DailyDose

TNI నేటి తాజా వార్తలు – 02/02/2022

TNI నేటి తాజా వార్తలు – 02/02/2022

* టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసుపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదించారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని రచనారెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయల్ వివరించారు. డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లువివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది. ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టుకు జేడీ తెలిపారు.

* డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్ అండ్ సిబిసిఎస్) ఎగ్జామ్స్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎగ్జామ్స్ ను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, అదే విధంగా డిగ్రీ (సిబిసిఎస్) రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ ఎగ్జామ్స్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లోని ఆయా అధ్యయన కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

* రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం పీఆర్సీ సాధనా సమితి నేతలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఉద్యోగుల ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉద్యోగుల ర్యాలీ భ నిర్వహించ తలపెట్టిన బీఆర్టీయస్ రోడ్‌లో ఆంక్షలు విధించారు. అలాగే విజయవాడలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసు కమిషనర్ వెల్లడించారు. గురువారం ఉదయం  గంటల నుంచి సాయంత్రం  గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వాహనాలను నిషేధించారు. ప్రజలందరూ ఈ నిబంధనలు పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంఅమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

*సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని Collegium 12 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. 7 గురు న్యాయవాదులు, 5 గురు న్యాయాధికారులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు Collegium సిఫార్సు చేసింది.

* గల్ఫ్ దేశం కువైత్‌ వరుసగా తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి మార్చి 5 వరకు సెలవులు ఉంటాయి. నేషనల్ డే ప్రారంభమయ్యే ఫిబ్రవరి 25 నుంచి సెలవులు మొదలవుతాయి. ఆ తర్వాత లిబరేషన్ డే, ఇస్రా, మీరాజ్ ఇలా అన్ని కలిపి 9 రోజులు హాలీడేస్. తాజాగా ఆ దేశ మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రం వెల్లడించారు. ఇక సెలవుల్లో అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, పబ్లిక్ బాడీస్, మినిస్ట్రీలు, ప్రభుత్వ సంస్థలు పని చేయవు. తిరిగి మార్చి 6న యధావిధిగా అన్ని కార్యాలయాలు తెరచుకుంటాయని తారిఖ్ తెలిపారు.

* ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీ హైకోర్టులో సినిమా టికెట్ల ధరలపై విచారణ జరుగుతోంది. సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ రేట్ల కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ సచివాలయంలో కాసేపట్లో సినిమా టికెట్ రేట్ల ప్రభుత్వ కమిటీ సమావేశం జరగనుంది. సభ్యుల సూచనలపై ఇవాళ మరోసారి కమిటీ చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్ల సవరణ చేసే అవకాశం ఉంది. గత నెలలో ఒకసారి కమిటీ సమావేశమైంది. బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు పెంచాలని.. గత సమావేశంలో ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, కమిటీ సభ్యులు కోరారు.

* విజయవాడలోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్)-ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ, మైనారిటీ కాలేజ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్‌ యూజీ 2021 స్కోర్‌, కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి.
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 811 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 5,586 మందికి పరీక్షలు నిర్వహించగా 646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,513 మందికి పరీక్షలు నిర్వహించగా 165 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మంగళవారం ఇద్దరు చేరారు. 19మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 30 మంది చికిత్స పొందుతున్నారు. 280 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 635మందికి టీకా వేశారు.

* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దపులుల సంచారం కలవరం రేపుతోంది. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని అటవీప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీప్రాంతంలో పులిసంచారాన్ని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు ఓ పులి చిక్కింది. మంగళవారం తెల్లవారుజామున 3:20గంటల సమయంలో అన్నపురెడ్డిపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇప్పటికే ఈ పెద్దపులి ఆనవాళ్లను గుర్తించేందుకు ఎనిమిది బృందాలు గాలిస్తుండగా.. మంగళవారం దాని జాడ సీసీ కెమెరాకు చిక్కిందని రేంజర్‌ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి హాని తలపెట్టలేదని, అయినా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పులి రోజుకు 27కిలోమీటర్ల ప్రయాణం సాగించగలదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్తున్నట్టు అధికారులు చెబుతుండగా… మంగళవారం రేంజర్‌ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాగుపల్లి అటవీప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించామని, వాటి నమూనాలను సేకిరించామని ఆయన తెలిపారు. గతేడాది కూడా పూసుకుంట, అశ్వారావుపేట, దమ్మపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించిందని అప్పుడు సేకరించిన పాదముద్రలు, ఇప్పటి పులి పాదముద్రలు ఒకేలా ఉన్నాయని వివరించారు.

