WorldWonders

ఆ ఊళ్లో కట్నం బంద్.. రెండేళ్లుగా అమలు..

ఆ ఊళ్లో కట్నం బంద్.. రెండేళ్లుగా అమలు..

వరకట్నం తీసుకోవడం, ఇవ్వడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న ఓ గ్రామం.. ఆదర్శంగా నిలుస్తోంది. రెండేళ్ల వ్యవధిలో 200కు పైగా వివాహాలు వరకట్నం ఊసు లేకుండా జరిపించి ప్రశంసలు పొందుతోంది. ఆ ఊరిలో ప్రస్తుతం అన్నివర్గాల ప్రజలు వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే?

ఝార్ఖండ్ గిరిధ్​లోని బర్వాదీ గ్రామస్థులు ప్రగతిశీల నిర్ణయం తీసుకున్నారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడాన్ని నిషేధిస్తూ తీర్మానం ఆమోదించారు. ఈ మేరకు బర్వాదీ అంజుమన్ కమిటీ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కట్నం తీసుకోవద్దనే నిర్ణయాన్ని తొలుత ముస్లింలు అమలులోకి తెచ్చారు. ఇప్పటివరకు 200కు పైగా వివాహాలు కట్నం లేకుండానే జరిగాయి. బర్వాదీ గ్రామ పంచాయతీలో రెండేళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ప్రారంభంలో ఈ విధానం అంత పక్కాగా అమలు కాలేదని బర్వాదీ అంజుమన్ కమిటీకి చెందిన సదర్ లాల్ మహ్మద్ అన్సారీ తెలిపారు. కొంతమంది రహస్యంగా కట్నం తీసుకునేవారని చెప్పారు. ఈ విషయం గురించి తెలిశాక.. కట్నం తీసుకున్న కుటుంబాలను బహిష్కరించినట్లు వివరించారు. ఆ తర్వాత గ్రామస్థులంతా ఈ నిబంధనకు అలవాటుపడుతూ వచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రజలంతా కట్నాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు.వరకట్న నిషేధం పక్కాగా అమలవుతుండటాన్ని చూసిన ఇతర గ్రామస్థులు తమ గ్రామంలోనూ ఇలాంటి సంప్రదాయాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. హిందువులు సైతం కట్నం లేకుండా వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారని తెలిపారు.