Business

SBI-ATM కొత్త నిబంధన. ఐటీ రంగంలో భారీ వలసలు-వాణిజ్యం

SBI-ATM కొత్త నిబంధన. ఐటీ రంగంలో భారీ వలసలు-వాణిజ్యం

* బ్యాంకు ఖాతాదారులు మోసాల భారిన ప‌డ‌కుండా బ్యాంకులు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్యలు తీసుకుంటూనే ఉంటాయి. దీనిలో భాగంగా అనేక నిబంధ‌న‌లు తీసుకొస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్‌ల వ‌ద్ద జ‌రిగే మోసాల‌ను నివారించేదుకు.. ఖాతాదారులు ఏటీఎమ్‌ల వ‌ద్ద సుర‌క్షితంగా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు ఓటీపీ(ఒన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌) విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీమ్‌ల వ‌ద్ద జ‌రిగే అన‌ధికారిక లావాదేవీల‌ను నుంచి ఖాతాదారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. రూ.10వేలు అంత‌కంటే ఎక్కువ మొత్తంలో న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీపీని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ ఆధారిత న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ విధానం మోస‌గాళ్ల నుంచి వ్యాక్సిన్‌ల ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని ఎస్‌బీఐ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. అయితే ఈ విధానం ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల వ‌ద్ద మాత్ర‌మే అందుబాటులో ఉంది.

* సీనియ‌ర్ సిటిజ‌న్లకు త‌మ ఉద్యోగ విర‌మ‌ణ జీవితాన్ని ఆస్వాదించ‌డానికి వీలు క‌ల్పించే పెట్టుబ‌డి ప‌థ‌కాలు అవ‌స‌రం. వారు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుకు పెట్టుబ‌డులు అవ‌స‌రం. సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ సంప‌ద‌ను పెంచుకోవ‌డానికి వివిధ ర‌కాల పెట్టుబ‌డులు ఉన్నాయి. కొన్ని ప‌థ‌కాలు సాధార‌ణ నెల‌వారీ ఆదాయాన్ని అందిస్తాయి. మ‌రికొన్ని ప‌థ‌కాలు సంప‌దను సృష్టిస్తాయి. పెట్టుబ‌డి ఎంపిక పెట్టుబ‌డి ల‌క్ష్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. వీరికి ఉప‌యోగ‌ప‌డే కొన్ని ప‌థ‌కాలు దిగువ‌న ఉన్నాయి.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ పోర్టు ఫోలియోలో పల్సర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువతను ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్లను జోడిస్తూ, పల్సర్‌ బైక్‌ను బజాజ్‌ నిత్య నూతనంగా ఆవిష్కరిస్తోంది. తాజాగా బజాజ్‌ పల్సర్‌ 250 మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. పల్సర్‌ ఎన్‌250 పేరుతో విపణిలోకి వచ్చిన ఈ బైక్‌ ధర రూ.1.38లక్షలు, దీంతో పాటు, పల్సర్‌ ఎఫ్‌250 రూ.1.40లక్షల ధర(ఎక్స్‌ షోరూమ్‌ దిల్లీ)తో మరో మోడల్‌ను విడుదల చేసింది. సరికొత్త డిజైన్‌, ఫీచర్లతో ఈ బైక్‌లను బజాజ్‌ తీసుకొచ్చింది. 220ఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా పల్సర్‌ 250ఎఫ్‌ను విడుదల చేశారు. గురువారం నుంచే బుకింగ్స్‌ చేసుకోవచ్చని బజాజ్‌ తెలిపింది. నవంబరు మొదటి వారం నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.

* దలాల్‌ స్ట్రీట్‌ కుదేలైంది. భల్లూకం పట్టు నుంచి బయటపడలేక విలవిల్లాడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు.. దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక ‘బేర్‌.. బేర్‌’మంటూ భారీ నష్టాలను మూటగట్టుకుంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమై 60వేల మార్క్‌ను కోల్పోగా.. నిఫ్టీ 18000 మైలురాయి కిందకు పడిపోయింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో దాదాపు రూ.4.5లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం బేర్‌మంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్ల అప్రమత్తతతో సూచీలు కుదేలవుతున్నాయి. బ్యాంకింగ్‌, లోహ, విద్యుత్‌, రియల్టీ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 18వేల మార్క్‌ను కోల్పోయింది.

* ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం (అట్రిషన్‌ రేట్‌) వేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల ప్రభావంతో, డిజిటల్‌ సేవల విస్తరణ పెరిగి.. ఐటీ కంపెనీలకు వినూత్నమైన, భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) తో కూడిన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆయా విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఐటీ కంపెనీలకు అధికంగా కావాల్సి వస్తోంది. అందుకే ఇంజినీరింగ్‌, కంప్యూటర్స్‌ గ్రాడ్యుయేట్లను ఐటీ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అనుభవజ్ఞులైన ఐటీ ఉద్యోగులకు మంచి ‘ఆఫర్లు’ వస్తున్నాయి. పనిచేస్తున్న కంపెనీలో అయితే ఏడాదికి 5-10 శాతం వేతనం పెరుగుతుంది. ఇతర కంపెనీలకు మారితే 20-30 శాతం ఎక్కువ వేతనం ఆశిస్తారు. ఇప్పుడైతే 50 శాతం అధికంగా ఆఫర్లూ వస్తున్నాయి. అందుకే పనిచేస్తున్న కంపెనీని విడిచిపెట్టి, అధిక జీతభత్యాలకు ఇతర కంపెనీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి అధికమైనట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందువల్లే ఐటీ ఉద్యోగుల వలసల రేటు 15 శాతానికి మించినట్లు చెబుతున్నారు.