DailyDose

భర్తపై రేప్‌ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు

భర్తపై రేప్‌ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు

*సమ్మతి లేని సంభోగం నేరమే
*’భర్త’ అనే ముసుగులో ఇష్టారాజ్యం కుదరదు
*తప్పనిసరిగా విచారణార్హమే.. చట్టాలు మారాలి
*మహిళల మౌనరోదనను పాలకులు పట్టించుకోవాలి

★ తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది.

★ ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది.

★ మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది.

★ ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది.

★ వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్‌ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది.

★ చారిత్రక చర్చకు తెరలేపింది.

★ కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది.

లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్‌ కాదు!

★ సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా… ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్‌ కాదని జస్టిస్‌ నాగప్రసన్న పేర్కొన్నారు.

★ పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు.

★ అయితే భారత్‌లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్‌ రేప్‌ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు.

★ భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్‌ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు.

★ బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు.

★ అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు.

★ తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు.

★ భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే.

★ భర్తకు రేప్‌ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్‌ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు.

★ నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే.

★ స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది.

★ అందువల్లే చాలాదేశాలు మారిటల్‌ రేప్‌ను నేరంగా చేశాయి.

★ యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్‌… తదితర దేశాలు మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్‌ నాగప్రసన్న ఎత్తిచూపారు.

★ భారత్‌లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్‌ రేప్‌ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు.