Politics

అట్లాంటాలో అమరావతి ప్రకంపనలు

అట్లాంటాలో అమరావతి ప్రకంపనలు

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా అమెరికాలోని అట్లాంటాలో హైకింగ్

అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేస్తున్న ప్రజా మహా పాదయాత్రకి సంఘీభావంగా అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో అక్టోబర్ 16న హైకింగ్ ద్వారా సుమారు నాలుగు మైళ్ళు పాదయాత్ర చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక సానీ మౌంటైన్ ఇండియన్ సీట్స్ ట్రైల్ లో అమరావతికి మద్దతుగా మాది ఆంధ్రప్రదేశ్ మా రాజధాని అమరావతి అంటూ నినదించారు. సుమారు 200 మంది పెద్దలు, మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జై అమరావతి జయహో అమరావతి, వన్ స్టేట్ వన్ క్యాపిటల్, బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని మారు మ్రోగించారు. ఇండియా నుంచి లైవ్లో ఫోన్ ద్వారా పయ్యావుల కేశవ్ హైకింగ్ లో పాల్గొన్నవారిని అభినందించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించారు, కోర్టు తీర్పులు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉన్నాయన్నారు. అలాగే అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు స్వరాజ్యరావు మరియు రామారావు ప్రస్తుతం అరసవల్లి పాదయాత్ర జరుగుతున్న తీరు, సంయమనం పాటిస్తూ తాము పోరాడుతున్న విధానం ఇలా పలు విషయాలపై లైవ్లో ఫోన్ ద్వారా వివరించారు.

నాది విశాఖపట్నం నా రాజధాని అమరావతి, నాది అనంతపురం నా రాజధాని అమరావతి, నాది కడప నా రాజధాని అమరావతి, నాది శ్రీకాకుళం నా రాజధాని అమరావతి, నాది తూర్పు గోదావరి జిల్లా నా రాజధాని అమరావతి అంటూ 13 ఉమ్మడి జిల్లాల వాసులు ఈ కార్యక్రమంలో ముక్తకంఠంతో నినదించడం అభినందనీయం. అట్లాంటా వాసులు గతంలో అమరావతి రైతులకి మద్దతుగా ర్యాలీ, అలాగే 14 లక్షల 96 వేల 16 రూపాయల ఆర్థిక సహాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు అట్లాంటా వాసులు అమరావతికి తోడ్పాటు అందిస్తూనే ఉన్నారంటూ అభినందించారు.
10