Sports

ఓడిన కిదాంబి శ్రీకాంత్

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ పోరాడి ఓడాడు. ఫైనల్‌లో సింగపూర్‌ ఆటగాడు కీన్‌యూ చేతిలో 21-15, 22-20 తేడాతో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టిద్దామని భావించిన కిదాంబి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌ మ్యాచ్‌ తొలి సెట్‌ నుంచి విజయం కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మొదటి సెట్‌ను కీన్‌యూ 21-15తో సొంతం చేసుకున్నాడు. ఓటమికి డీలా పడకుండా రెండో సెట్‌లో కిదాంబి అద్భుతంగా పోరాడాడు. ఒక దశలో ఇద్దరు స్కోరు 20-20 చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే కిదాంబి శ్రీకాంత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీన్‌యూ వరుసగా రెండు పాయింట్లు సాధించి 22-20 తేడాతో గెలుపొందాడు. స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. మరోవైపు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఈ సారి రెండు పతకాలు వచ్చాయి. కిదాంబి శ్రీకాంత్‌కు రజతం, సెమీస్‌లో ఓడిపోయిన లక్ష్య సేన్‌కు కాంస్య పతకం దక్కాయి.