NRI-NRT

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు మృతి

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు మృతి

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్(26) మృతి చెందాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్‌ ద్వారా తెలియజేశారు. జైన్ పుట్టినప్పటి నుంచి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సెరెబ్రల్ పాల్సీతో బాధపడేవారిలో పుట్టుకతోనే మెదడు దెబ్బతిని ఉంటుంది. అందుకే బ్రెయిన్‌కు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. దీనికారణంగా వారు లేచి నడవలేరు. వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.జైన్ నాదెళ్ల.. పిల్లల ఆస్పత్రి అయిన సీటెల్ చైల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో ఎక్కువగా చికిత్స పొందారు. ఈ ఆస్పత్రి పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెల్లా ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి నాదెళ్లతో గత ఏడాది చేతులు కలిపింది. కాగా, సత్యనాదెళ్లకు కుమారుడితో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంగ వైకల్యం కలిగిన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు పలు కొత్త ఉత్పత్తులను రూపొందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.