Politics

మోడీని తిట్టటానికే ప్రెస్ మీట్ లా – TNI రాజకీయ వార్తలు 13/02/2022

మోడీని తిట్టటానికే ప్రెస్ మీట్ లా – TNI రాజకీయ వార్తలు 13/02/2022

* ప్రధాని మోదీని తిట్టడానికే సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు అని అర్థమైందని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామని అసత్య ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. రైతుల ఖాతాల్లో అడ్వాన్స్‌గా డబ్బులు వేస్తే వాళ్లే డిస్కంలకు కట్టుకుంటారని తెలిపారు. రైతుల బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. దళితబంధు పథకం ఎస్సీల కోసమా.. టీఆర్‌ఎస్ కార్యకర్తల కోసమా? అని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం ఏంటి? అని నిలదీశారు. కేసీఆర్‌ సీఎం కుర్చీ పర్మినెంట్ కాదని ఉద్యోగులు గుర్తించాలని డీకే అరుణ హెచ్చరించారు.

* ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు చేసి తీరుతాం : ఏపీ మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని తెలిపారు. రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కేంద్రం కూడా చెప్పిందన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని వివరించారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయం అప్పటి విభజన చట్టంలో ఉందని, రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ విషయంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

* జగన్‌రెడ్డి అసమర్థ సీఎం: అనిత
వైసీపీ పాలనలో మహిళలకి రక్షణ కరువైందని టీడీపీ నేత వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి పాలన అంతమొందించేందుకే నారీ సంకల్ప దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. మద్యపాన నిషేదం అమలు చేస్తామన్న జగన్‌రెడ్డి మాట తప్పారని దుయ్యబట్టారు. మహిళలపై అఘాయిత్యాలను జగన్‌ అరికట్టలేకపోతున్నారని తప్పుబట్టారు. డ్వాక్రా సంఘాలను జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్‌రెడ్డి అసమర్థ సీఎం అంటూ అనిత ధ్వజమెత్తారు

* పశ్చిమ బెంగాల్ గవర్నర్, తమిళనాడు సీఎం మధ్య ట్విటర్ వార్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య ట్విటర్ వేదికగా వాడివేడి సంభాషణ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసన సభను ప్రొరోగ్ చేయడంపై స్టాలిన్ ఆక్షేపణ తెలిపారు. స్టాలిన్ వాస్తవాలను తెలుసుకోకుండా పరుషంగా మాట్లాడారని ధన్‌కర్ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుతో శాసన సభను గవర్నర్ శనివారం ప్రొరోగ్ చేశారు. స్టాలిన్ ఇచ్చిన ట్వీట్లలో దీనిపై పరుషంగా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆ రాష్ట్ర శాసన సభ సెషన్‌ను ప్రొరోగ్ చేస్తూ తీసుకున్న చర్య ఎటువంటి ఔచిత్యం లేనిదని, ఉన్నత స్థాయి పదవిని నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి ఇటువంటిదానిని ఆశించడం లేదని, నియమాలు, సంప్రదాయాలకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు. రాష్ట్ర నామమాత్రపు అధిపతి రాజ్యాంగాన్ని బలపరచడంలో ఆదర్శప్రాయంగా వ్యవహరించాలన్నారు. పరస్పరం గౌరవించుకోవడంలోనే ప్రజాస్వామ్యపు సౌందర్యం ఉంటుందన్నారు. దీనిపై గవర్నర్ ధన్‌కర్ సమాధానమిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుగ్రహ దృష్టిని అత్యంత గౌరవప్రదంగా ఆహ్వానించడం అసాధారణంగా అత్యవసరమని గుర్తించానని తెలిపారు. యథార్థాలకు ఎంత మాత్రం అనుగుణంగా లేని పరుషమైన, బాధించే తీవ్ర వ్యాఖ్యలను ఆయన చేసినట్లు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. ఆర్డర్ కాపీని జత చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టంగా కోరిన తర్వాత మాత్రమే శాసన సభను ప్రొరోగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ ట్వీట్‌తో జత చేశారు. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ మాట్లాడుతూ, శాసన సభను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ధన్‌కర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆయన సొంతంగా తీసుకోలేదన్నారు. రాష్ట్ర కేబినెట్ సిఫారసు మేరకు ఆయన ప్రొరోగ్ చేశారన్నారు. ఈ విషయంలో ఎటువంటి అయోమయం లేదన్నారు.

