NRI-NRT

దొడ్డి దారిన అమెరికా చేర్చినందుకు ఐదు లక్షల డాలర్లు..

దొడ్డి దారిన అమెరికా చేర్చినందుకు ఐదు లక్షల డాలర్లు..

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.

అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.

ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.కాగా.అక్రమంగా అమెరికా సరిహద్దులను దాటేందుకు గాను భారతీయులు భారీగానే ముట్టజెబుతున్నారట.

తాజాగా కెనడా మీదుగా అమెరికాలోకి వలసదారులను తరలించే మానవ అక్రమ రవాణా రింగ్‌ను మేనేజ్‌ చేసినందుకు గాను, భారత సంతతికి చెందిర రాజిందర్ పాల్ సింగ్‌ 5,00,000 డాలర్ల పైనే అందుకున్నట్లు అంగీకరించాడు.ఇతనిని గతేడాది మేలో వాషింగ్టన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

సీబీసీ న్యూస్ ప్రకారం.రాజిందర్ సింగ్ తన స్వలాభం కోసం కొంతమంది విదేశీయులను అక్రమంగా రవాణా చేసేందుకు కుట్ర పన్నడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు.

ఈ మేరకు సీటెల్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్‌లో జరిగిన విచారణ సందర్భంగా రాజిందర్ నేరాన్ని అంగీకరించాడు.ఈ నేరానికి సంబంధించి మే 9న అతనికి న్యాయమూర్తి శిక్షను ఖరారు చేయనున్నారు.గతేడాది జనవరిలో అమెరికా – కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

మృతులను జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు విహంగీ పటేల్, ధార్మిక్ పటేల్‌గా గుర్తించారు

వీరి మృతదేహాలు విన్నిపెగ్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో వున్న ఎమర్సన్‌కు తూర్పున మంచు కప్పబడిన పొలంలో కనిపించాయి.ఈ కేసుతో పాటు మరికొంతమందిని అక్రమంగా అమెరికాకు తరలించినందుకు గాను రాజిందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.నివేదిక ప్రకారం.

ఇందుకుగాను అతను ఒక్కొక్కరి నుంచి 11,000 డాలర్ల వరకు వసూలు చేసేవాడు.ఈ నేరాలకు సంబంధించి అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం 2018 నుంచి దర్యాప్తు జరుపుతోంది.