Fashion

పెద్దల సభకు “జర్నలిజం” పీజీ విద్యార్థిని!

పెద్దల సభకు “జర్నలిజం” పీజీ విద్యార్థిని!

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె… 26 సంవత్సరాల పిన్న వయసులోనే ప్రత్యక్ష ఎన్నికల్లో విజయవాడ మేయర్‌గా ఎన్నికై అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తెదేపాలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అనురాధ… 23 సంవత్సరాలుగా పార్టీనే అంటిపెట్టుకుని క్రమశిక్షణగల నాయకురాలిగా, పార్టీకి విధేయురాలిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014లో రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి లభించింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు.
వివాహం తరువాత చదువు కొనసాగింపు ..
అనురాధ తండ్రి స్వర్గం పుల్లారావు ఆదాయ పన్నుల శాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేశారు. ఆమె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్‌తో వివాహమైంది. వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించిన ఆమె… 1996లో డిగ్రీ పూర్తి చేశారు. 2008-2010లో గుంటూరు- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పట్టా తీసుకున్నారు. ✍️