* చన్నీ, కేజ్రీవాల్‌పై అమిత్‌షా ఎదురుదాడి
దేశ ప్రధానికి రక్షణ ఇవ్వడంలో పంజాబ్‌లోని చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ప్రధానికే రక్షణ కల్పించలేకపోయిన వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడగలుగుతారని ప్రశ్నించారు. పంజాబ్‌లో లూథియానాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ, చన్నీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల పంజాబ్‌ పర్యటనలో ప్రధాని 20 నిమిషాల సేపు ఫ్లైఓవర్‌పైనే నిలిచిపోవడాన్ని ఆ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యూపీఏ తరహాలో కాకుండా దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు.

* అసోం సీఎం వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయి: రేవంత్
అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ మాటలు దేశంలోని మాతృమూర్తులందరిని అవమానించేలా ఉన్నాయని, ఆయన మాటలు ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భారత సంప్రదాయాలకు వారసులమని చెప్పుకునే ప్రధాని మోదీ వెంటనే అసోం సీఎంను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణలోని 709 పోలీస్ స్టేషన్‌లలో హిమంత బిశ్వపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. క్రిమినల్ కేసులు పెట్టాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం తానే స్వయంగా ఫిర్యాదు చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు

* టీడీపీ, బీజేపీలపై మంత్రి పేర్ని నాని విసుర్లు
టీడీపీ, బీజేపీలపై మంత్రి పేర్ని నాని విసుర్లు విసిరారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి ప్రోద్భలంతో కేంద్రం అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిందని ఆయన ప్రశ్నించారు. అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నాడని పేర్కొన్నారు. అజెండాలో నుండి తొలగించిన తర్వాతే టీడీపీ, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.

*మోదీ, షాలకు చరిత్ర తెలియదు : చిదంబరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చరిత్ర తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గోవా శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, ఐదు నిమిషాల్లోనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతామన్నారు.
గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న పి చిదంబరం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2017లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత గోవా శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, ఐదు నిమిషాల్లోనే గవర్నర్‌ను కలుస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతామని చెప్పారు. టీఎంసీతో పొత్తు గురించి తమ పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలేవీ లేవని తెలిపారు.

*సీఎం జగన్ రిప్రజెంటేషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు: పయ్యావుల
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రిప్రజెంటేషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా?.. లేక ప్రధాని మోదీ జగన్‌ను మోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ వర్సెస్ ఈడీ కేసెస్‌ల ఉందన్నారు. బీజేపీకి, వైసీపీకి దృఢమైన సంబంధం ఉందని, ఆ బంధం ఎలాంటిదో పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైందన్నారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారని, బీజేపీ ఎంపీల కన్నా వైసీపీ రాజ్యసభ సభ్యులు గొప్పగా పొగడ్తలు కల్పిస్తున్నారని విర్శించారు. ప్రత్యేక హోదా రావాలని జగన్‌కు లేదన్నారు. కొత్త గవర్నమెంట్ రాగానే మోదీకి సీట్లు ఎక్కువ వచ్చాయని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీఎం జగన్ మౌనం వీడినప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పయ్యావుల కేశవ్ అన్నారు.

*కెప్టెన్ అమరీందర్ ప్రభుత్వాన్ని బీజేపీ నడిపింది : ప్రియాంక గాంధీ వాద్రా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పంజాబ్ శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణాన్ని వివరిస్తూ, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ నడిపించిందని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించి, చరణ్ జిత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కెప్టెన్ సింగ్ పేరును ప్రత్యక్షంగా పేర్కొనలేదు.ఏదో తప్పు జరుగుతోందని మాకు తెలుసు. కాబట్టే నాయకత్వాన్ని మార్చాం. మీతోపాటు కలిసి ఉండే చరణ్ జిత్ సింగ్ చన్నీని తీసుకొచ్చాం. మీ సమస్యలు ఆయనకు తెలుసు, వాటిని మీతోపాటు ఆయన కూడా సమస్యలుగా భావిస్తారు ’’ అని ప్రియాంక చెప్పారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్ అనేక దశాబ్దాలపాటు గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా మెలిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబరులో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ, ఎస్ఏడీ (సంయుక్త్)లతో పొత్తు పెట్టుకున్నారు.

*పొత్తుల కోసం కేసీఆర్ పాకులాడుతున్నారు: రఘునందన్‌రావు
పొత్తుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాకులాడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కంటే గొప్పగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై సీఎం కేసీఆర్ సానుభూతి చూపించారని తప్పుబట్టారు. కాంగ్రెస్ నేత సోనియాటీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ కళ్లల్లో నీళ్లెందుకు రాలేదుఅని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవకుండా కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని రఘునందన్‌రావు విమర్శించారు.

*ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ కార్యాచరణ ప్రకటించాలి: కనకమేడల
ప్రత్యేకహోదా సాధన కోసం సీఎం జగన్ కార్యాచరణ ప్రకటించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా కోసం కేంద్రంపై జగన్ పోరాడితే కలిసి నడవడానికి టీడీపీ సిద్ధమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం 28 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. నలుగురు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. జగన్‌రెడ్డి దాగుడు మూతలాడుతున్నారని తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వం అడగకపోవడం వల్లే.. హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారని పేర్కొన్నారు. జగన్ స్వప్రయోజనాల కోసం హోదా అంశాన్ని వాడుకుంటున్నారని, కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌రెడ్డి బయటకు రావాలని కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు.

*దేశంలో విధానాలన్నీ మోదీ ఇద్దరు మిత్రుల కోసమే : ప్రియాంక గాంధీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం రూపొందుతున్న విధానాలన్నీ మోదీ ఇద్దరు మిత్రుల ప్రయోజనం కోసమేనని ఆరోపించారు. ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఖటిమా సిటీలో ఓ బహిరంగ సభలో మాట్లాడారు.

*టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఉంది: పంచుమర్తి
టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. శనివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ ‘‘నేడు దివాళాంధ్రప్రదేశ్‌గా మారింది. అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెడుతోంది. సీఎం జగన్ రెడ్డి తనఖా రెడ్డిగా మారిపోయారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి బాగోలేందంటూ నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు నవరత్నాలతో నాటకాలాడుతున్నారా?. మధ్యం ధరలు, ఆస్తిపన్ను, యూజర్ చార్జీలు, ‎ఆర్టీసీ చార్జీలు పెంచి.. పన్నులతో ప్రజలపై అధనంగా రూ.70 వేల కోట్ల భారం మోపారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డబ్బులున్నీ ఏం చేశారు? తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్తున్నాయా? సినిమావాళ్ల ఆత్మభిమానం దెబ్బతినేలా జగన్‌ వ్యవహరిస్తున్నారు’’ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

*ఏపీ మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ ఫైర్‌..
మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొడాలి నానిపై తీవ్రమైన పదజాలం వాడారు. మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బూతుల మంత్రి తన వ్యవహారంతో కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని దేవినేని ఉమ దుయ్యబట్టారు. చంద్రబాబు రాజకీయంగా బిక్ష పెట్టడం వల్లనే ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని కొడాలి నాని మరిచిపోవద్దన్నారు. చంద్రబాబుపై మంత్రి నాని తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు

*ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది?: చంద్రబాబు
ఎమ్మెల్సీ అశోక్‌బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన అశోక్‌బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదు. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది? ఎప్పటికైనా మిమ్మల్ని జగన్‌రెడ్డి బలిపశువులను చేస్తారు. ప్రజా సమస్యలపై పోరాడడం తప్పా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుంది. ఇకపై ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం’’ అని పేర్కొన్నారు.

*బీజేపీ బిస్కెట్లకు అస్సాం సీఎం అమ్ముడుపోయాడు: Dayakar
రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ బిస్కెట్లకు అస్సాం సీఎం అమ్ముడుపోయాడని మండిపడ్డారు. మోదీ భార్యతో ఎందుకు సహజీవనంలో లేడని కాంగ్రెస్ ఏనాడైనా ప్రశ్నించిందా? అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని కేసీఆర్ మాట్లాడితే.. మోదీ నోరు తెరవరన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై పార్లిమెంట్ సాక్షిగా మోదీమాట్లాడితే.. కేసీఆర్ మాట్లాడడరన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే టీఆర్‌ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగేతర శక్తులుగా బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు మారాయని అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు చేశారు.

*మా హిజాబ్‌ను తాకితే చేతులు న‌రుకుతాం : ఎస్పీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
హిజాబ్ వివాదంపై స్పందిస్తూ స‌మాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నాట‌క‌లోని కొన్ని విద్యాసంస్ధ‌ల్లో డ్రెస్ కోడ్ అమ‌లు, హిజాబ్‌పై నిషేధం క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం నేప‌ధ్యంలో ఎవ‌రైనా మా హిజాబ్‌ను ట‌చ్ చేస్తే వారి చేతులు న‌రుకుతామ‌ని ఎస్పీ నేత రుబినా ఖానుం హెచ్చ‌రించారు. క‌ర్నాట‌క‌లోని ఉడిపిలో ప్ర‌భుత్వ ప్రీ యూనివ‌ర్సిటీ కాలేజ్‌లోకి హిజాబ్ ధ‌రించిన విద్యార్ధినుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వివాదం రాజుకుంది.ఈ ఘ‌ట‌న‌తో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో హిజాబ్ బ్యాన్‌పై నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఆందోళ‌న‌ల‌తో స్కూళ్లు, కాలేజీలు అట్టుడ‌క‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్ధ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. ఆయా విద్యాసంస్ధ‌ల యాజ‌మాన్యాలు నిర్ధేశించిన యూనిఫాంను అనుస‌రించాల‌ని విద్యార్ధినీ విద్యార్ధుల‌కు క‌ర్నాట‌క ప్‌ భుత్వం సూచించింది. డ్రెస్ కోడ్‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌కు సంబంధించి త‌దుప‌రి ఉత్తర్వులు వెలువ‌రించేవ‌ర‌కూ రాష్ట్రంలో విద్యాసంస్ధ‌ల్లోని త‌ర‌గ‌తి గ‌దుల్లో ఎలాంటి మ‌త‌ప‌ర‌మైన డ్రెస్‌లు ధ‌రించ‌రాద‌ని క‌ర్నాట‌క హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అంత‌కుముందు హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ బీజేపీ నేతృత్వంలోని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం విద్యార్ధినుల భ‌విష్య‌త్‌తో చెల‌గాట‌మాడుతోంద‌ని విమ‌ర్శించారు.

*ప్రెసిడెన్షియల్ సూట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్‌ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.

* కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి: VH
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు, పలు జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టాలంటూ వస్తున్న డిమాండ్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరారు. అంబేద్కర్ ఆలోచనను తూచా తప్పకుండా అమలు చేసిన నేత దామోదరం సంజీవయ్య అని అన్నారు. సంజీవయ్య పేరు పెడితే భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు. అన్నమయ్య, ఏన్టీఆర్ పేర్లు జిల్లాలకు పెట్టారని… సంజీవయ్య పేరు పేట్టాలన్న ఆలోచన, కోరిక తమకు కలిగిందని చెప్పారు. సీఎం జగన్ స్పందించి దామోదరం సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరారు. సంజీవయ్య శతజయంతి సంధర్బంగా ఆయన పేరు జిల్లాకు పెట్టి గౌరవించాలన్నారు. చదువు అవకాశం లేని కాలంలో మున్సిపల్ స్కూల్‌లో చదివి సంజీవయ్య మహోన్నత స్థాయికి చేరుకున్నారని వీహెచ్ పేర్కొన్నారు.

* ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తాం : బీజేపీ
మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని రూపొందించి, అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 14న జరిగే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న ధామి శనివారం మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే యూసీసీ ముసాయిదాను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

* ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆ వర్గానికే కేటాయించాలి: Ramakrishna
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆ వర్గానికే కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో జై భీం యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 2011 జనాభా ప్రకారం రాష్ట్రం లో 24 శాతం ఎస్సీ, ఎస్టీ జనాభా ఉండవచ్చన్నారు. 24 శాతం నిధులు బడ్జెట్‌లో వాళ్లకు కేటాయించాలని, ఆ నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ బడ్జెట్‌లో దళిత, గిరిజన, పేద వర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని తెలిపారు. కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కేంద్ర బడ్జెట్‌లో న్యాయం జరిగిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోత వేశారంటే దళితులకు కోత వేశారన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్లా వీరికి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పారు. ఇలాంటి సమావేశాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచినందున జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం కొత్త ఉద్యోగాలు రావని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

* మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బోండా ఉమ ఫైర్
మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బోండా ఉమ ఫైర్ అయ్యారు. టీడీపీపై విషప్రచారం చేయడమే కొడాలి నాని పనిగా పెట్టుకున్నారన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడితే టీడీపీ అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దమ్ముంటే ఎన్టీఆర్ పేరు వద్దన్నట్లు ఆధారాలుంటే చూపాలని బోండా ఉమ సవాల్ విసిరారు. కొడాలి నానికి తన శాఖలో ఉన్న తప్పులు, లెక్కలపై కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి అశోక్‌బాబును అరెస్ట్ చేయడమేంటని బోండా ఉమ ఫైర్ అయ్యారు. కేసినో పెట్టి.. మహిళలతో డ్యాన్స్‌లు వేయించిన నానిపై కేసు లేదన్నారు. ‘విచారణాధికారి ఏమయ్యారు? డీజీపీ నోరు ఎందుకు మెదపరు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోండా ఉమ పేర్కొన్నారు.

*అయ్యా కేసీఆర్ గారు… మోదీని తరుముడు ఏమో గానీ…: Sharmila
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టాలని హితవుపలికారు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మోదీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ… నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో. మీరు పులి బిడ్డయితే… మొన్న మీ మెడ మీద లేని కత్తిని చూసి… వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి, ఈరోజు ఉడుతఊపుల పంచాయితీ పెట్టారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? అని యెద్దేవా చేశారు. ‘‘గాలిలో మేడలు…పగటి కలలు…ఓట్ల కోసం తిప్పలు’’ అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.

*కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నాడు: బండి సంజయ్
కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో.. అంబేద్కర్‌ రాజ్యాంగం కావాలో ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తన అవినీతిపై విచారణ ప్రారంభమైందనే సీఎం కేసీఆర్ ఫ్రస్టేట్ అవుతున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘త్వరలో జనగామలో బీజేపీ బహిరంగ‌ సభ, కేసీఆర్‌కు దమ్ముంటే అడ్డుకోవాలి. యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? దళితబంధు టీఆర్ఎస్ రాబంధుల చేతుల్లో బందీ అయ్యింది. ఢిల్లీ కోట కాదు.. తన కుటుంబ కోట బద్దలు కాకుండా కేసీఆర్ చూసుకోవాలి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందా? కేంద్రం వల్లనే తెలంగాణలో ఉచిత విద్యుత్ లభిస్తోంది. డబుల్ బెడ్ రూంలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి దళితబంధు అమలు కోసం బీజేపీ పోరాటం చేస్తోంది. 317 జీవోను సవరించే వరకూ బీజేపీ పోరాడుతుంది’’ అని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*విశాఖ ఉక్కు సంకల్పానికి నేటితో ఏడాది పూర్తైంది: నారా లోకేష్
విశాఖ ఉక్కు సంకల్పానికి నేటితో ఏడాది పూర్తయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కంటూ నినదిస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకూ టీడీపీ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పాటై, వేలాది మందికి ఉపాధి కల్పతరువుగా మారిన విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేయడం బాధాకరమన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు.

*తృణమూల్లో ట్వీట్ చిచ్చు
తృణమూల్ కాంగ్రెస్లో ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్ సన్నిహితులు అదితి, ఆకాశ్ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్ సూచిస్తున్నారు.

*ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు: మంత్రి పేర్నినాని
నటుడు మోహన్బాబు చిరకాల మిత్రుడు, కాఫీకి ఆహ్వానించారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ను కలిసిన సినిమావాళ్లకు వైసీపీ సభ్యత్వం ఉందా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. నిన్నటి భేటీపై ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. తాను చెప్పిన తర్వాతే విష్ణు అప్డేట్ చేశారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

*అశోక్బాబును అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు: ఎంపీ రఘురామ
తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. జగన్ రెడ్డి డైరెక్ట్గా జైలుకు వెళ్లారు.. కాబట్టి ఏమీ తెలియదన్నారు. అశోక్బాబు తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి తెలిసిన వారితో పిటిషన్ వేయించి సీఐడీతో అశోక్బాబును అరెస్ట్ చేయించారని విమర్శించారు. అర్ధరాత్రి అరెస్ట్ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. సీఎం జగన్కు.. సీఐడీకి ఉన్న బంధం ఏంటో తెలియదన్నారు. అశోక్బాబును అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని రఘురామ అన్నారు.

*మీరు చేసిన మోసాలూ చెప్పండి మోదీజీ!: చలసాని
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై మాట్లాడడం చేతకాక సీఎం జగన్ మౌనంగా ఉంటున్నారని ప్రత్యేకహోదా, విభజన హామీల సాధ న సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు సంబంధించి రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానన్నారు. ఏపీకి చేస్తున్న అన్యా యం గురించి కూడా మోదీ చెప్పి ఉంటే బాగుండేదని చురకలు వేశారు. విజయవాడలో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఇక్కడ మాట్లాడి, ఢిల్లీలో మౌనవ్రతం చేస్తున్నారని విమర్శించారు.

*పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సీట్లను గెలుస్తుందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ఆయన గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పనాజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ ‘‘ఈసారి గోవాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. తొందరలోనే మేం గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి (గోవా) వచ్చాను. గోవాని కోల్ మైనింగ్గా చూడాలని ఎవరూ అనుకోవడం లేదు. గోవా అద్భుతమైన పర్యాటక కేంద్రం, అద్భుతమైన సంస్కృతి కలిగినది. అలాంటి గోవానే ముందు వారికి అందిద్దామని చెప్పడానికి వచ్చాను’’ అని రాహుల్ అన్నారు.

*నకిలీ లౌకికవాదులకు గులామీ చేయొద్దు: ఓవైసీ
లౌకికవాదులనే చెప్పుకునే పార్టీలు ముస్లింలను ఉపయోగించుకుని వదిలేశాయని, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వకు భయపడి మైనారిటీల హక్కుల గురించి కనీసం మాటైనా మాట్లాడటం లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు