Business

TNI వాణిజ్య వార్తలు- 02/02/2022

TNI వాణిజ్య వార్తలు- 02/02/2022

*కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల సమీపంలో ఉన్న దాల్మియా సిమెంట్ పరిశ్రమను సీజ్ చేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నోటీస్ జారీ చేసింది. దీంతో ఆ పరిశ్రమలో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిశ్రమకు సమీపంలోనే సిమెంట్ తయారీకి అవసరమైన క్వారీ ఉంది. ఆ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా హైబ్లాస్టింగ్ చేస్తున్నారని, దానివల్ల పెద్దపెద్ద రాళ్లు, దుమ్ము పంట పొలాల్లో చేరుతోందని, సమీపంలోని నవాబుపేటలో సుమారుగా 200కు పైగా ఇళ్లు పగుళ్లు ఇచ్చాయని ఆ గ్రామానికి చెందిన రైతు రెడ్డిపల్లి లక్ష్మీవీర మల్లికార్జునరావు స్పందనలో ఫిర్యాదు చేశారు. స్పందన ఫిర్యాదుకు స్పందించిన మైన్స్ అండ్ సేఫ్టీ డీడీ, పీసీబీ అధికారులు దాల్మియా పరిశ్రమను, క్వారీని, పొలాల్లో పడిన రాళ్లు, దుమ్మును పరిశీలించి మూసివేత నోటీసులు జారీ చేశారు.

*బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్ చార్జింగ్ ఇన్ఫ్రా, గ్రిడ్ స్కేల్ బ్యాటరీ సిస్టమ్స్ వంటి ఆధునిక సదుపాయాలకు సైతం మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఈ సదుపాయాల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కారు చౌకగా రుణాలు లభిస్తాయి. కాబట్టి, ఈ నిర్ణయం ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సునీల్ మిట్టల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు భారీగా లబ్ది చేకూర్చనుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, ఈ విభాగాల్లో అదానీ, మిట్టల్, అంబానీలు ఇప్పటికే భారీ ప్రణాళికలు ప్రకటించారు.

*మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విత్త లోటు 6.9 శాతం ఉండవచ్చని అంచనా. అయితే తుది గణాంకాలు వచ్చే నాటికి పన్ను వసూళ్లు పెరిగితే ఇది కొంతమేరకు తగ్గవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి విత్త లోటు లక్ష్యం 6.4 శాతంగా ప్రకటించారు. 2025-26 నాటికి విత్తలోటు జీడీపీలో 4.5 శాతానికి కుదించాలంటూ గత బడ్జెట్లో తాను చేసిన కన్సాలిడేషన్ ప్రణాళికకు లోబడే ఈ అంచనాలున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. రూపాయి విలువ ప్రకారం విత్తలోటు 2021-22 సవరించిన అంచనాల ప్రకారం రూ.15,91,089 కోట్లుం టే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.16,61,196 కోట్లుంటుందని ఆమె చెప్పారు.

*నష్టాల్లో ఉన్న బీఎ్సఎన్ఎల్కు భారీ మొత్తంలో ప్రభుత్వం నుంచి మూలధన సాయం లభించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ సంస్థకు ప్రభుత్వం రూ.44,720 కోట్ల మూలధన సాయం అందించనుంది. 4జీ స్పెక్ట్రమ్, టెక్నాలజీ నవీకరణ, సంస్థ పునరుద్ధరణ కోసం దీన్ని వినియోగించనున్నారు. మూలధన సాయంతోపాటు స్వచ్ఛం ద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వం టెలికాం దిగ్గజానికి రూ.7,443.57 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించనుంది. జీఎస్టీ చెల్లింపు కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రూ.3,550 కోట్లు ఇవ్వనుంది. వీఆర్ఎ్సకు అందే సాయంతో బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో పథకం అమలు చేస్తారు.

*కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ అపోలో హాస్పిటల్స్ పూర్తి అనుబంధ విభాగమైన ‘అపోలో హెల్త్కో’లో పెట్టుబడులు పెట్టేందుకు జనరల్ అట్లాంటిక్, సాఫ్ట్బ్యాంక్ సహా పలు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అపోలో హెల్త్కో మైనారిటీ వాటా విక్రయం ద్వారా 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,750 కోట్లు) వరకు సమీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అపోలో హాస్పిటల్స్ స్పందిస్తూ.. ‘‘మూలధన సేకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని’’ పేర్కొంది. జనరల్ అట్లాంటిక్, సాఫ్ట్బ్యాంక్ మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.

*పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఆశాజనకంగా ఉండడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గణనీయంగా కోలుకున్న రూపాయి మద్దతుతో ఈక్విటీ మార్కెట్ రెండు రోజుల భారీ నష్టాలకు తెర దించింది. ఆరంభం నుంచి మార్కెట్ సానుకూలంగానే ట్రేడయింది. సెన్సెక్స్ పటిష్ఠంగా ప్రారంభమై రోజంతా వేగాన్ని కొనసాగిస్తూ చివరికి 813.94 పాయింట్ల లాభంతో 58014.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 237.90 పాయింట్ల లాలభంతో 17339.85 వద్ద క్లోజైంది. 4.88 శాతం లాభంతో సెన్సెక్స్ షేర్లలో టెక్ మహీంద్రా అగ్రగామిగా ఉంది. మొత్తం 27 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్యూఎల్ మాత్రం నష్టాల్లో ముగిశాయి.

*ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.310.40 కోట్ల లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.35.44 కోట్లతో పోల్చితే లాభం 775 శాతం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 25.26 శాతం వృద్ధితో రూ.1762.60 కోట్లకు చేరిందని బ్యాంక్ సీఈఓ, ఎండీ సోమశంకర ప్రసాద్ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ బ్యాంకు మెరుగైన పనితీరు ప్రదర్శించిందన్నారు. త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ అంతర్జాతీయంగా 3.03 శాతం ఉండగా దేశీయంగా 3.14 శాతం ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్పీఏలు 9.8 శాతం నుంచి 8 శాతానికి తగ్గాయి. ఎన్పీఏల ప్రావిజన్ కవరేజి నిష్పత్తి 91.3 శాతం ఉంది.

*ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.310.40 కోట్ల లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.35.44 కోట్లతో పోల్చితే లాభం 775 శాతం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 25.26 శాతం వృద్ధితో రూ.1762.60 కోట్లకు చేరిందని బ్యాంక్ సీఈఓ, ఎండీ సోమశంకర ప్రసాద్ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ బ్యాంకు మెరుగైన పనితీరు ప్రదర్శించిందన్నారు. త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ అంతర్జాతీయంగా 3.03 శాతం ఉండగా దేశీయంగా 3.14 శాతం ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్పీఏలు 9.8 శాతం నుంచి 8 శాతానికి తగ్గాయి. ఎన్పీఏల ప్రావిజన్ కవరేజి నిష్పత్తి 91.3 శాతం ఉంది.