Movies

సోనూ సూద్ హీరోగా వస్తున్న చిత్రం ఇదే..

విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్‌ ఈసారి హీరోగా ‘ఫతేహ్‌’ అనే బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదే విషయాన్ని గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘ ఇండియాలో దాగి ఉన్న ఓ శత్రువుపై చేస్తున్న వన్‌ మ్యాన్‌ పోరాటమే ‘ఫతేహ్‌’. 2022 ఏడాదిని మరింత యాక్షన్‌తో స్వాగతిస్తున్నా. ఈ కథ నాలో ఆసక్తిని రేకెత్తించింది. స్క్రిప్ట్ చదివిన వెంటనే, ఇందులో భాగం కావాలని కోరుకున్నా. ఆలోజింపజేసే ఈ కథను అందరి దృష్టికి తీసుకురావడం ఆనందంగా ఉంది’’ అంటూ చిత్ర పోస్టర్స్‌ని విడుదల చేశారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాలకు అస్టిస్టెంట్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అభినందన్‌ గుప్తా.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నారు జీ స్టూడియోస్‌, శక్తిసాగర్‌ ప్రొడక్షన్స్‌, ఫర్హాద్‌ సంజీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సోనూ తెలుగులో చిరంజీవి-రామ్‌చరణ్‌ ‘ఆచార్య’, తమిళ్‌ చిత్రం విజయ్‌ ఆంథోని ‘తమిళరసాన్‌’ హిందీలో అక్షయ్‌ కుమార్‌ ‘పృథ్వీరాజ్‌’ చిత్రాల్లో కనిపించనున్నారు. ఇవన్నీ వచ్చే ఏడాదే విడుదలకానున్నాయి.