WorldWonders

తెలంగాణకు ఇంటర్నేషనల్ లెవల్లో అరుదైన గుర్తింపు….

తెలంగాణకు ఇంటర్నేషనల్ లెవల్లో అరుదైన గుర్తింపు….

ది గ్రీన్ ఆర్గనైజేషన్‌ అనేది లండన్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ.. ఇది 1994లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సంస్థ ప్రచారం చేయడంతో పాటునే.. అందుకోసం కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఇస్తుంది. అది కూడా 2016 నుంచి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టింది సంస్థ. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, కమ్యూనిటీలు, కౌన్సిల్స్‌‌కు ఈ సంస్థ అవార్డులను అందిస్తోంది. అయితే… అందులో పలు కేటగిరీలను కూడా గ్రీన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది.

తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ అందిస్తున్న గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు.. మన తెలంగాణలోని ప్రముఖ కట్టడాలకు దక్కటం విశేషం. అందులో.. కొత్త సచివాలయం, యాదాద్రి పుణ్యక్షేత్రం, దుర్గం చెరువు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మొజంజాహీ మార్కెట్‌ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇండియాకు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కటం ఇదే మొట్టమొదటిసారి అని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ స్పష్టం చేసింది.

బ్యూటిఫుల్‌ వర్క్‌స్పేస్‌ బిల్డింగ్ కేటగిరీలో కొత్త సచివాలయానికి, హెరిటేజ్‌ విభాగంలో మొజంజాహీ మార్కెట్‌కు, యూనిక్‌ డిజైన్‌ విభాగంలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జికి, స్పెషల్‌ ఆఫీస్‌ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు వచ్చాయి. అయితే… మే 16న లండన్‌లో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు 5 అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.