DailyDose

నృత్యరీతుల్లో భరత నాట్యానిది ప్రత్యేక స్థానం

నృత్యరీతుల్లో భరత నాట్యానిది ప్రత్యేక స్థానం

భారతీయ నృత్యరీతుల్లో భరత నాట్యానిది ప్రత్యేక స్థానం. ఎంతోమంది కళాకారులు భరతనాట్యంలో విశేష ప్రతిభ చూపి దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారిలో ఒకరు హుస్నైన్‌ (30). ఓ ముస్లిం వ్యక్తిగా భరతనాట్య ప్రదర్శనలు ఇవ్వడమొక్కటే అతని ప్రత్యేకత కాదు. అతడు నిర్వహిస్తున్న ‘వురు ఆర్‌ వన్‌’ బృంద సభ్యులంతా విభిన్న ప్రతిభావంతులు. 2016లో ప్రారంభమైన ఈ అకాడెమీ ప్రస్తుతం 90 మంది కళాకారులకు శిక్షణ ఇస్తోంది. 8 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వరకు సభ్యులు ఆ బృందంలో ఉన్నారు.
bk3
ఆ బృందంలో వీల్‌చైర్‌కే పరిమితమైన వారితో పాటు ఇతర విభిన్న ప్రతిభావంతులంతా ఒకే బృందంగా ఏర్పడడంలో మనకు ఒక సారూప్యత కనిపిస్తోంది. నాట్యమే వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. అయితే ‘ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా ఇప్పటికీ మా ప్రతిభకు తగ్గ గౌరవం దక్కడం లేదంటా’రు హుస్నైన్‌. ‘మాలాంటి వారందరూ సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి చాటాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘వురు ఆర్‌ వన్‌’. దీనిద్వారా విభిన్న కళలను ప్రదర్శించాలనుకున్నాను. అయితే నాట్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాను’ అంటున్నారు హుస్నైన్‌.
చిన్నతనంలో వచ్చిన అనారోగ్య సమస్య అతనిని శాశ్వత వికలాంగునిగా మార్చివేసింది. ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌ సహాయంతో చదువుకున్నాడు. 8వ తరగతి వరకు చదివిన హుస్నైన్‌ తన 12వ ఏట ఢిల్లీ స్టేడియమ్‌లో 150 మంది కళాకారుల మధ్య విభిన్న ప్రతిభావంతుడిగా తొలి ప్రదర్శన ఇచ్చారు. ‘అంతమంది మధ్యలో నేను కూడా వేదికపై ఉండడం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇది ఇంకా కొనసాగించాలని’ అని వివరించారు.

‘వీల్‌చైర్‌లో డాన్స్‌ ప్రదర్శనా? ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అది సాధ్యమేనా? వంటి ప్రశ్నలే మా ప్రదర్శనలకు జనాన్ని రప్పిస్తాయి. అలా వచ్చిన వారు నిమిషం వ్యవధిలోనే అబ్బురపడేలా మా బృందం ప్రదర్శన ఇస్తుంది. మొట్టమొదట మాపై జాలితో చూడడం ప్రారంభించిన వారికి క్షణాల వ్యవధిలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాం. ఇక కార్యక్రమం చివరికి వచ్చేసరికి అద్భుత ప్రదర్శన ఇచ్చారని మమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. అలా మా లోపం కంటే ముందు మా శక్తి, నైపుణ్యం వారికి కనపడుతాయి. అదే మేం కోరుకునేది’ అంటారు హుస్నైన్‌.
****మనమంతా ఒక్కటే ..!
భరతనాట్యం ఒక్కటే కాక సాల్సా, మణిపురి, మార్షల్‌ ఆర్ట్స్‌ నృత్య రూపాలు, చక్రాల కుర్చీలో యోగాసనాలు చేయడం వంటివన్నీ హుస్నైన్‌ ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటిసారి సాల్సా ప్రదర్శించిన వీల్‌చైర్‌ గ్రూప్‌గా ఈ బృందానికి గుర్తింపువచ్చింది. శరీరంలో కింది భాగంలో ఎటువంటి కదలిక లేకుండా పై భాగం ద్వారానే మొత్తం ప్రదర్శన ఇవ్వడం అంత ఆషామాషీ కాదు. ప్రదర్శన సజావుగా సాగేందుకు బృంద సభ్యులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా శిక్షణలో పాల్గొంటారు.
bk4
‘ఎంత ప్రతిభ ఉన్నా ఇప్పటికీ మమ్మల్ని అవమానకర పదాలతో పిలుస్తుంటారు. ఎన్నోసార్లు ఈ అనుభవం నాకు ఎదురైంది. వైకల్యం కారణంగా ప్రదర్శనలు ఇచ్చే ప్రాంతానికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ప్రదర్శన ఇచ్చాక ప్రేక్షకులంతా లేచి నుంచొని చప్పట్లు కొడుతున్నప్పుడు మేము పడిన బాధంతా దూదిపింజలా ఎగిరిపోతుంది. అందుకే మా కమ్యూనిటీకి కావాల్సింది దయ కాదు.. అవకాశం’ అంటారు హుస్నైన్‌.