Food

గిరిజనుల కల్పవల్లి ‘ఇప్ప’..దీని విశిష్టతలు తెలిస్తే ఔరా అంటారు

గిరిజనుల కల్పవల్లి ‘ఇప్ప’..దీని విశిష్టతలు తెలిస్తే ఔరా అంటారు

దట్టమైన అడవి ప్రాంతంలో దొరికే ఈ పూలు సుగంధ పరిమళాలను వెదజల్లే కాకుండా, ఎంతోమంది ఆదివాసీలకు, గిరిజనులకు జీవనోపాధిని కలిగిస్తున్నాయి. ఈ పూలతో తయారు చేసే అటవీ ఉత్పత్తులు కూడా ఎంతో ఆరోగ్యదాయకమైనవి. రక్తహీనతతో ఉండే మహిళలకు ఈ పూలతో చేసిన లడ్డూలు ఎంతగానో ఉపయోగపడతాయి ఔషధ గుణాలున్న ఈ పూలు అడవికి సుగంధాన్ని అద్దడమే కాకుండా, విభిన్న ప్రయోజనాలతో దీని గురించి తెలుసుకున్న వారు ఔరా అనేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పూలేంటి? ఆ పూల చెట్ల వెనుక ఉన్న కథేంటి తెలుసుకోవాలంటే వన్ఇండియా నుంచి ఈ ప్రత్యేక కథనాన్ని చదవండి.

**అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసి గిరిజనులకు ఇప్పచెట్టు ఓ వరం గా చెప్పాలి. మధుక ఇండికా, mahuwa, విప్పచెట్టు అని పేర్లున్న ఇప్ప చెట్టు ఆదిలాబాద్ జిల్లాలోని అడవులకు సువాసనను జోడించడం కాకుండా, ఆదివాసి బిడ్డలకు జీవనోపాధిగా మారింది. వందల సంవత్సరాల కాలం నుండి ఇప్పచెట్టు గిరిజనుల పాలిట కల్పవల్లి గా మారింది.
Whats-App-Image-2022-04-04-at-01
**ఏపీ, తెలంగాణాతో పాటు అనేక రాష్ట్రాలలో అటవీ ప్రాంతాలలో ఇప్ప చెట్లు
ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతాలలో ఇప్ప చెట్లు విరివిగా ఉన్నాయి సుమారు 15 నుంచి 20 మీటర్ల ఎత్తు పెరిగే ఇప్ప చెట్టు ఏడాదికి 150 కేజీల వరకు పువ్వుల నిస్తుంది. 80 కేజీల వరకు ఇప్ప విత్తనాలనిస్తుంది. వేసవి ప్రారంభంతో ఇప్ప చెట్లు పుష్పించే దశకు చేరుకుంటాయి.ఈ పసుపు రంగు పూల సేకరణ, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల మరియు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని అటవీ గ్రామాలలో ప్రధానంగా జరుగుతుంది . గిరిజనులు సాంప్రదాయకంగా మెత్తటి పూలను స్వయం-వినియోగం కోసం సేకరిస్తారు మరియు ఎండిన పువ్వులను విక్రయించడం ద్వారా ఆదాయాన్నిఆర్జిస్తారు.

*గిరిజనులకు జీవనోపాదినిచ్చే ఇప్ప పూల సేకరణ
ఇప్పపూల సేకరణలో ఒక్కో వ్యక్తి ఒక రోజులో 15 కిలోగ్రాముల నుండి 20 కిలోగ్రాముల వరకు లేత పువ్వులను సేకరించవచ్చు. ఈ కార్యాచరణ ప్రతి సంవత్సరం తాత్కాలిక జీవనోపాధిని అందిస్తుంది. గిరిజనులకు ఆర్థికంగా సహాయపడుతుంది. వేసవిలో పూలను ఎండబెట్టి వేయించి గిరిజనులు తింటారని తెలుస్తుంది. ఎండబెట్టిన ఇప్పపూలలో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, క్యాల్షియం, కెరోటిన్, ఫాస్ఫరస్, విటమిన్ సి, సక్లోజ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Whats-App-Image-2022-04-04-at-01-34-0
*×ఇప్పతో లాభాలెన్నో..
ఇప్ప పూలతో వివిధ రుచికరమైన ఆహార పదార్ధాల తయారీఈ పూలతో ఆదివాసీ గిరిజనులు వివిధ రకాలైన రుచికరమైన నిల్వ ఉండే ఆహార పదార్థాలను తయారు చేసుకుని ఏడాది పొడుగునా నిల్వచేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్నరొట్టె, ఇప్పపూల గోంగూర, ఇప్పపూల మసాల, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇవ్వ మురుకులు, ఇప్ప సత్తు పిండి ఇలా అనేక రకాల ఆహార పదార్థాలను ఇప్ప పూలతో తయారు చేసుకుంటారు. ఈ విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బులు, కొవ్వొత్తుల తయారీలో వినియోగించుకోవటం తో పాటుగా కీళ్ల నొప్పులు, చర్మ రక్షణకు కూడా వినియోగిస్తారు.

**భీమ్ భాయ్ మహిళా సహకార సంఘాలు.. ఇప్పపూలతో ఆదివాసీ ఆహారం ..
ఇక ఇప్పపువ్వు లో ఉండే పోషక విలువలు తెలిసిన తెలంగాణ ప్రభుత్వం వీరి ఆహారాలను ఇతర ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేసింది. గిరిజన మహిళా రైతులను భీమ్ భాయ్ మహిళా సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఆదివాసి ఆహారమని బ్రాండ్ తో ఇప్ప పూలతో విలువ ఆధారిత ఆహారోత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు.ఉట్నూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం భీమ్ భాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘం సభ్యులు 21 మంది ఇప్ప లడ్డూను తయారు చేసి భారీ లాభాలను ఆర్జించగా వైద్యులు, న్యాయవాదులు, నిపుణులు, సేంద్రియ ఉత్పత్తుల ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తానికి ఇప్పపూలు అడవికి సుగంధ పరిమళాల నివ్వడమే కాకుండా, గిరిజన ఆదివాసీల జీవనోపాధినిస్తూ వారి జీవితాలకు ఆధారం గా నిలిచాయి.
Whats-App-Image-2022-04-04-at-01-34-07