DailyDose

ఈనెల 13న వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం పంపిణీ -TNI తాజా వార్తలు

ఈనెల 13న వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం పంపిణీ  -TNI  తాజా వార్తలు

* ఈనెల 13న వైఎస్సార్ వాహన మిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని.. ఈ నెల 7 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. ఈనెల 13న అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు సీఎం జగన్ చేతు మీదుగా సాయం అందించనున్నారు. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్, మరమ్మత్తుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని.. ఈ నెల 7 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆరంచెల విధానంలో పారదర్శకంగా జరుగుతుందన్నారు. దరఖాస్తుదారు తనకు సంబంధించిన భూమి, ఆస్థి వివరాలు, ఆస్థి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్ వినియోగం, ఆదాయ పన్ను, కులం వివరాలు తెలపాల్సి ఉంటుందని వెల్లడించారు.ఇప్పటికే వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నవారు వాహనంతో నిలబడిన ఫోటోను గ్రామ సచివాలయం ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక సహాయం అందజేస్తాం. వాహనదారులు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తు దారు విద్యుత్ వినియోగం 6 నెలల సగటు మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులుగా ప్రకటిస్తాం. వాహన యజమాని హక్కులు మార్పు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా వారి జాబితాను అనర్హులుగా పరిగణిస్తాం.

*గద్వాల: జిల్లాలోని ఉండవెల్లి తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.7500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. భూ మార్పిడి విషయంలో ఆయన రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

*భీమవరానికి వెళ్తున్న తనను ఆంధ్రా సరిహద్దులో హత్య చేసేందుకు కుట్ర చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీగా అధ్యక్షత స్థానంలో ఉండాల్సిన తనను భీమవరం రాకుండా ఏపీ పోలీసులు కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు డీజీ కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల వ్యవహారంపై కోర్టు వెళ్తానని స్పష్టం చేశారు. సత్తెనపల్లి వద్ద బోగిని తగులబెట్టి తనను హత మార్చాలని చూశారని రఘురామ తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు రఘురామను ట్రైన్‌లోనే మట్టుబెట్టాలని చూశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ రఘురామను హత్య చేయటానికి ప్లాన్ చేశారన్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రఘురామ భీమవరం వచ్చుంటే అదే చివరి రోజు అయ్యేదన్నారు. బేగంపేటలో రైలు దాడి సమాచారం రాగానే.. రైలు దిగి పోయి ప్రాణాలు కాపాడుకున్నారన్నారు. ఇది నిజం కాదని వైకాపా అంటే సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రధాని ఏపీకి వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే జగన్‌ పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.

*ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ రెండు లేఖ‌లు రాశారు. ప్ర‌కాశం బ్యారేజీ దిగువ‌న 2 ఆన‌కట్ట‌ల నిర్మాణ ప్ర‌తిపాద‌న‌పై అభ్యంత‌రం తెలిపింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి లేకుండా ప్రాజెక్టులు చేప‌ట్ట‌రాద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌లో పేర్కొన్న‌ది. 2 కొత్త బ్యారేజీల ప‌నులు చేప‌ట్ట‌కుండా ఏపీని నిరోధించాల‌ని కోరింది.కృష్ణా జ‌లాల‌పై ఆధార‌ప‌డి పంప్డ్ స్టోరేజీ స్కీమ్‌ల ప్ర‌తిపాద‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో లేఖ రాసింది. జ‌ల‌విధానం మేర‌కు తాగునీటి అవ‌స‌రాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని తెలంగాణ కోరింది. తాగునీటి అవ‌స‌రాలు కాద‌ని ఇత‌ర‌త్రాల‌కు త‌ర‌లింపు స‌రికాద‌ని తెలిపింది. పంప్డ్ స్టోరేజీ స్కీమ్, విద్యుత్ ఉత్ప‌త్తికి నీటి త‌ర‌లింపు స‌రికాద‌ని పేర్కొన్న‌ది. అనుమ‌తి లేని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌ల‌ను పరిశీలించాల‌ని కోరింది. సీడ‌బ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి లేని వాటిని ప‌రిశీలించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం విన్న‌వించింది.

*ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పాలన అందించే వీలున్నదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) డైరెక్టర్ జనరల్ సంతోష్ మెహ్రా ప్రశంసించారు. ఇలాంటి వ్యవస్థ ద్వారానే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందే అవకాశం దక్కుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును కలిశారు.

* ఖైర‌తాబాద్‌లోని ర‌వాణా శాఖ కేంద్ర కార్యాల‌యంలో తెలంగాణ ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌గా జ్యోతి బుద్ధప్ర‌కాశ్ అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ మెటార్ వెహిక‌ల్స్ ఇన్‌స్పెక్ట‌ర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు డాక్ట‌ర్ కే పాపారావు.. బుద్ధ‌ప్ర‌కాశ్‌కు పుష్ప‌గుచ్ఛం అందించి స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌భుత్వం కేటాయించిన ల‌క్ష్యాల‌ను సాధించేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని పాపారావు క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్ట‌ర్ అసోషియేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తామ‌ని పాపారావు తెలిపారు.

*తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని, దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకరాచార్యులు మాట్లాడారు.

*ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.రేపటి నుంచి ఈ నెల 15 వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2,01,627 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు విడుదల చేశామని వెల్లడించారు.

*బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పదాధికారులకు బండి సంజయ్ వివరించనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ తేదీలను, స్థలాన్ని నేతలు ఖరారు చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను బూతు స్థాయి వరకు తీసుకువెళ్లడంపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘనందనరావు, గరికపాటి, వివేక్ తదితరులు హాజరయ్యారు.

*మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యడిగా నియమితులైనందుకు సుబ్బిరామిరెడ్డికి జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా అందరం కలిసి పని చేయాలని సుబ్బిరామిరెడ్డి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, జరిగిన అంశాలను సుబ్బిరామిరెడ్డికి జగ్గారెడ్డి వివరించారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై సుబ్బిరామిరెడ్డి పలు సూచనలు, సలహాలు చేశారు.

*ప్రముఖ నటుడు, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ మిథున్‌ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. రూపా గంగూలీ స్థానంలో ఆయన్ని పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించేసినట్లు సమాచారం.

నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్‌ చక్రవర్తి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా పని చేశారు. అయితే ఆ తర్వాత నుంచి అనారోగ్యం రిత్యా ఆయన బెంగాల్‌ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పొలిటికల్‌ తెర మీదకు వచ్చిన ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలే.. చర్చనీయాంశంగా మారాయి. ‘నా అనారోగ్య కారణాల వల్ల నేను చాలా కాలం ప్రజల ముందుకు రాలేకపోయాను. రాజకీయాలను రాజకీయాల్లాగే ఉంచాలి. కానీ, ఎన్నికల తర్వాత బెంగాల్‌లో అశాంతి నెలకొందన్న వార్త చాలా బాధించింది’ అంటూ పొలిటికల్‌ రీఎంట్రీ సంకేతాలను అందించారాయన.

*చైనా కంపెనీలు వరసబెట్టి మనీలాండరింగ్ కేసు ఇరుక్కుంటున్నాయి. మెుబైల్ దిగ్గజం షియోమీపై దాడులు జరిగిన తర్వాత… తాజాగా… వివో సంస్థపై Enforcement Directorate దాడులు చేసింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వ ఏజెన్సీ ED విచారణ జరుపుతోంది. ఈ క్రమానికి సంబంధించి… అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… దేశవ్యాప్తంగా 44 చోట్ల వివో, దాని అనుబంధ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. గతంలో మొబైల్ కంపెనీ షియోమీకి చెందిన రూ. 5,551 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రాయల్టీ పేరుతో… డబ్బును దేశం నుంచి పంపుతున్నాయని, ఈ క్రమంలో… పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

* శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నో ఆశలతో శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాహుకేతు పూజలు నిలిపివేసిన సమాచారాన్ని భక్తులకు అందజేయడంలో విఫలం కావడంతో.. సమాచారం తెలియక భక్తులు శ్రీకాళహస్తికి వచ్చి రాహుకేతు పూజలు చేయకుండానే వెనుదిరుగుతున్నారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల నుం భక్తులు ఇక్కడికి వస్తారని తెలిసి కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.శ్రీకాళహస్తి ఆలయంలో నాగపడగల కొరత నెలకొన్నది. దాంతో దోష నివారణ కోసం చేసే రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. పూజలకు నాగపడగలను అధికారులు సిద్ధం చేయలేదు. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలోనే నిల్చుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నాగపడగలను సిద్ధం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని భక్తులు ఆరోపిస్తున్నారు.రాహు కేతు పూజలకు శ్రీకాళహస్తి ప్రత్యేకమైనది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు చాలా మంది శ్రీకాళహస్తి వచ్చి దోష నివారణ కోసం రాహుకేతు పూజలు చేయించుకుంటారు. తిరుమలలో గత కొన్ని వారాలుగా ఎక్కువ రద్దీ ఉన్నది. మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయి ఉంటున్నాయి. తిరుమల నుంచి శ్రీకాళహస్తికి భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అధికారులు నాగపడగలను సిద్ధం చేయడంలో విఫలమయ్యారు. దాంతో పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తికి వస్తున్న భక్తులు నాగపడగలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.

*మహేశ్వరం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు ముదిరింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్‌పేట్‌ను నాశనం చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. చెరువులను, స్కూల్‌ స్థలాలను కూడా వదలడం లేదన్నారు. వీటిపై అవసరమైతే ఆమరణ దీక్ష కూడా చేస్తానన్నారు. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

* బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పదాధికారులకు బండి సంజయ్ వివరించనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ తేదీలను, స్థలాన్ని నేతలు ఖరారు చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను బూతు స్థాయి వరకు తీసుకువెళ్లడంపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘనందనరావు, గరికపాటి, వివేక్ తదితరులు హాజరయ్యారు.

*జంగారెడ్డిగూడెంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. జిల్లా పరిషత్ స్కూల్‌లో నిర్వహించిన జగనన్న విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. కాగా… ప్రోటోకాల్ ప్రకారం పురపాలక చైర్మన్ బత్తిన లక్ష్మికి ఆహ్వానం అందలేదు. దీంతో సభా ప్రాంగణం నుండి చైర్మన్ వెళ్లిపోయారు. దీంతో స్కూల్ హెడ్ మాస్టారు జగ్గారావు ప్రోటోకాల్ మరిచారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలల విలీనం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఏవిధంగా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గం గలగల గ్రామ పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కణేకల్లు మండల కేంద్రంలో ఉన్న నేసేపేటలో ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడుతున్నారు.

*కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విద్యాకానుక కిట్లు, పుస్తకాలను సీఎం పరిశీలించారు. అనంతరం క్లాసురూమ్‌లో విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రంలో 47.40 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాకానుక‌ను పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.931 కోట్లను ఖర్చు చేయనుంది. అలాగే విద్యాకానుక కోసం మూడేళ్లలో రూ.2,368 కోట్ల ఖర్చును సర్కార్ భరించనుంది.

*సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పాత్రికేయ రంగంలో… ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన గుడిపూడి శ్రీహరి కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

*రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మురుగునీటి కాలువలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) దిగారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ(Drainage) సమస్య ఎక్కువగా ఉందన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించానన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షాన ఉంటానన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తాను కూడా బాధపడుతున్నానన్నారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.

*వేములవాడ రాజన్న ఆలయంలో ఆషాఢం ఎఫెక్ట్‌ కనిపించింది. సోమవారం ఉదయం కొద్ది మంది భక్తులతో సందడిగా కనిపించినా మధ్యాహ్నం వేళ భక్తులు లేక బోసిపోయింది. అంతంత మాత్రంగానే స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.మధ్యాహ్నం ఏ క్యూలైన్‌ చూసినా వెలవెలబోయినట్లు కనిపించింది. దీంతో ఆలయ మెట్ల కింద కొబ్బరికాయలు అమ్మేవారు, గాజులు వేసేవారు, చిరు వ్యాపారులు తమ దుకాణాలను మధ్యాహ్నం కల్లా మూసుకుని తమ ఇండ్లకు వెళ్లారు.

