Devotional

ఆ రాష్ట్రాల్లోని ఆల‌యాల్లో ఉన్న దేవ‌తామూర్తుల విగ్ర‌హాలు అన్నీ ఇక్క‌డ త‌యారైన‌వే !!

ఆ రాష్ట్రాల్లోని ఆల‌యాల్లో ఉన్న దేవ‌తామూర్తుల విగ్ర‌హాలు అన్నీ ఇక్క‌డ త‌యారైన‌వే !!

నల్లని రాళ్లలో దాగున్న చల్లని కండ్లను చూస్తారు వాళ్లు. ఉలితో శిలలకు ఊపిరిపోస్తారు. రాళ్లను జవరాళ్లుగా, కఠిన శిలలను కారుణ్యమూర్తులుగా తీర్చిదిద్దుతారు. అపురూప శిల్పకళతో అచ్చెరువొందే దేవతా విగ్రహాలను చెక్కుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ..రామడుగు శిల్పులు. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వందలాది ఆలయాల్లో నిత్యం లక్షలాది మంది భక్తుల కైమోడ్పులు అందుకుంటున్న దేవతామూర్తులు రూపుదిద్దుకున్నది రామడుగులోనే! అడుగు అడుగులో ఉలి అలికిడులు వినిపించే రామడుగు కథ ఇది.
ramadugu1-V-jpg-816x480-4g
కరీంనగర్‌ పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామడుగు మండల కేంద్రం. ఈ ఊరి పొలిమేరకు చేరగానే ‘పహాడ్‌’రాగాలు వినిపిస్తాయి. ఏ సంగీతజ్ఞులో వినసొంపుగా వీణ మీటుతున్నారని అనుకుంటే పొరబడినట్లే! కఠిన శిలను ఉలితో సుతారంగా మోదుతుంటే పల్లవించే స్వరాలు అవి. గ్రామంలో దాదాపు 70 కుటుంబాలు శిల్పకళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. సుమారు 300 మంది కళాకారులు శిల్పాల తయారీ తపస్సులో లీనమవుతారు. ఆ వీధుల్లోకి వెళ్తే మలుపు మలుపులో అచ్చెరువొందే శిల్పాలు తారసపడతాయి. ఒకచోట స్థిరప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్న సిద్ధివినాయకుడి మూర్తి దర్శనమిస్తుంది. మరోచోట ప్రసన్నంగా ఆసీనుడైన లక్ష్మీనరసింహుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ చెంతనే మీసం మెలేస్తూ చంద్రశేఖర్‌ ఆజాద్‌ శిల్పం, మరో పక్క ధ్యానముద్రలో ఉన్న జాతిపిత విగ్రహం ఇలా.. రకరకాల శిల్పాలు రామడుగు కళాకారుల ప్రతిభకు తార్కాణంగా దర్శనమిస్తాయి.
ramadugu3
ఆరు శతాబ్దాల చరిత్ర
తరతరాలుగా రామడుగు కళాకారులు శిల్పకళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. సుమారు 600 సంవత్సరాల కిందట రామడుగు గడికోట నిర్మాణం జరిగింది. ఆ సమయంలో పలువురు శిల్పులు కర్ణాటక నుంచి వచ్చి గడికోట నిర్మాణంలో పాలుపంచుకున్నారు. కోట నిర్మాణం తర్వాత వారిలో కొందరు ఇక్కడే స్థిరపడ్డారు. ఆనాటి కళాకారుల వారసులు ఈనాటికీ శిల్పకళతో అందరి మన్ననలూ పొందుతున్నారు. రామడుగులో శిల్పాల తయారీకి అమృతశిలను ఉపయోగిస్తారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట, ఐతుపల్లి గ్రామాల నుంచి ఈ శిలను తీసుకొస్తారు. అడుగున్నర ఎత్తుండే నవగ్రహాల విగ్రహాలు మొదలుకొని పదేసి అడుగుల భారీ విగ్రహాల వరకు ఇక్కడ చెక్కుతారు. విగ్రహం సైజును బట్టి రెండు రోజుల నుంచి నెల రోజుల సమయం పడుతుంది. రామడుగు శిల్పాలను కొనుగోలు చేసేందుకు తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రాంతాల నుంచీ వస్తుంటారు. ‘గ్రామదేవతలు, ఆంజనేయస్వామి, గణపతి, శ్రీరాముడు, శివలింగాలు, నవగ్రహ విగ్రహాలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి’ అని చెబుతారు రామడుగు శిల్పి రామానుజాచారి.
ramadugu4
శిల్పకళా నైపుణ్య కేంద్రం
ఒకప్పుడు శిల్పకళ ఒకే కులానికి పరిమితంగా ఉండేది. వారిని శిల్పకారులు (కాశి కులస్థులు) అని పిలిచేవారు. వంశ పారంపర్యంగా వచ్చిన శిల్పకళను భవిష్యత్‌ తరాలకు అందించే ఉద్దేశంతో ఆసక్తి ఉన్న యువకులకు విగ్రహాల తయారీలో శిక్షణనిస్తున్నారు వీళ్లు. ఇందుకోసం శెకల్ల హరిహరాచారి శిల్పకళా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కులమతాలకు అతీతంగా అరుదైన కళను నేర్పుతున్నారు. ఈ కేంద్రం నుంచి పదుల సంఖ్యలో కళాకారులు తయారవుతున్నారు. రామడుగు కీర్తి దశదిశలా వ్యాపించినా.. అక్కడి కళాకారులు మాత్రం చాలీచాలని సంపాదనతో బతుకులు వెళ్లదీస్తున్నారు. వందలాది ఆలయాల్లో రామడుగు విగ్రహాలు కొంగుబంగారమై భక్తుల కోర్కెలు నెరవేరుస్తున్నా.. వీరి జీవితాల్లో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు. ‘శిల, పరికరాల ధరలు పెరగడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతున్నది. విగ్రహం ఎత్తు చూసి విలువ కడుతున్నారే కానీ, దాన్ని తీర్చిదిద్దడంలో కళాకారులు పడుతున్న శ్రమను గుర్తించడం లేదు’ అని రామడుగు శిల్పులు వాపోతున్నారు. తరాలుగా కళనే నమ్ముకుని జీవిస్తున్న ఈ శిల్పుల జీవితాల్లో కొత్త వసంతం
రావాలని కోరుకుందాం.