‌ బలపడింది. దేశీయ ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ నౌకరీ.కామ్‌ అనుబంధ విభాగం నౌకరీ జాబ్‌స్పీక్‌ తాజా నివేదిక ఇదే చెప్పింది మరి. మహమ్మారి దెబ్బకు అటుఇటుగా అన్ని రంగాలు కుప్పకూలిన విషయం తెలిసిందే. అయినప్పటికీ భాగ్యనగర వ్యాపార, పారిశ్రామిక మూలాలు పరిపుష్ఠంగానే ఉన్నాయి. దీంతో కరోనా ప్రభావ పరిస్థితుల నుంచి వేగంగానే కోలుకోగలిగాయి. ఈ ఉత్సాహం ఉద్యోగ నియామకాల్లోనూ కొనసాగుతున్నదిప్పుడు.