Devotional

కనకదుర్గమ్మ కు గాజులు అంటే మహా ఇష్టం

కనకదుర్గమ్మ కు గాజులు అంటే మహా ఇష్టం


🙏🌺అమ్మవారికి గాజులంటే ఇష్టం🌺🙏

🌺శ్రీ కనకదుర్గమ్మ మహిమలు అనంతం అమోఘం. అమ్మవారికి గాజులు సమర్పించటం అనే ఆచారం ఈ విధంగా వచ్చింది. 🌺

🌺పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంత కాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏవీ జరగకుండా నిలిచిపోయాయి.

వారి ప్రభావం తగ్గిన తరువాత, పండితులంతా ఒకచోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునః ప్రతిష్టిస్తేనే గానీ, అర్చన చేయటానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఈ విషయం గురించి పెదకళ్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్ణదీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతిశాస్త్రి అనే పండితుల్ని విచారించగా…

మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు, ”దుర్గాదేవి స్వయంభువు ఆ తల్లి తిరిగి పునః ప్రతిష్ట చేయాల్సిన అవసరం లేదు. మంత్ర పూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది” అని చెప్పి

వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణా కార్యక్రమాలు చేసి, కొంతకాలం సకుటుంబంగా ఆ ఆలయంలోనే వుంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు. 🌺

🌺అప్పుడొక ఆశ్చర్య సంఘటన జరిగింది. వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాణ్ణి పిలిచి, తమ చేతులకి గాజులు తొడిగించుకున్నారట.

వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరికి గాజులబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులివ్వమని అడుగగా, ”అదేంటి మా యింట్లో ఉంది నలుగురమే!

మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా? మరి ఐదుగురెక్కడున్నారు” అని గాజులమ్మే
వానిని ప్రశ్నించారు.

‘లేదు నేను ఐదుగురికి గాజులు తొడిగాను. ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలకెళ్లి దాక్కుని ఉంటుంది? అని ఆ గాజులవాడు రెట్టించాడు.

వారి వాదన విన్న ఆ పండితులు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కణ్ణించి వచ్చింది, ఎక్కడకెళ్లింది, అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు.

చివరికి ఆలయంలోకి వెళ్లి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట. ఆశ్చర్యం! అద్భుతం! ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి, వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేసారు. 🌺

🌺అది ఆనోటా ఆనోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టం అనీ, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.

ఈ గాజుల సంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది.

విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారు.