Devotional

అరుదైన మూడు తొండాల గణపతి – TNI ఆధ్యాత్మికం

అరుదైన మూడు తొండాల గణపతి   – TNI ఆధ్యాత్మికం

1. ఏ పని మొదలుపెట్టాలన్నాముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూనే చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోందని చెపుతున్నారు ఇక్కడి అధికారులు.

2. భక్తులను తిట్టడానికి సిగ్గుండాలి: టీడీపీ
భక్తులకు సౌకర్యాలు కల్పించలేకపోగా వారిని తిట్టడానికి తిరుమల జేఈవో ధర్మారెడ్డికి సిగ్గుండాలని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ‘‘భక్తులు నేరుగా కొండపైకి వెళ్లే వీలు లేకుండా ఆంక్షలు పెట్టి టోకెన్ల కోసం తోసుకొనే పరిస్ధితి తెచ్చింది ఎవరు? ఎర్రటి ఎండలో కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేక ప్రాణాలు పోయే స్థితిలో భక్తులు కంచె విరగ్గొట్టుకొని బయటకు వస్తే వారికి క్రమశిక్షణ లేదని ధర్మారెడ్డి అంటారా’’ అని టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో గతంలో ఇద్దరు మంత్రులు ఉంటేనే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ పట్టపగ్గాలు లేకుండా జరిగిందని, ఇప్పుడు మూడో మంత్రి తోడైన తర్వాత ఏం జరుగుతుందో తలుచుకొంటేనే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. జిల్లా మంత్రికే అటవీ శాఖ అప్పగించడాన్ని తప్పు పట్టారు. శేషాచలం అడవులను ఇక దేముడే రక్షించాలని సుధాకర్‌రెడ్డి అన్నారు.

3. టీటీడీ కల్యాణమస్తు త్వరలో పునఃప్రారంభం
కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మంచి ముహుర్తాలు చూసి సామూహిక కల్యాణాల కోసం ఏర్పాటు చేసిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన హిందుధర్మప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక మండలి ఇందుకు ఆమోదం తెలిపింది. ఏపీలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మత్స్యకారుల గ్రామాల్లో ఏడాదిలోపు 1,072 ఆలయాలు నిర్మించాలని, తిరుపతిలో ప్రతి నెలా ఒక యజ్ఞంనిర్వహించాలని తీర్మానించారు

4. వెంకన్న దర్శనానికి ఒక్కరోజే 88 వేల మంది
తిరుమల వేంకటేశ్వరస్వామిని బుధవారం 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 47 వేల మంది టోకెన్‌ రహిత భక్తులుండడం గమనార్హం. అలాగే ముందస్తుగా ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న మరో 26వేల మంది కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కొవిడ్‌ విపత్తు తర్వాత ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. ఇక, తిరుమలలో గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. రాబోయే మూడు రోజులు సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి.

5. వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి సాలకట్ల వసంత్సోవాలు వైభవంగా మొదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయానికే పరిమితమైన ఈ ఉత్సవాలు ఈసారి భక్తుల నడుమ వసంత మండపంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శుక్రవారం స్వర్ణరథోత్సవాన్ని నిర్వహించనున్నారు.

6. ఘనంగా సిక్కుల నూతన సంవత్సరం ‘వైశాఖి’ వేడుకలు
సిక్కుల నూతన సంవత్సరం ఖల్సా పంత్ ఫౌండేషన్ డే (వైశాఖి)వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని అమీర్ పేట గురుద్వారాతో పాటు నగరంలోని పలు గురు ద్వారాల్లో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమీర్ పేటలోని గురుద్వారాకు భారీ సంఖ్యలో సిక్కులు తరలి వచ్చారు. గురుద్వరాకు సమీపంలోని గురు గోబింద్ సింగ్ ప్లే గ్రౌండ్ లో పెద్దయెత్తున వేడుకల ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా పలువురు మత ప్రచారకులు గురుకీర్తలను అలపించారు. వేదికపై సిక్కుల పవిత్ర గ్రంధం గురు గ్రంధ్ సాహెబ్ వుంచి భక్తితో కీర్తనలు అలపించారు. ఈ సందర్భంగా ‘ఘటికా’ (తల్వార్లతో)తో విన్యాసాలుచేసూ్త పవిత్ర ఊరేగింపు నిర్వహించారు

7. టీటీడీ కల్యాణమస్తు త్వరలో పునఃప్రారంభం
కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మంచి ముహుర్తాలు చూసి సామూహిక కల్యాణాల కోసం ఏర్పాటు చేసిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన హిందుధర్మప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక మండలి ఇందుకు ఆమోదం తెలిపింది. ఏపీలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మత్స్యకారుల గ్రామాల్లో ఏడాదిలోపు 1,072 ఆలయాలు నిర్మించాలని, తిరుపతిలో ప్రతి నెలా ఒక యజ్ఞం నిర్వహించాలని తీర్మానించారు.

