FashionNRI-NRT

హైదరాబాదులో అంగరంగ వైభవంగా తానా కళోత్సవం

హైదరాబాదులో అంగరంగ వైభవంగా తానా కళోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌, తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక, తారా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల నిర్విరామంగా 12 గంటలపాటు నిర్వహించిన ‘బహుజన కళోత్సవం’ విజయవంతమైంది. ఈ సందర్భంగా తానా తొలిసారి ప్రకటించిన ‘బహుజన బంధు’ పురస్కారాన్ని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు సంఘం అధ్యక్షులు అంజయ్యచౌదరి లావు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాంస్కృతిక సారథి ఛైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తన పాటలతో ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో కృష్ణమోహన్‌రావు ప్రసంగిస్తూ.. బీసీల అభ్యున్నతికి తుదకంటూ పాటుపడతానన్నారు. అంజయ్య చౌదరి మాట్లాడుతూ బహుజన కళారూపాలను సంస్కృతీ వైభవానికి ప్రతీకలుగా అభివర్ణించారు.
తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ కొత్త సంవత్సరం నుండి కొత్త ప్రక్రి యను చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. మన సాంస్కృతిక కళా వైభవానికి ప్రతీకలు బహుజన కళా రూపాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో జులైలో అమెరికాలో జరిగే తానా మహాసభలలో కూడా బహుజన కళాకారులకు సముచితంగా గౌరవిస్తామన్నారు. డా. వకుళాభరణంకు బహుజన బంధు అవార్డును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అడిగిన వెంటనే పురస్కారం తీసుకోవడానికి అంగీకరించిన డాక్టర్‌ వకుళాభరణంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వకుళాభరణం తనకు విద్యార్థి దశ నుండే ఉద్యమకారుడిగా పరిచయమన్నారు. నమ్ముకున్న సిద్ధాంతంకోసం నిరంతరం కృషి చేస్తూ ఆయన ఎదుగుతున్న క్రమం ఆదర్శం అన్నారు. ఈ పురస్కారం ఆయనకు అందజేయడం సముచితమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బహుజన కళా కారులకు కొదవ లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన బహుజన కళాకారులు తమ కళా ప్రదర్శనలను ఆద్భుతంగా ప్రదర్శించారు. బహుజన శతకం రచించిన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తనదైన పద్ధతిలో ఆలపించిన పద్యాలు ఆకట్టుకున్నాయి.
21
తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు డా.ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. వెలుగుచూడని మరెన్నో బహుజన కళారూపాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా పరిచయం చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం పద్మశ్రీ పురస్కార స్వీకర్తలు దళవాయి చలపతిరావు, కిన్నెరమెట్ల మొగిలయ్య, చింతకింది మల్లేశం, ఆచార్య కొలకలూరి ఇనాక్‌, ఎడ్ల గోపాలరావు, డా.కూటికుప్పల సూర్యారావు, డా.సాయిబాబాగౌడ్‌లను సత్కరించారు. లండన్‌కు చెందిన తెలుగు పాటల గాయకుడు ‘పోలాండ్‌ బుజ్జి’ని సన్మానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన బహుజన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తారా ఆర్ట్స్‌ నిర్వాహకులు రాజేష్‌ సంకె సమన్వయకర్తగా వ్యవహరించారు. నటుడు, ఐపీఎస్‌ అధికారి కృష్ణసాయి, వ్యాపారవేత్త మంజులరాణి, నర్తకి సజిని వల్లభనేని పాల్గొన్నారు.
అంజయ్య చౌదరి లావుకు సత్కారం
అంతర్జాతీయ తెలుగు సంస్థ ఇట్‌ క్లా సంస్థ కార్యాలయంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరిని, ఇట్‌ క్లా సంస్థ అధ్యక్షులు సంస్కృతిరత్న డాక్టర్‌ కే. ధర్మారావు ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి తిరుమల తిరుపతి స్వామి వారి వార్షిక క్యాలెండర్‌ ను బహుకరించారని ఇట్‌ క్లా సంస్థ కన్వీనర్‌ మంత్రి భుజంగ్‌ రావు తెలిపారు.