*హైదరాబాద్‌ మహా నగరంలో ప్రతిష్టాత్మకమైన బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభు త్వం రూ.15 కోట్లను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. సోమవారం మాసబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, దేవాదా య, సాంసృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో కలిసి ఈ నెల 17న జరిగే సికింద్రాబాద్‌, 24న జరిగే హైదరాబాద్‌ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

*శ్రీసత్యసాయి: జిల్లాలోని కదిరిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అనుచరుడు శివారెడ్డి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు అరోపణలు వస్తున్నాయి. అడపాలవీధిలో 84 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడిందని ఆరోపణలు ఉన్నాయి. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గోడలు నిర్మాణం కూడా పూర్తయింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దాడితో అధికారులు వెనుదిరిగారు.

*హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎస్‌ఆర్‌నగర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 గ్రాముల ఎండీఎంఎంఏను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుుల విచారణ జరుపుతున్నారు.

* Singareniలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకుడిని నమ్మించి రూ 10 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై సోమవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన భరత్‌ కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలం కిత్రం కొమ్ము రాజేష్‌ అనే వ్యక్తి పరిచయమై Singareniలో తాను మేనేజర్‌గా పనిచేస్తున్నానని తన సహచరులతో ప్లాట్‌లు కొనిపిస్తానని చెప్పాడు. అలా కొంతమందితో ప్లాట్‌లు కొనిపించాడు. దీంతో తనపై నమ్మకం కుదిరిన తరువాత భరత్‌కుమార్‌కు సింగరేణిలో ఉద్యోగం ఇస్తానని రాజేష్‌ ఆశచూపి రూ.20 లక్షలు ఇవ్వమని అడిగాడు. దీంతో భరత్‌కుమార్‌ తన పొలం అమ్మి మరి రూ.10 లక్షలకు పైగా రాజే్‌షకు ముట్టజెప్పాడు. సంవత్సరం పూర్తి అయినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి బాఽధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కొమ్ము రాజే్‌షపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

*పారిశ్రామిక వృద్ధిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలే తమకు ప్రధాన పోటీదారులని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విదేశీ పరిశ్రమలు దేశంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను పరిశీలిస్తాయని, ఈ నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే అన్ని అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. సులభతర వ్యాపారం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)పై కేంద్రం ఏటా రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటిస్తుండగా, గత ఏడాది తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా తెలంగాణకు ప్రథమ స్థానం ఇవ్వాల్సి వస్తుందనే.. ర్యాంకింగుల విధానాన్నే ఎత్తేశారని ఆరోపించారు. పరిశ్రమల స్థాపనలో ఎక్కువ వృద్ధి సాధిస్తోన్న ఏడు రాష్ట్రాల్లో ఈసారి గుజరాత్‌ పేరునూ చేర్చడాన్ని బట్టి.. విషయమేంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాణి జ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ప్రతిభ కనబర్చిన పారిశ్రామికవేత్తలకు 19 విభాగాల్లో ఎక్స్‌లెన్స్‌ అవార్డులను మంత్రి కేటీఆర్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అవలంబిస్తోందన్నారు

* వైద్య కళాశాలల రద్దు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మండిపడింది. కొన్ని కాలేజీల అనుమతులు రద్దయి 45 రోజులైనా సీట్ల సర్దుబాటులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో బాధ్యత లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో.. విద్యార్థులను వేరే కాలేజీలకు కేటాయించిన బిహార్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌ఎంసీ ఇటీవల రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్‌ అనుసరించిన వివరాలను జతచేసింది. ఎంఎన్‌ఆర్‌ (సంగారెడ్డి), టీఆర్‌ఆర్‌ (పటాన్‌చెరు), మహావీర్‌ (వికారాబాద్‌) మెడికల్‌ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, ఎండీ కోర్సుల ప్రవేశాలను రద్దు చేస్తూ మే 19న ఎన్‌ఎంసీ ఆదేశాలిచ్చింది.

*కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చేందుకు మరో సారి గడువు పెంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం తాజాగా మరో సవరణ గెజిట్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ ఏడాది జూలై 15న కేంద్రం గెజిట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.

*రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో బదిలీల వ్యవహారం వివాదస్పదంగా మారింది. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనగా.. ఉన్నతాధికారులు తద్విరుద్ధంగా వ్యవహరించారు. నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని కదల్చనేలేదు. ఈ వ్యవహారంలో సొమ్ములు దండిగా చేతులు మారాయని.. రాజకీయ పైరవీలు ప్రధాన పాత్ర పోషించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికారుల్లో కొందరిని ఇంకా ఎవరి స్థానాల్లో వారినే కొనసాగిస్తుండడం వీటికి బలం చేకూరుస్తోంది.

* ఇండియన్‌ నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ 324 విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాలో సోమవారం ప్రారంభమైంది. తూర్పు నౌకాదళం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా సమక్షంలో దీనిని కమిషనింగ్‌ చేశారు. ఈ స్క్వాడ్రన్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌) ఎంకే-3 (ఎంఆర్‌)లను ఉపయోగిస్తుంది. వీటికి ‘కెస్ట్రెల్స్‌’ అని పక్షి జాతి పేరు పెట్టారు. గగనతలంలో విహరిస్తూ కింద ఏమున్నా గమనించడం, వెంటాడి వేటాడడం వీటి లక్షణం. విశాలమైన సముద్రంలో నిఘా, గాలింపు, రక్షణ (రెస్క్యూ) ఈ స్క్వాడ్రన్‌ లక్ష్యం. ఈ హెలికాప్టర్లను అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మెరైన్‌ కమెండోలతో పనిచేసే వీటిని ఎయిర్‌ అంబులెన్స్‌లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తూర్పు తీరంలో ప్రారంభమైన తొలి స్క్వాడ్రన్‌కు కమాండర్‌ ఎస్‌ఎస్‌ దాస్‌ సారథ్యం వహించనున్నారు.

*ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల సభ ప్రొటోకాల్‌ జాబితాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరు చివరి నిమిషంలో మాయమైంది. ఆదివారం వరకూ ప్రొటోకాల్‌ లిస్టులో అచ్చెన్న పేరు ఉంది. దీంతో సభలో పాల్గొనేందుకు సోమవారం అచ్చెన్నాయుడు భీమవరం విచ్చేశారు. తీరా ఇక్కడికి వచ్చాక ఆయన పేరు మాయమైంది. దీంతో ప్రధానికి హెలిప్యాడ్‌ వద్ద స్వాగతం పలికేందుకు వెళ్లాల్సిన ఆయన హోటల్‌ గదిలోనే ఆగిపోయారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అచ్చెన్నకు ఫోన్‌ చేసి హెలిప్యాడ్‌ వద్దకు రావాలని ఆహ్వానించినట్టు సమాచారం. అయితే ప్రొటోకాల్‌లో తన పేరు లేదని కలెక్టర్‌ చెప్పిన విషయాన్ని కిషన్‌రెడ్డికి అచ్చెన్న తెలియజేశారు. దీనిపై కిషన్‌రెడ్డి జిల్లా అధికారులతో సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి అచ్చెన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఇతర టీడీపీ నేతలతో కలిసి అల్లూరి విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించి వెనుదిరిగారు. అల్లూరి జయంత్యుత్సవాల్లో పాల్గొనాలని తమ పార్టీ అధినేత చంద్రబాబును కేంద్రప్రభుత్వం కోరిందని, చంద్రబాబే తనను పార్టీ తరఫున ప్రతినిధిగా పంపారని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు కూడా ప్రొటోకాల్‌లో లేకపోడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రొటోకాల్‌ ఎప్పుడో మంటకలిసి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానించారు. అల్లూరి, ఆయన అనుచరుల వారసులను ప్రత్యేకంగా పరామర్శించి, సత్కరించారు. తొలుత అల్లూరి సోదరుడు సత్యనారాయణరాజు పెద్ద కుమారుడు శ్రీరామరాజు (83)ను మోదీ సన్మానించారు. నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి అనుచరుడు గంటందొర మనవడు గాం బోడిదొర (90)ను చక్రాల కుర్చీలో తీసుకువచ్చారు. ఆయనను ప్రధాని మోదీ శాలువాతో సత్కరించి, నమస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులను కొద్దిమందిని ప్రధాని విడిగా కలిశారు. వారిలో తాడేపల్లిగూడెంకు చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుమార్తె కూడా ఉన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో ప్రారంభించి, స్వాతంత్ర్యోద్యమంలో ఆ దంపతులు చరుకుగా పాలుపంచుకున్నారు.

*అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర సమర యోధుల పోరాట పటిమ, త్యాగాల వల్లే స్వేచ్ఛా భారతదేశంలో ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అల్లూరి పోరాటం ఎనలేనిదని, కానీ ఆయనకు జాతీయ స్ధాయిలో రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పుడు అధికారికంగా జయంత్యుత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రధాని స్వయంగా రాష్ట్రానికి వచ్చి అల్లూరికి నివాళులర్పించడం ఎంతో సముచితమని.. దీనిని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంటు హాల్లో అల్లూరి విగ్రహం పెట్టాలని గతంలో స్పీకర్‌ నిర్ణయించారని, దీనిని తక్షణం ఆచరణలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. కాగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోనూ అల్లూరి జయంతి కార్యక్రమాన్ని పార్టీ నేతలు నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

*వాణిజ్యపన్నుల శాఖలో ఆదాయం పెరుగుదల కోసం చేసే ప్రయత్నాలుగా పేర్కొంటున్న శాఖ పునర్వ్యవస్తీకరణ ఎలాంటి హేతుబద్ధత లేకుండా శాఖను గందరగోళంగా పడవేసే విధంగా ఉందని ఏపీ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్‌ సూర్యనారాయణ, రమే్‌షకుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాఖలోని అధికారాలన్నీ ఉన్నతాధికారుల వద్ద ఉండే విధంగా మూడు ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు శాఖను బలహీనపరుస్తోందని తెలిపారు. బదిలీలను పూర్తిగా కౌన్సిలింగ్‌ విధానంలో చేయాలని, స్టేషన్‌ ప్రాతిపదిక కాకుండా సర్కిల్‌ ప్రాతిపదికన చేయాలని డిమాండ్‌ చేశారు.

*రాష్ట్ర మాజీ ముఖ్యమ్రంతి కొణిజేటి రోశయ్య స్మారకార్థం ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరులో విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రోశయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం వేమూరులో ఆయన విగ్రహ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఖర్చులతోనే విగ్రహం, స్మృతివనం ఏర్పాటు జరుగుతాయని అన్నారు.

*ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ బిజినెస్‌ (ఏయూఎ్‌సఐబీ)లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల (అడ్మిషన్‌)కు ఈనెల ఆరో తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ ప్రవేశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఏయూఎ్‌సఐబీ పరిపాలనా కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం www.audoa.in వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన కోరారు.

*ఏపీకి అడుగడుగునా అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ నిలదీశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు మోదీ మరోసారి ద్రోహం చేశారని…, బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు అమలయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటు, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తదితర హామీలకు కేంద్ర ప్రభుత్వం తగు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

*కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలం బైచిగేరి శివారులో చిరుత మృతి చెందింది. బైచిగేరి శివారు రాజానగర్ కొండల్లో చిరుత పులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మూడు చిరుతల పోరాటంలో ఒకటి మృతి చెందగా, మరో రెండింటికి గాయాలయ్యాయి. బైచిగేరి రహదారి పక్కన చిరుత పులి మృతదేహం పడివుండటం వాహనదారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుత పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

*ఇంద్రకీలాద్రిలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో అమ్మవారికి సారె భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి సారెను సమర్పించాలనుకునే భక్తులు మూడ్రోజుల ముందే ఆలయంలో తెలపాలని ఆలయ అధికారులు సూచించారు. జులై 11, 12, 13 తేదీల్లో అమ్మవారికి శాఖాంభరి ఉత్సవాలు ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలతో మూడ్రోజులపాటు అమ్మవారికి అలంకరించనున్నారు.

*హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. రోజూ వేల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. భక్తులు కానుకలు సమర్పించడం అనవాయితి. టీటీడీకి లక్షలు, కోట్ల రూపాయల్లో కానుకలు వస్తాయి. జూలై 4వ తేదీ రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 6.18 కోట్లు. మొట్ట మొదటిసారి రూ.6 కోట్ల మార్క్ దాటింది. గతంలో 2012 ఏప్రిల్ 1వ తేదీన 5.73 కోట్లు ఆదాయం వచ్చింది.

*సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఏపీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని లేఖలో మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. నందిగామ డీఎస్పీ, చిల్లకల్లు ఎస్ఐతో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య, అలాగే ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో జాస్తి శ్వేతాచౌదరి ఆత్మహత్య కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తుతో నివేదిక ఇవ్వాలని కోరారు.

*విశాఖపట్నం: నగరంలోని పద్మనాభం మండలంలో అల్లూరి 125వ జయంతి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ )కు నిరసన సెగ తగిలింది. పాండ్రంకి గ్రామంలో గోస్తని నదిపై బ్రిడ్జి నిర్మించాలంటూ మాజీ మంత్రిని పాండ్రంగి గ్రామస్తులతో పాటు జనసేన పార్టీ నియోజవర్గ ఇన్‌చార్జ్ పంచకర్ల సందీప్ అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని గ్రామస్తులు బైఠాయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అవంతి శ్రీనివాస్‌ను అక్కడి నుంచి సభాస్థలికి తీసుకువెళ్లారు.

* ఖైరతాబాద్‌ ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. కర్నాటక నుంచి వస్తుండగా బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. పలువురు స్వల్ప గాయాలతో బయటపడగా.. పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బస్సు నిలిచిపోవడంతో సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

* అమర్‌నాథ్‌ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్ర సాగుతున్న కొద్ది యాత్రికుల సంఖ్య పెరుగుతోందని అమర్‌నాథ్‌ క్షేత్ర ట్రస్ట్‌ బోర్డ్‌ తెలిపింది. దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూకు తరలివస్తున్నారని పేర్కొంది.ఈ క్రమంలో యాత్రికుల కోసం అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్యాసింజర్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ (PFS) ప్రారంభించింది. శిబిరాల్లో వసతి, పరిశుభ్రత, ఆహారం నాణ్యతపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంతో పాటు ప్రయాణికుల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నది. అమర్‌నాథ్‌ యాత్ర కోసం తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించగా.. పెద్ద ఎత్తున ప్రయాణికులు బారులు తీరుతున్నారు. రైల్వేస్టేషన్‌లోని వైష్ణవిధామ్‌, పురాణి మండిలోని రామమందిరం, మహాజన్‌ సభ వద్ద తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌ జరుగుతుండగా.. పెద్ద సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారు.

*నవ మంగళూరు ఓడరేవుకు తొలిసారి మైన్‌లైన్‌ కంటైనర్‌ నౌక చేరుకోవడంతో జల ఫిరంగిలతో సాదరంగా స్వాగతించారు. ఎంఎన్‌సీ ఎర్మీనియా నౌక మంగళూరుకు రావడంపై నౌకాయాన అధికారులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. 276.5 మీటర్‌ల పొడవు కలిగిన నౌక ఆదివారం సాయంత్రం మంగళూరు తీరానికి వచ్చింది. నౌక 1771 ట్వంటీ పోట్‌ ఈక్వెలెంట్‌ యూనిట్‌ (టీఇయూ)తో పాటు 1265 కంటైనర్‌లను రవాణా చేసే సామర్థ్యం కలిగి ఉంది. నవ మంగళూరు పోర్టు అథారిటీ అధ్యక్షులు డాక్టర్‌ అక్కరాజు వెంకట రమణ పచ్చజెండా ఊపి స్వాగతించారు. ఏడైనా మైన్‌లైన్‌ కంటైనర్‌ ఓడరేవుకు వచ్చిందంటే అంతస్థాయిలో సరుకు రవాణాకు సిద్ధగా ఉండాల్సి ఉంటుంది. నవమంగళూరు ఓడరేవులో భారీగా కంటైనర్‌ల మేర సరుకు ఉన్నమేరకే మైన్‌లైన్‌ కంటైనర్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళూరు నుంచి దేశవిదేశాలకు భారీగా సరుకు రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

*నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు.మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మరోసారి కాల్వలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోపు పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాల్వ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని చెప్పారు. దీంతో అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.