*ఉమ్మడి నల్గొండ జిల్లాలో జల్లుల వర్షంలా పొగమంచు కురుస్తోంది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై , అద్దంకి నార్కెట్ పల్లి రహదారులపై దట్టంగా పొగమంచు అలుముకుంది. వాహనాల హెడ్ లైట్స్ వెలుతురులో ప్రయాణం నిదానంగా సాగుతోంది. మరోవైపు శీతల గాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

*ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఒకవైపు ఉద్యోగుల డిమాండ్లు, నిరసనల వంటివేమీ పట్టించుకోకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ వేతనాలను వారి అకౌంట్ జమ చేసేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో
ఉదయం నుంచి వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో
మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. కాగా.. ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం ఇంకా వేతనాలు పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఐదు డీఏలను కలిపి మరీ వేతనాలను అందించింది. అయితే హెచ్ఆర్ఏలో కోత విధించింది. విజయవాడ విశాఖపట్నంలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం సీసీఏను రద్దు చేసింది.

*దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గారపాటి సాంబశివరావు(80) కన్నుమూశారు. పెదపాడు మండలం నాయుడుగూడెం స్వగృహంలో సాంబశివరావు తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయన పనిచేశారు. సాంబశివరావు మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

*ప్రపంచంలోని 57 దేశాల్లో ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కనుగొన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ కరోనావైరస్ కంటే బీఏ.2 సబ్ వేరియంట్ మరింత అంటువ్యాధి అని అధ్యయనంలో వెల్లడైందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. పది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్న ఒమైక్రాన్ భారీగా పరివర్తన చెందిందని ప్రపంచఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ అప్ డేట్ లో తెలిపింది. కరోనా వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి బీఏ.2 సంబంధించిన సబ్ వేరియంట్ కేసుల్లో స్పష్టమైన పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఏ.2 సబ్ వేరియంట్ వృద్ధిరేటులో స్వల్ప పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్వో కొవిడ్ నిపుణుడు మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కోవిడ్ ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని, ప్రజలు వైరస్ సోకకుండా చూసుకోవాలని మరియా వాన్ కెర్ఖోవ్ నొక్కి చెప్పారు.

*నాగ్పూర్ నగరంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం, ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 144 ప్రకారం నాగపూర్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ దోర్జే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని మంగళవారం మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారి తెలిపారు.నాగ్పూర్ లోని మహల్ ప్రాంతంలో సంఘ్ బిల్డింగ్ రోడ్లో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ భవన్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్, ఎయిర్క్రాఫ్ట్,ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్లు, పారా-గ్లైడర్లు, ఏరో మోడల్లు, పారాచూట్ సంబంధిత కార్యకలాపాలు 3 కిలోమీటర్ల పరిధిలో అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.

*ఈనెల ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఏపీఎ్సఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ యాజమాన్యానికి తెలియజేసింది. ఎన్ఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సహా 12 సంఘాలతో కూడిన జేఏసీ నేతలు 45 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఎండీ ద్వారకా తిరుమలరావుకు అందజేశారు. వేతన వ్యత్యాసం, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, విలీనంతో ఎదురైన ఇబ్బందులు, కార్పొరేషన్లో ఉండగా కోల్పోయిన ప్రయోజనాలు తదితరాలను వివరించారు.

* సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో తొలుత సీబీఐ కేసులను విచారించాలన్న నిందితుల వాదనను ఇప్పటికే హైకోర్టు తిరస్కరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ) మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఈ వ్యవహారంలో న్యాయస్థానం తన తీర్పును రిజర్వుచేసింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా.. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశాలపైనే గతంలో ఆ తీర్పు ఇచ్చిందని.. ప్రస్తుత పిటిషన్లు సైతం అదే దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలయ్యాయని.. అందుచేత వీటిని ప్రత్యేకంగా విచారించాల్సిన
అవసరం లేదని పేర్కొన్నారు.