Politics

TNI నేటి రాజకీయం 02/02/2022

TNI  నేటి రాజకీయం  02/02/2022

* భారత్‌పై ప్రపంచ దృక్పథంలో మార్పు : మోదీ
మునుపెన్నడూ లేనటువంటి విపత్తు అయిన కోవిడ్-19 మహమ్మారి తర్వాత పరిస్థితులు చాలా మారుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత దేశం కూడా సరికొత్త వెలుగులను చూస్తోందని, భారత్ పట్ల ప్రపంచ దృక్పథంలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో మనం మనపైనే ఆధారపడాలనే లక్ష్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేయడం మనకు తప్పనిసరి అని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మోదీ బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

* 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ: మమత
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ (టీఎంసీ) మద్దతు సమాజ్‌వాదీ పార్టీకి ఇస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు తెలిపారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి టీఎంసీ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. గోవా, త్రిపురలో టీఎంసీ విభాగాలను ఏర్పాటు చేశామని, రాబోయే రెండేళ్లలో పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీని పటిష్టం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని, తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ మొత్తం 42 సీట్లు గెలుచుకునేందుకు గట్టి కృషి చేస్తామని చెప్పారు.

* అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు: కడియం శ్రీహరి
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకునే కొత్త రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే కేసీఆర్‌ అన్నారని ఆయన పేర్కొన్నారు. అసలైన అంబేద్కర్ వారసులం తామేనని, బీజేపీ నేతలు గాడ్సే వారసులని ఆయన తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలని సీఎం సూచన చేశారని శ్రీహరి పేర్కొన్నారు.

* దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలి: జయప్రకాష్
దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ అన్నారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ జిన్నా టవర్ అంశం ముస్లింలు, హిందువుల కోసం కాదన్నారు. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టవర్ పేరు మార్చకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కానీ గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయన్నారు. జిన్నా టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. 26వ తేదీన టవర్‌పై జాతీయ జెండా ఎగుర వేసే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారన్నారు.

* బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరు: పట్టాభిరాం
చిన్న పిల్లలకిచ్చే చిక్కీల్లో కూడా అవినీతికి పాల్పడి వైసీపీ నేతలు మెక్కుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రి కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిక్కీల టెండర్లలో నిభంధనలు మార్చి వాళ్లకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై తాము ప్రశ్నిస్తే మంత్రి సురేష్ బుకాయిస్తున్నారని, బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరని అన్నారు. టీడీపీకి సంబంధించిన కంపెనీలకు టెండర్లు దక్కలేదనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఓ అవినీతి పత్రికలో రాశారని మండిపడ్డారు. కేంద్రీయ బండార్ టీడీపీ కంపెనీనా? కేంద్రీయ బండార్‌లో 68.19 శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందని, కాదని మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్‌సీసీ‌ఎల్ కేంద్ర భాగస్వామ్యంతో ఉన్న కంపెనీ కాదా?.. ప్రభుత్వ రంగ సంస్ధలకు కాదని వేరే కంపెనీలకు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తే.. ఆ కంపెనీలు టీడీపీవి అంటూ అసత్య ప్రచారం చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం టెండర్లు ఇచ్చిన కంపెనీలపై వైసీపీ ఎందుకంత ప్రేమ ఒలకబోస్తుందో?.. వాటి నుంచి మంత్రికి ఎంత ముట్టిందో తేలుస్తామని పట్టాభిరాం అన్నారు.

* సదర్మాట్ బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్‌ సదర్మాట్ బ్యారేజ్ పనులను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఆయా పనుల తీరుపై మంత్రి పనులను పర్యవేక్షించారు.ఇప్పటి వరకు జరిగిన బ్యారేజీ పనుల గురించి వారు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్, నీటిపారుదల శాఖ అధికారులు, కలెక్టర్ ముశర్రఫ్, తదితరులు పాల్గొన్నారు.

* ప్రతి పురుషుడినీ రేపిస్ట్ అనడం సరైనది కాదు : స్మృతి ఇరానీ
ప్రతి పెళ్లినీ దౌర్జన్యపూరితమైనదిగా, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైనది కాదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్)పై సీపీఐ నేత బినయ్ విశ్వం అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానంగా బుధవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ, మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని తెలిపారు. అయితే ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించాలని చెప్పడం సరైనది కాదన్నారు.

* ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ అమలులో వైఫల్యాలపై కాంగ్రెస్ ఆగ్రహం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు బుధవారం జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని బీజేపీ చెప్పిందని, ఇప్పటికి 15 కోట్ల ఉద్యోగాలను ఇచ్చి ఉండవలసిందని చెప్పారు. వాస్తవంగా నేటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రానున్న ఐదేళ్ళలో 60 లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం సమస్య తీవ్రంగా ఉందన్నారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడులు రాకపోవడం, ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని చెప్పారు.

* సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదు: సజ్జల
ఉద్యోగుల సమస్యలపై చర్చలకు సిద్ధమని చెప్పామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా చర్చలకు రవాలని, ఉద్యోగుల కార్యాచరణ పక్కనపెట్టాలని చెప్పామన్నారు. అయినా సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదన్నారు. ఓ విధంగా ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగమన్నారు. వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని సజ్జల ప్రశ్నించారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నందున ఉద్యోగుల ఆందోళనకు పోలీసులు అనుమతివ్వరన్నారు. ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే.. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయని సజ్జల అన్నారు.

*ఉత్తరాఖండ్‌ బరిలో 632 మంది పోటీ
ఈనెల 14న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని 81.43 లక్షలమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. నామినేషన్‌ వేసిన వారి నుంచి 95మంది ఉపసంహరించుకోగా 632 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 136 మంది స్వతంత్ర అభ్యర్థ్ధులున్నారు. డెహ్రాడూన్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 117 మంది, హరిద్వార్‌ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 110మంది పోటీచేస్తున్నారు.చంపావత్, బాగేశ్వర్‌ జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి 14మంది పోటీపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. బరిలో ఎస్‌పీ, ఆప్, బీఎస్‌పీ, యూకేడీ కూడా ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు.

*ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం: సీఎం జగన్
పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులకు మంచి జరగాలని విరమణ వయస్సు పెంచినట్లు తెలిపారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ జూన్‌ 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించినవీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ స్పష్టం చేశారు. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని సూచించారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించగా.. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచినట్లు ఈ సందర్బంగా సీఎం అన్నారు. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశామన్నారు. కారుణ్య నియామకాలు చేయాలని చెప్పామని.. జూన్‌ 30లోగా యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.

*కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీజేపీ దీక్ష: బండి సంజయ్
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవమానించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైందని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు రారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ఎస్సీగా ఉన్న డిప్యూటీ సీఎంను మార్చారని విమర్శించారు. దళిత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. బాబా సాహేబ్‌కు భారతరత్న ఇచ్చింది బీజేపీయేనన్నారు. మూర్ఖుడిని వదిలేస్తే బలుపెక్కి బరితెగిస్తారని, కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.

* రాజ్యాంగాన్ని రద్దు చేయాలనడాన్ని ఖండిస్తున్నా: komati reddy
తెలంగాణ రావడానికి కారణం భారత రాజ్యాంగమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ విజయవాడ మధ్య 6 లైన్ల జాతీయ రహదారి ఏర్పాటుపై నితిన్ గడ్కరీని కలిశామన్నారు. జీఎంఆర్ కాంట్రాక్టు ఉపసంహరణపై చర్యలు తీసుకోవాలని, వేగవంతంగా రోడ్డు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరినట్లు తెలిపారు. మోడీ, కేసీఆర్‌ జోడి అందరికి తెలుసని కోమిటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

* పంజాబ్ కాంగ్రెస్‌లో మరోసారి కలకలం
పంజాబ్ శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేగింది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఎమ్మెల్యేల మద్దతు లేదని ఆ పార్టీ నేత సునీల్ జక్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిష్క్రమించిన తర్వాత పార్టీ అధిష్ఠానం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వీరిద్దరికీ ఎంత మాత్రం మద్దతు కనిపించలేదన్నారు.

* జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా ఓటీఎస్: Tulasi reddy
ఓటీఎస్ పథకాన్ని స్వచ్ఛందం అంటూనే నిర్భందం, బలవంతం చేయడం, లక్ష్యాలు నిర్ధ్యేశించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఒత్తిడిని తట్టుకోలేక జనవరి 31న కడప జిల్లా రాజంపేట మండలం మదనగోపాలపురం వీఆర్వో ఆత్మహత్య ప్రయత్నం చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని చెప్పారు. ఓటీఎస్ పథకం జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా తయారైందని విమర్శించారు. పేదల నుండి రూ.5 వేల కోట్లు దోచుకునే దోపిడీ పథకం ఇది అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు పేదల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఓటీఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

* కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు.. కంత్రీ చంద్రశేఖరరావు: DK aruna
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చి.. కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదన్నారు. దళితులను మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు. ప్రధాని కుర్చీ కోసం.. వేల కోట్లను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ పంపుతున్నారని ఆరోపించారు. బూతు పురాణాం‌ మానుకోకుంటే.. కేసీఆర్ నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు.. కంత్రీ చంద్రశేఖరరావు అని వ్యాఖ్యలు చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ? తనను చెప్పులతో కొట్టటానికి ప్రజలు సిద్ధమైనట్లు కేసీఆర్ గ్రహించారన్నారు. మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ నేత తెలిపారు. దేశ ప్రధానిపై మెంటల్, పిచ్చి ఎక్కినట్లు కేసీఆర్ మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* బడ్జెట్‌ను నిరసిస్తూ ఏపీలో వామపక్షాల నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరిసిస్తూ ఏపీలో వామపక్షాలు నిరసనకు దిగాయి. సీపీఎం, సీపీఐ నేతలు కేంద్రం తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ఆర్థిక మంత్రి నోట కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వినపడలేదంటే.. కేంద్రం రాష్ట్రం పట్ల ఎంత వివక్ష చూపుతోందో అర్థమవుతోందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరినా ఇస్తాం.. ఇస్తామంటూ చివరికి కేంద్రం ఏపీకి మొండిచెయ్యి చూపించిందని మండిపడ్డారు. అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైందని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు.

* కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీరు: మంత్రి Talsani
కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి తలసానికి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు అవుతోందన్నారు. ‘‘కంటోన్మెంట్ ప్రజలు కూడా మా బిడ్డలే.. వారిని కన్నబిడ్డలుగా తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటది’’ అని చెప్పుకొచ్చారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ధి చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని మంత్రి తలసాని కోరారు.

* మరోసారి రాజ్యాంగం మారస్తామనే చర్చ తెస్తే…: Kodandaram
మరోసారి రాజ్యాంగం మారుస్తామనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తా అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఫ్యూడల్ ఆలోచనలు ఉన్న కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఏం అర్థం అవుతుందని యెద్దేవా చేశారు. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగం మార్పు చేస్తాం అంటున్నారని ఆయన మండిపడ్డారు. అప్రజాస్వామిక.. అరాచక పాలనను ఎదుర్కునేందుకు త్వరలోనే ప్లీనరీ నిర్వహించుకుని.. తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. కూడబలుక్కుని విలాసాలు.. విందులకు ఖర్చు చేస్తా అంటే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు.

* టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు సంచలన వ్యాఖ్యలు
నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పార్టీలు, కులమతాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేసేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజులకు వందల కోట్లు ముడుపులు అందాయని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్, వశిష్ట వారధి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే జీవోలు వచ్చాయని… ఇప్పుడు మంజూరైనట్లు ఎమ్మెల్యే ముదునూరి చెప్పేవన్నీ అబద్ధాలే అని అన్నారు. జిల్లా కేంద్రం చేజారి పోయి ప్రజలు బాధపడుతుంటే ఎమ్మెల్యే ముదునూరి పార్టీ కమిటీలు వేసుకోవటం సిగ్గుచేటని బండారు మాధవనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*తెలంగాణపై కేంద్రం చిన్న చూపు: షర్మిల
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర బడ్జెట్పై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. బడ్జెట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావించలేదని మండిపడ్డారు. నిజామాబాద్కు పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ‘అభయహస్తం’ పునఃప్రారంభించండి పేదల పక్షపాతిగా వైఎస్ఆర్ తీసుకువచ్చిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ తెచ్చిన అభయహస్తం పథకాన్ని మళ్లీ అమలుచేయాలని వేదికగా డిమాండ్ చేశారు.