Movies

నాటి సినిమా హాలుల కబుర్లు

నాటి సినిమా  హాలుల కబుర్లు

అప్పట్లో టికెట్లు ధర నేల 25, బెంచి 40, కుర్చీ 75 పైస‌లు. థియేట‌ర్ల ప్ర‌త్యేక‌త ఏమంటే టికెట్లు ఇస్తూనే వుంటారు.

నేల ఫుల్‌గా నిండి ఒక‌రి భుజాల మీద ఇంకొక‌రు కూచున్నా బుకింగ్ ఆగ‌దు. లోప‌ల భీక‌ర యుద్ధాలు జ‌రుగుతున్నా గేట్ కీప‌ర్ చ‌లించ‌డు. బెంచ్ క్లాస్‌లో అయితే ఎగ‌స్ట్రా బెంచీలు, బాల్క‌నీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేల‌కి ఆ సౌక‌ర్యం లేదు. ఒక‌రి మీద ఇంకొక‌రు , ఎవ‌రి మీద ఎవ‌రు కూచున్నారో వాళ్ల‌కు కూడా తెలియ‌దు. కొంద‌రైతే స్క్రీన్ ముంద‌రున్న అరుగు మీద కూచుని కొండ‌ల్లా క‌నిపించే హీరో ముఖాన్ని చూసి జ‌డుసుకునే వాళ్లు. ఆడ‌వాళ్ల నేల‌క్లాస్‌లైతే కుళాయి నీళ్ల‌లా ధారాపాతంగా బూతులు, కొంద‌రైతే జుత్తు ప‌ట్టుకుని ఉండ‌ల్లా దొర్లేవాళ్లు. ఫ‌స్ట్ షోకి వ‌చ్చిన ఆడవాళ్లు సెకెండ్ షో వ‌ర‌కూ తిట్టుకునే వాళ్లు.

ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడ‌ని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగ‌రెట్లు ముట్టించి “బుస్‌”మ‌ని పొగ వ‌దిలేవాళ్లు. తాగిన వాళ్ల‌కి, తాగ‌ని వాళ్ల‌కి స‌మానంగా ద‌గ్గొచ్చేది. సినిమా మాంచి ర‌సప‌ట్టులో అంటే ఎన్టీఆర్ క‌త్తిని ముద్దు పెట్టుకుని ఒంటిచేత్తో తిప్పుతున్న‌ప్పుడు రెండు ఈల‌లు, ఆయ‌న డూప్ రెండు చేతుల‌తో తిప్పుతున్న‌ప్పుడు ప‌ది ఈలలు వినిపిస్తూ వుండ‌గా అంద‌రినీ తొక్కుతూ కొంద‌రు ప్ర‌వేశించేవాళ్లు.

“ఎవ‌రిక‌యా నిమ్మ‌సోడా” అని ఒకడు, “వేయించిన శ‌న‌క్కాయ‌లూ” అని ఇంకొక‌డు, “చ‌క్కిలం, చ‌క్కిలం” ఇలా రాగ‌యుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ల‌కి కుయ్యిమ‌ని సౌండ్‌తో సోడా, తుప్పు ప‌ట్టిన పావుతో శ‌న‌క్కాయ‌లు కొలిచి ఇచ్చేవారు. ఇంత ఇరుకులో కూడా ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు వ‌స్తే జ‌నం ప‌కప‌క న‌వ్వేవాళ్లు. అంజ‌లిదేవిని చూసి ఏడ్చేవాళ్లు.

ఇక బెంచిల్లోకి వెళ్దాం. థియేట‌ర్ పుట్టిన‌పుడు కొన్ని వేల న‌ల్లులు బెంచిల్లోకి వ‌ల‌స వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల రాక కోసం ఎదురు చూస్తూ, వ‌చ్చిన వెంట‌నే కుటుంబ స‌మేతంగా దాడి చేస్తాయి. మొద‌టిసారి కుట్టిన‌పుడు ఉలిక్కిప‌డ‌తాం. రెండోసారి ప‌డ‌తాం. త‌ర్వాత అల‌వాటు ప‌డ‌తాం. ఆ దుర‌ద‌కు త‌ట్టుకోలేక కొంద‌రు లేచి నిల‌బ‌డి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్లు కూచోమ‌ని అరుస్తూ వుంటారు.

