WorldWonders

ఘోర రైలు ప్రమాదంలో 207 మంది మృతి, 900 మందికిపైగా గాయాలు..

ఘోర రైలు ప్రమాదంలో  207 మంది మృతి, 900 మందికిపైగా గాయాలు..

ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 207మందికి పైగా చేరింది. అదే సమయంలో 900 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెన అధికారికంగా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ చర్యల్లో వైమానిక దళం సైతం పాల్గొంటుంది. రెస్క్యూ, ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ కోసం వైమానిక దళం సేవలు అందిస్తోంది. కోల్‌కత్తా నుంచి ఘటనా స్థలానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుని సేవలు అందిస్తోంది. అంబులెన్సులు, వైద్యబృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారికి బాలేశ్వర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతపై, సహాయక చర్యలపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం ఆదేశాలతో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు.

ఇదిలాఉంటే.. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 120 మంది విజయవాడ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా షాలిమార్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీ సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయి. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం 10కి విజయవాడ చేరాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘోరం జరుగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.ఒడిశా రైలు ప్రమాదంపై విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్ 0866-2576924, రాజమహేంద్రవరం హెల్ప్ లైన్ నెంబర్ 0883-2420541, విశాఖ రైల్వేస్టేషన్‌లోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు.