Devotional

ద్వారక సముద్రంలో నిద్దరోతోంది!  కారణాలు ఇవేనా? – TNI ఆధ్యాత్మిక వార్తలు 30/1/2022

ద్వారక సముద్రంలో నిద్దరోతోంది!  కారణాలు ఇవేనా? – TNI ఆధ్యాత్మిక వార్తలు 30/1/2022

ద్వారక సముద్రంలో నిద్దరోతోంది!  కారణాలు ఇవేనా?కృష్ణుడు ఏలిన ద్వారక. కృష్ణుడు నిర్మించిన ద్వారక. సముద్ర గర్భంలో నిద్రపోతోంది . అద్భుతమైన ఆ నిర్మాణం ఆ మురళీలోలుని కధలు పుక్కిటి పురాణాలు కాదని, జరిగిన చరిత్రని చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వేలయేళ్ళనాటి ఆ అద్భుత నగరం సముద్రంలో ఎందుకు మునిగి పోయింది?  భగవానుని నగరాన్ని ముంచెత్తే సాహసం ఆ సముద్రుడు ఎలా చేశాడు? అరేబియా సముద్రంలో జరిగిన  పరిశోధనల్లో వెలుగు చూసిన అవశేషాలు కృష్ణడు నిర్మించిన ద్వారకవేనా? లేక మరేదైన నగరానివా? పరిశోధనలు ఏంచెబుతున్నాయి? పరిశోధకులు ఏమంటున్నారు? సమాధానం  వెదుకుతూ వెళదాం పదండి కడలి గర్భంలోని ద్వారకానగరంలోకి…కృష్ణజననం నాడు, దేవకీదేవి పక్కనున్న పసిగుడ్డుని బుట్టలో పెట్టుకొని గోకులానికి తీసుకెళుతుంటే, వసుదేవుడికి రెండుగా చీలి దారిచ్చింది యమునానది. ఒక నదిని శాశించిన పసివాడు, రాజై నిర్మించిన ద్వారకని ఆ  సముద్రుడు ఎలా తన గర్భంలోకి లాక్కుపోగలిగాడు? 
*భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ పాలించిన ద్వారకానగరం.. వేల ఏళ్లనాటి ఓ అద్బుత నిర్మాణం. సముద్రంపై ప్రణాళికా బద్దంగా నిర్మితమైన స్వర్గధామం. హిందువులు పవిత్రంగా భావించే చార్ ధామ్ లలో ఒకటి.  దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విశ్వవిఖ్యాత మహానగరం. స్వర్ణనిర్మిత స్వర్గధామమ్. మహాభారతంలో ద్వారకను ద్వారావతి అని కూడా పిలుస్తారు. ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంది. జరాసంధుని దండయాత్రల నుంచి మధురను, యదుకులాన్ని కాపాడుకునేందుకు కృష్ణ బలరాములు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు.

*సముద్రుడిచ్చిన భూమి :నిజానికి సముద్రుడే తన గర్భంలో ఈ నగరానికి భూమినిచ్చాడు. కృష్ణపరమాత్మ సాగరంలో నగరం నిర్మించుకునేందుకు సముద్రుని భూమిని అడుగుతాడు. గోమతి నది సముద్రంలో సంగమించే పరిసర తీరంలో, సముద్రంలో నుంచి భూమి ఉబికివచ్చి   కృష్ణుడు నగరం నిర్మించుకునేందుకు అనుకూలంగా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది.

*నిర్మాణ శైలి :గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణా సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా విభజించారు. వెడల్పైన రాజమార్గాలు, పొడవైన రహదారులు,  నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు , గురుకులాలు, రాజభవనాలు, ఉద్యానవనాలు, స్నాన కొలనులు, శత్రుదుర్భేద్యమైన కోటలు, ఇంకెన్నో ప్రజా ఉపయోగకర ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మించబడింది.  క్రీస్తుకు వేల ఏళ్ల పూర్వమే ద్వారకను అధునాతన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. నేటి నగర నాగరికత నాటి విశ్వకర్మ నిర్మితము , శ్రీకృష్ణుని రాజ్యమైన ద్వారకలో కనిపించడం ఆశ్చర్యమే !! ఆ రోజుల్లోనే ద్వారకలో పది లక్షల మంది జనాభా ఉండేవారు. అప్పుడున్న ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ద్వారకలో రాజ్యసభ నిర్వహించే మంటపం పేరు సుధర్మ సభ.  ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. ఇక్కడి నుంచే సుపరిపాలన అందించేవారు. నగరం అందమైన కట్టడాలతోనే కాకండా, ప్రకృతి సోయగాలతోనూ  స్వర్గాన్ని తలపించేది. అందుకే ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు. 

*వెంటాడిన శతృవులు :కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసి పోయిందని వ్యాస మహర్షి రాసిన మహాభారతం ద్వారా తెలుస్తోంది. జరాసంధుని బారినుంచి తనవారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో నగరాన్ని నిర్మించుకుని భీమునితో జరాసంధున్ని అంతంచేయించాడు.  కానీ శత్రుపరంపర శ్రీకృష్ణున్ని వెంటాడడం మాత్రం ఆగలేదు. శిశుపాలుడు ద్వారకపై దండెత్తాడు. అతన్ని కృష్ణుడు సంహరించాడు. ఆ మరణానికి బదులు చెప్పేందుకు సాళ్వుడు కంకణం కట్టుకున్నాడు . సాళ్వుడు శిశుపాలుని సోదరుడని కొందరు, మిత్రుడని మరికొందరు చెప్తారు. సాళ్వుడు గ్రహాంతరవాసులతో సంబంధాలు కలిగి, వారి సాంకేతిక సహాయంలో విమానాల ద్వారా , ఆకాశమార్గంలో ద్వారకపై యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.  
ఇప్పటికీ అంతుచిక్కని ఆధునిక టెక్నాల్జీ కలిగిన విమానాలను, క్షిపణులను సాళ్వుడు ఉపయోగించినట్టు చెప్పుకుంటారు. కృష్ణుడు సాళ్వున్ని సంహరించాక, ద్వారకకు శత్రుపీడ విరగడయ్యిందని సంతోషించే లోపే శాపాలు, పాపాల రూపంలో ద్వారక వినాశనం చుట్టుముట్టింది

___________________

2. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 28,234 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.30 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 12,466 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

3. 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48కోట్లు: టీటీడీ
శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్ల మంజూరుకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్రస్టు ద్వారా చేపట్టే 50 ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం, 42 భజన మందిరాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో శని వారం ఆయన శ్రీవాణి ట్రస్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు, దేవదాయశాఖ సీజీఎఫ్‌ ద్వారా మంజూరు చేసే ఆలయాల నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్‌ డేటాబేస్డ్‌ సిస్టమ్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

4. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే పలు చారిత్రక దేవాలయాల అభివృద్ధి జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ చింతన కలిగిననేత అని అందుకే ప్రజల మనోభావాలకనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దతున్నారని అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్న ను, కొండ పోచమ్మ అమ్మవారి ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కొమురవెళ్లి ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.