8. ఘనంగా తమిళ ఉగాది వేడుకలు
తమిళ నూతన సంవత్సరాదికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా తమిళులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టి.నగర్‌లోని టీటీడీ ఆలయంలో చెన్నై సమాచార కేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ పర్యవేక్షణలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అరటి, మామిడి తోరణాలతో అలంకరించారు. దేవేరుల సహా శ్రీవారికి విశేషాలంకరణ చేసిన ఈ ఆస్థానం పూజలో సలహా మండలి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు వి.మోహన్‌రావు, పీవీఆర్‌ కృష్ణారావు, చరణ్‌రెడ్డి, సందీ్‌పరెడ్డి, నరేష్‌, ఆనంద్‌కుమార్‌రెడ్డి, మాజీ సభ్యుడు అనీల్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నూతలపాటి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమిళ సంవత్సరాది రద్దీని పురస్కరించుకొని ఆలయం ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే, తిరుప్పూర్‌లో ప్రసిద్థిచెందిన కోట మారియమ్మన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని లక్షల విలువ చేసే కరెన్సీ నోట్లతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కాంచీపురం జిల్లా మేల్‌మరువత్తూర్‌ ఆదిపరాశక్తి పీఠంలో గురువారం వేకువజామున 3 గంటలకు మంగళవాయిద్యాల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేక, అలంకరణ పూజలను పీఠాధిపతి బంగారు అడిగళార్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైష్ణవ, శైవ, అమ్మవారి ఆలయాలు, తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌, దిండుగల్‌ జిల్లా పళని సుబ్రమణ్యస్వామి, స్థానిక వడపళని క్షేత్రాలు తమిళ ఉగాది ప్రత్యేక పూజలతో భక్తులతో కిటకిటలాడాయి.

9. సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యత
కలియుగ వైకుంఠంలో టీటీడీ ఇప్పటికే బ్రేక్‌ దర్శనాలు రద్దుచేసి సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. కరోనాకు ముందు తిరుమలలో ఉన్న పరిస్థితులు రెండేళ్ల తరువాత కనిపిస్తున్నాయి. వారాంతాలను తలపించేలా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని బుధవారం అర్ధరాత్రి వరకు 88,748 మంది దర్శించుకున్నారు. ఇందులో సర్వదర్శన క్యూలైన్ల ద్వారా 46,400 మంది, రూ.300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌ ద్వారా 25,819 మంది, వర్చువల్‌ సేవా టికెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపు ద్వారా 16,529 మందికి శ్రీవారి దర్శన భాగ్యం లభించింది.కరోనా అనంతరం భక్తుల సంఖ్య 88 వేలు దాటడం ఇదే ప్రథమం. స్వామికి బుధవారం అర్ధరాత్రి వరకు 38,558 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.4.82 కోట్లు లభించాయి. గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లను పర్యవేక్షించి తిరిగి గురువారం ఉదయం కూడా తనిఖీలు చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్‌లో నిరంతరాయంగా అల్పాహారం, పానీయాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.సులభంగా సర్వదర్శనం సర్వదర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక క్యూలైన్లో రూ.300 ప్రత్యేక దర్శనం పంపిస్తూ, మరో క్యూలైన్లో సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు. ఎక్కువసేపు క్యూ కంపార్ట్‌మెంట్‌లలో ఉంచకుండా 3 గంటల్లో దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి నుంచి వేగవంతంగా స్వామిదర్శనం లభిస్తోంది.

