Fashion

సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే త‌యార‌య్యే ఈ చీర‌ల స్పెషాలిటీ ఏంటంటే..

సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే త‌యార‌య్యే ఈ చీర‌ల స్పెషాలిటీ ఏంటంటే..

గొల్లభామ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత.. చేనేతల కలబోతకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, కుడి చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నిండైన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం.. ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. ఒక్కో పోగును జతచేసి, అద్భుతమైన డిజైన్లలో రూపొందించే గొల్లభామ చీరలంటే.. ప్రతి మగువా మనసు పడుతుంది.

*కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏండ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య కులవృత్తిపైనే ఆధారపడి జీవించేవారు. ఒకరోజు తమ ఇంటి ముందునుంచి తలమీద పాలకుండ, చేతిలో పెరుగు గురిగి పట్టుకొని నడిచివెళుతున్న ఓ మహిళ నీడను చూసి.. వారిలో ‘గొల్లభామ‘ చీర ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను నేసేందుకు అవసరమైన ప్రత్యేక సాంచాను తయారు చేసుకున్నారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే.. ‘గొల్లభామ చీర’గా ప్రశస్తి పొందింది.
cs1
*తయారీ విధానం
మొదట చీరలకు అవసరమయ్యే నూలుకు, డిజైన్‌కు తగిన రంగులను అద్దుతారు. తర్వాత ఉండలుగా చుట్టి, పడుగు, పేకలుగా జాకార్డ్‌ మగ్గం మీదికి ఎక్కిస్తారు. గొల్లభామ డిజైన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రాఫ్‌లను వాడతారు. కాలితో యంత్రాన్ని తొక్కుతూ చీరలు నేస్తారు. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం పడతాయి. ప్రస్తుతం ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు.

*కఠినమైన పని..
సంప్రదాయ పద్ధతిలో గొల్లభామ చీరల తయారీ ఎంతో సంక్లిష్టమైన వ్యవహారం. వీటిని నేసేందుకు ఒక్కో మగ్గంపై ఒక్కో కార్మికుడు 15 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. మగ్గంపై నేసిన దారాలకు రకరకాల రంగులద్ది, ఎండబెడుతారు. ఆ తర్వాత సాంచాలలో మగ్గంపైకి చేర్చి చీరలను నేస్తారు. సన్నటి దారాలతో గొల్లభామ డిజైన్లు వేస్తారు. గుంత మగ్గాల మీద చేతితో డిజైన్‌ను రూపొందించి, దారంతో సాంచా తయారు చేస్తారు. ఈ విధానంలో వివిధ రంగుల దారాలు వాడటం, గొల్లభామ డిజైన్లలో మార్పులు తేవడం ఎంతో కష్టమైన పని. మిగతా వస్ర్తాలతో పోలిస్తే వీటి నేతకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే, చేనేత కార్మికులు గొల్లభామ చీరల తయారీని వదిలేసి, మామూలు వస్త్రాలను నేస్తున్నారు. కొంతమంది మాత్రమే వారసత్వంగా ఈ కళను బతికిస్తున్నారు.
cs3
json format validator
*భౌగోళిక గుర్తింపు
భౌగోళికంగా ఒక ప్రాంతానికే ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరమైన హక్కుల పరిరక్షణ కోసం ‘జీఐ ట్యాగ్‌’ హోదాను కల్పిస్తారు. కేవలం సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మాత్రమే రూపొందే గొల్లభామ చీరలకు 2012లో జాగ్రఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ట్యాగ్‌ లభించింది. దీంతో మరింతమంది చేనేత కార్మికులు వీటి తయారీపై ఆసక్తి చూపుతున్నారు. గొల్లభామ చీరలు ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకున్నాయి. మాజీ రాష్ట్రపతులు జ్ఞానీ జైల్‌సింగ్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ ఈ చీరల గురించి తెలుసుకొని, తమ కుటుంబాల్లోని మహిళల కోసం సిద్దిపేట నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. ఈ విషయాలను చేనేత కళాకారులు గర్వంగా గుర్తుచేసుకుంటారు.

*విభిన్న డిజైన్లలో..
ఏడేళ్ల క్రితం అధునాతన జాకార్డ్‌ మగ్గాలు అందుబాటులోకి రావడంతో గొల్లభామ చీరలకు గత వైభవం వచ్చింది. అంతకుముందు వీటి నేతకు ఫ్రేమ్‌ (గుంత) మగ్గాలను వినియోగించేవారు. దీని మీద అయిదున్నర మీటర్ల చీర తయారీకి 15 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు జాకార్డ్‌ మగ్గం మీద రెండు మూడు రోజుల్లోనే చీరను నేస్తున్నారు. గతంతో పోలిస్తే విభిన్నమైన రంగులు, డిజైన్లలో రూపొందిస్తున్నారు.