Business

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌..! – TNI వాణిజ్య వార్తలు – 30/1/2022

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌..!  – TNI వాణిజ్య వార్తలు – 30/1/2022

* ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌..! ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ఛార్జీలను పెంచుతోంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్‌ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది.

*టెక్నాలజీ కంపెనీ స్మాట్రాన్‌ గ్రూప్‌.. గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ గ్రూప్‌ (జీఈఎం) నుంచి రూ.1,495.80 కోట్ల (20 కోట్ల డాలర్లు) నిధులను అందుకుంది. జీఎఈం.. షేర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ విధానంలో స్మాట్రాన్‌లో ఈ పెట్టుబడులు పెడుతోంది. మహేశ్‌ లింగారెడ్డి ఏర్పాటు చేసిన స్మాట్రాన్‌.. తన సొంత ఏఐఓటీ ప్లాట్‌ఫామ్‌.. ట్రాన్‌ఎక్స్‌ ద్వారా హోమ్‌, మొబిలిటీ, ఆరోగ్య విభాగాల కోసం స్మార్ట్‌, ఇంటలిజెంట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. జీఈఎం పెట్టుబడులతో వచ్చే మూడేళ్లలో స్మార్ట్‌ హోమ్‌, స్మార్ట్‌ ఇన్‌ఫ్రా, ఈవీ, ఎనర్జీ విభాగాల్లో పటిష్ఠమైన వృద్ధిని నమోదు చేసేందుకు అవకాశం లభిస్తుందని మహేశ్‌ లింగారెడ్డి తెలిపారు.

*ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతారెడ్డి అన్నారు. గత దశాబ్దంలో దేశ జనాభా దాదాపు 15 శాతం పెరిగినప్పటికీ, అందుకుతగ్గట్టుగా ఆరోగ్య సంరక్షణ వ్యయంలో సమానమైన వృద్ది లేదన్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్య వ్యయాన్ని 2.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాల్సిన అవసరముందన్నారు. యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ (యూహెచ్‌సీ) లక్ష్యాలకు మద్దతిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరినీ ఆరోగ్య కవరేజీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ ఫైన్సానింగ్‌ విధానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

* ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను మొత్తం ఆదాయం ఏకంగా 244 శాతం వృద్ధితో రూ.207.1 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. 2020 -21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.60.1 కోట్లుగా ఉంది.

*నవభారత్‌ వెంచర్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ రూ.190.93 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.161.79 కోట్లు)తో పోల్చితే లాభం 18 శాతం వృద్ధి చెందింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 42 శాతం వృద్ధితో రూ.709.90 కోట్ల నుంచి రూ.1,005.37 కోట్లకు పెరిగింది.

*కొత్త చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది డిసెంబరులో కేవీ సుబ్రమణియన్‌ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో ఈ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రెడిట్‌ సూయిస్‌ గ్రూప్‌ ఏజీ, జూలియస్‌ బేర్‌ గ్రూప్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన నాగేశ్వరన్‌ శుక్రవారం నాడు సీఈఏగా బాధ్యతలు చేపట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 115.80 శాతం వృద్ధి చెంది రూ.1,502 కోట్లుగా నమోదైందని బ్యాంక్‌ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.696 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం పెరగటంతో పాటు ప్రొవిజనింగ్స్‌ తక్కువ స్థాయిలో ఉండటం కలిసి వచ్చిందని ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ తెలిపారు. త్రైమాసిక సమీక్షా కాలం లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.21,312 కోట్లుగా ఉందన్నారు.