10. రాష్ట్రంలో 1,072 ఆలయాల నిర్మాణం
శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 1,072 ఆలయాల నిర్మాణానికి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ (డీపీపీ) కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున కల్యాణమస్తు, సామూహిక వివాహాలు, దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తీర్మానించింది. తిరుపతిలో గురువారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ధర్మకర్తల మండలి సభ్యురాలు అల్లూరి మల్లీశ్వరి వర్చువల్‌గా, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈవో సత్యనారాయణ పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవదాయశాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణ. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా శ్రీనివాసకల్యాణం. ఏప్రిల్‌ 23న కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మే నెలలో ఢిల్లీ, జూన్‌లో హైదారాబాద్, జూన్‌ 23 నుంచి జూలై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాసకల్యాణాల నిర్వహణ. గోదావరి జిల్లాల్లో త్వరలో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు. కోవిడ్‌ పరిస్థితుల నుంచి బయటపడడంతో సామూహిక వివాహాల నిర్వహణకు పండిత మండలి ఏర్పాటు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహణ. తిరుపతిలో ప్రతినెలా టీటీడీ ఆధ్వర్యంలో ఒక యజ్ఞం. మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాల నిర్వహణ. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటికి దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందజేత. ఈ కార్యక్రమాన్ని విస్తృత పరిచే ఏర్పాట్లు. రాష్ట్రంలోని టీటీడీ, దేవదాయశాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించి, వారు పండించిన ఉత్పత్తులను శ్రీవారి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేయాలి.

11. ప్రాణహిత’కు పోటెత్తిన భక్తజనం
ప్రాణహిత పుష్కరాలకు రెండోరోజు భక్తజనం పోటెత్తారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత నదీతీరం భక్తులతో కిటకిటలాడాయి. గురువారం సెలవు రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివచ్చారు.పుష్కర స్నానాలతోపాటు కాళేశ్వర ముక్తీశ్వరులను లక్షమంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లి, తుమ్మిడిహెట్టి పుష్కరఘాట్లలో రద్దీ కనిపించింది. కాగా, ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి, సౌకర్యాలు కల్పించడంతో మన రాష్ట్రం నుంచి భక్తులు మహారాష్ట్రలోని సిరొంచ, నగురం ఘాట్‌లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మహారాష్ట్రలోని పుష్కరఘాట్లలో 2.5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

12. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారి ప్రసాదం
నెయ్యి తయారీ కేంద్రం భూమి పూజలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే ఒకటి నుంచి గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు స్వామి ప్రసాదంలో వినియోగిస్తున్నామని తెలిపారు. మూడు కోట్ల రూపాయల విరాళంతో దేశవాళీ గోవుల పాలు నుంచి రోజుకు 60 కేజీల నెయ్యి తయారీ కేంద్రం శంకుస్థాపన చేశామన్నారు. తిరుమలలో కూడా వంద దేశీ ఆవులు శ్రీవారి సేవలో ఉంటాయని తెలిపారు. టీటీడీ ఆధునిక డైరీ కోసం వంద కోట్లు విరాళం ఇవ్వటానికి భక్తులు సిద్ధంగా ఉన్నారని… 8 నెలల్లో డైరీ పూర్తి చేస్తామని వెల్లడించారు. స్లాటెడ్ సర్వ దర్శనం తీసేయాలని రెండు నెలలుగా అనుకుంటున్నామని చెప్పారు. మొన్న విజిలెన్స్, టీటీడీ సిబ్బంది లోపం వల్ల తోపులాట సంఘటన చోటు చేసుకుందన్నారు. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఆ రోజు ఆహారం ఇవ్వకపోవడం కూడా ఒక కారణమన్నారు. నడకదారి భక్తులకు దివ్యదర్శనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

13. తిరుమలలో భక్తుల మధ్య తోపులాటపై మంత్రి సత్యనారాయణ స్పందన
భక్తుల మధ్య తోపులాట జరిగిన ఘటన నేపథ్యంలో టీటీడీ అధికారులను అప్రమత్తం చేశామని దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఉన్న విధానం వల్ల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు 20 నుంచి 36 గంటల సమయం పట్టేదన్నారు. అయితే టైం స్లాట్ విధానం వల్ల భక్తులు రెండు, మూడు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లపై భక్తులను వాకబు చేశానన్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.
భక్తుల అనూహ్య రద్దీ నేపథ్యంలో…భక్తుల మధ్య ఆత్రుతతో ఒక్క సారిగా రావడంతోనే తొక్కిసలాట జరిగిందని వివరించారు. గంట వ్యవధిలోనే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చెయ్యడం దిగ్గజారుడు తనమని వ్యాఖ్యానించారు. టీటీడీలో సమర్ధవంతమైన అధికారులు ఉన్నారని, మంచి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేశారు.