DailyDose

కామాటిపుర‌లో పోస్టాఫీస్‌

కామాటిపుర‌లో  పోస్టాఫీస్‌

ముంబైలోని కామాటిపుర. గల్లీనంబర్‌-8. ఇక్కడ డెలివరీ బాయ్స్‌ కనిపించరు. ఏటీఎమ్‌లు లేవు. బ్యాంక్‌లు ఉండవు. సెక్స్‌ వర్కర్లను మనుషులుగా గుర్తించే ప్రయత్నమూ జరగలేదని చెప్పడానికి ఆధారంగా.. ఒక్క ఆధార్‌ నమోదు కేంద్రమూ లేదు. చాలాకాలం క్రితం పోస్టాఫీస్‌ను మాత్రం ప్రారంభించారు. అది తమకోసమేనని సెక్స్‌ వర్కర్లకు తెలియదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని అధికారులూ చెప్పరు. సిబ్బందికైతే ఇక్కడ పనిచేయడం అంటేనే ఓ శిక్ష కింద లెక్క. ఆ బ్రాంచిలో పనిచేసే బ్రహ్మచారులకు సంబంధాలు రావని ఓ ప్రచారం.పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ స్వాతి రంగ ప్రవేశంతో సీన్‌ మారింది. ‘గల్లీ నంబర్‌-8’ శాఖకు కొత్త వెలుగు వచ్చింది. ఇప్పుడు, ఆ శాఖలో మొత్తం మహిళా ఉద్యోగులే. సెక్స్‌ వర్కర్ల పిల్లలకు ఆధార్‌ కార్డులు మంజూరు అయ్యేలా చొరవ తీసుకున్నారామె. దాదాపు 142 మంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరారు. ప్రతి నెలా సగటున రూ. 500 డిపాజిట్‌ చేస్తున్నారు. కొత్తగా 75 పొదుపు ఖాతాలు తెరిచారు. ఎన్‌జీఓల సహకారమూ తోడైంది. ‘పోస్టాఫీస్‌ అనేది తపాలా వ్యవహారాలకే పరిమితం కాదు. ఇదొక ఆత్మవిశ్వాస చిరునామా’ అంటారు స్వాతి.