NRI-NRT

కెనడా “రక్షణ” భారత సంతతి మహిళ చేతిలో!

కెనడా “రక్షణ” భారత సంతతి మహిళ చేతిలో!

భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ కెనడా ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేబట్టిన రెండో మహిళ అనిత. కెనడా క్యాబినెట్‌లో స్థానం సంపాదించిన తొలి హిందువు కూడా తనే. అనిత 2019లో పబ్లిక్‌ సర్వీసెస్‌, ప్రొక్యూర్‌మెంట్‌ మంత్రిగా సేవలందించారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో టీకాల సేకరణలో అనిత చొరవను ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రశంసించారు. ఇప్పటివరకు, భారతీయ మూలాలున్న హర్జీత్‌ సజ్జన్‌ కెనడా రక్షణ మంత్రిగా ఉన్నారు. సాయుధ దళాల్లో లైంగిక దుష్ప్రవర్తన విషయమై సజ్జన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను తప్పించి, అనితకు పదోన్నతి కల్పించారు. అనిత తండ్రి తమిళుడు, తల్లి పంజాబీ. సెప్టెంబర్‌లో జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ అభ్యర్థిగా అనిత ఓక్‌విల్లే నుంచి విజయం సాధించారు. ‘సాయుధ దళాల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నామనుకునేలా చేయడమే నా తొలి ప్రాధాన్యం. అవసరమైనప్పుడు వారికి అండగా నిలుస్తాం. వారికి న్యాయం జరిగేందుకు సంబంధిత వ్యవస్థలు హామీ ఇవ్వాలి’ అని ఆమె పేర్కొన్నారు. అనిత భర్త పేరు జాన్‌. ఆ దంపతులకు నలుగురు పిల్లలు. అనిత వృత్తిరీత్యా కార్పొరేట్‌ న్యాయవాది. అనేక కీలక కేసుల్లో గెలిచి సమర్థురాలిగా పేరు తెచ్చుకొన్నారు. అనిత తల్లి సరోజ్‌ డి.రామ్‌, తండ్రి ఆనంద్‌. ఇద్దరూ వైద్యులే. ‘నా నియోజక వర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఈ విజయం అంకితం’ అంటారామె. ‘కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నా’ అంటూ ట్విటర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు అనిత.