Sports

ఆంధ్రకు ఐపీల్ జట్టు ఎందుకు లేదు?

ఆంధ్రకు ఐపీల్ జట్టు ఎందుకు లేదు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే మరో రెండు జట్లను తీసుకొచ్చారు. దాంతో భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నా.. అది హైదరాబాద్‌ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ప్రస్తుతం ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేదు. ఆంధ్రకు కూడా ఓ ప్రాంచైజీ ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఆంధ్రకు ఐపీఎల్ ప్రాంచైజీ ఎందుకు లేదో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఎమ్మెస్కే పలు విషయాలు పంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ జట్లు ఉన్నా ఆంధ్రకు మాత్రం ఎందుకు లేదు?, బీసీసీఐలో కీలక రోల్ ప్లే చేసిన మీకు చిన్నతనంగా లేదా?, బీసీసీఐలో ఎవరైనా అడ్డుపడ్డారా? అని యాంకర్ అడగ్గా… ‘ఐపీఎల్, బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. సౌత్ ఇండియా నుంచి తమిళనాడుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, కర్నాటకకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, హైదరాబాద్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో 6-7 రాష్ట్రాలు ఉండగా.. ఒక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాత్రమే ఉంది. ఐపీఎల్‌ టీమ్ ఓ ఫ్రాంచైజీ నుంచి వస్తుంది కానీ.. ప్రాంతం తరఫున రాదు’ అని ఎమ్మెస్కే బదులిచ్చాడు.

‘ఐపీఎల్ ప్రాంచైజీ బిడ్డింగ్ బట్టి ఉంటుంది. రెండేళ్ల కింద రెండు జట్లు అమ్మారు. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీలను అమ్మారు. అపుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్‌చంద్రా రెడ్డి 3,500 కోట్లకు బిడ్‌ వేశారు. 5500 కోట్లకు ఓ టీమ్, 7200 కోట్లకు మ్ముడుపోయింది. ప్రాంచైజీ కొన్నదాన్ని బట్టి ఉంటుంది కానీ.. ప్రాంతాన్ని బట్టి ఉండదు. ఓ సమయంలో వైజాగ్ లేదా అమరావతి నుంచి టీమ్ వస్తుందని అనుకున్నా.. అది జరగలేదు. టీమ్స్ ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని మ్యాచులు ఉండడం వల్లనే అంతర్జాతీయ మ్యాచులలో భారత్ ఓడిపోతుందని అంటున్నారు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.