NRI-NRT

బ్రిటన్ అపరకుబేరుల జాబితాలో భారత సంతతి దంపతులకు చోటు..!

బ్రిటన్ అపరకుబేరుల జాబితాలో భారత సంతతి దంపతులకు చోటు..!

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆయన సతీమణి అక్షతామూర్తి.. బ్రిటన్ అపరకుబేరుల జాబితాలోకి తొలిసారిగా చోటుదక్కించుకున్నారు. సండే టైమ్స్ పత్రిక ‘బ్రిటన్ రిచ్ లిస్ట్’ పేరిట 250 మంది సంపన్నుల జాబితాను విడుదల చేయగా.. అందులో రిషి సునక్ దంపతులకు 222వ స్థానం దక్కింది. ఇద్దరి మొత్తం సంపద 730 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్టు సండే టైమ్స్ పేర్కొంది. అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ సంస్థలో ఆమెకు 0.9 శాతం వాటా ఉంది. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రజలు.. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరలను తాళలేక అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో రిషి సునక్‌కు ధనవంతుల జాబితాలో చోటు దక్కడం అక్కడ చర్చనీయాంశమైంది. రాబోయే రోజులు ఆర్థికంగా మరింత సంక్లిష్టంగా మారుతాయని ఇటీవలే రిషి సునక్ హెచ్చరించారు. కాగా.. బ్రిటన్‌లో అక్షతామూర్తి పన్నులు చెల్లించడంలేదన్న కారణంగా ఆమెపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అక్కడి చట్టాల ప్రకారం.. అక్షతామూర్తికి ఉన్న నాన్ డోమిసైల్డ్ స్టేటస్ కారణంగా విదేశాల్లోని సంపాదనపై ఆమె బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా కూడా..ఇది రిషి సునక్ దంపతులకు రాజకీయపరమైన సమస్యలు తెచ్చిపెట్టింది.