కొంద‌రు సీనియ‌ర్ ప్రేక్ష‌కులు ఉంటారు. వాళ్ల‌కి న‌ల్లుల‌తో అనుభ‌వంతో పాటు శాశ్వ‌త శ‌త్రుత్వం వుంటుంది. అందుక‌ని అగ్గిపుల్ల గీచి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్ర‌యోజ‌నం ఏమంటే కొన్ని న‌ల్లులు వీర‌మ‌ర‌ణం పొందుతాయి. అయితే క‌సి, ప‌గ‌, ప్ర‌తీకారంతో మిగిలిన‌వ‌న్నీ కుట్ట‌డం ప్రారంభిస్తాయి. ఈ కుట్ల‌కి ప్రేక్ష‌కులు బెంచీల మీద ఎగిరెగిరి ప‌డుతూ వుంటారు. ఈ క్లాస్‌లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు త‌క్కువ‌, సిగ‌రెట్ల కంపు ఎక్కువ‌.

బాల్క‌నీలో కుర్చీలు ఉంటాయి. వాటి చ‌ర్మం చిరిగిపోయి లోప‌లున్న కొబ్బ‌రి పీచు, దూది పొట్ట‌పేగుల్లా క‌నిపిస్తూ వుంటాయి. కుర్చీల్లో పెద్ద‌గా న‌ల్లులుండ‌వు. కానీ మేకులుంటాయి. అవి మ‌న బ‌ట్ట‌ల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్ర‌త్త‌గా లేస్తే ప‌ర్‌మ‌ని సౌండ్. బాల్క‌నీలో ప్రొజ‌క్ట‌ర్ రూమ్ కూడా వుంటుంది. సోడాలు, శ‌న‌క్కాయ‌ల ట్రాఫిక్ పెరిగిన‌ప్పుడు వాళ్ల త‌ల‌కాయ‌లు స్క్రీన్ మీద క‌నిపిస్తూ వుంటాయి.

అన్ని క్లాస్‌ల్లోనూ ఫ్యాన్లు వుంటాయి. అయితే ఫ్యాన్ కింద సీటు సంపాయించ‌డం చాలా క‌ష్టం. సంపాయించినా అది స‌వ్యంగా తిరిగే ఫ్యాన్ అయి వుండ‌డం మ‌రీ క‌ష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వ‌చ్చిన‌ట్టు గీక్ గీక్ అని అరుస్తూ వుంటాయి. అవి ఊడి మీద ప‌డ‌క‌పోవ‌డం మ‌న అదృష్టం.

ఇక్క‌డితో మ‌న క‌ష్టాలు ఆగ‌వు. క‌రెంట్ వాళ్ల ద‌య ఉండాలి. ప‌వ‌ర్‌క‌ట్‌. జ‌న‌మంతా పిచ్చెక్కిన‌ట్టు ఈల‌లేస్తారు. జ‌న‌రేట‌ర్లు లేని కాలం కాబ‌ట్టి క‌రెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాక‌పోతే పాస్‌లు ఇచ్చి పంపుతారు. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూడాలి.

రిలీజైన ఏడాదికి ఆంధ్రదేశ‌మంతా ఆడిన త‌ర్వాత మాకు వ‌చ్చేది. పాత ప్రింట్లు కావ‌డంతో సినిమా అంతా గీత‌లు గీత‌లు వ‌చ్చి క‌ట్ అయ్యేది. ఇన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం.ఇపుడు ఇన్ని సౌక‌ర్యాల మ‌ధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావ‌డం లేదు. అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం అదేనేమో!