Food

దక్షిణ కొరియా వాసులు ఉప్పుకోసం పరుగులు

దక్షిణ కొరియా వాసులు ఉప్పుకోసం పరుగులు

దక్షిణ కొరియా వాసులు కొంత కాలంగా ఉప్పు, ఇతర సముద్ర ఉత్పత్తుల కోసం ఎగబడుతున్నారు! వీటిని తమ ఇళ్లలో పెద్దమొత్తంలో నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా.. దుకాణాల్లో ఉప్పు కొరత ఏర్పడుతోంది. దీనంతటికీ కారణం.. జపాన్‌ తన ధ్వంసమైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా శుద్ధి చేసిన రేడియోధార్మిక జలాలను సముద్రంలోకి వదిలేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడమే. దీంతో ఆరోగ్య భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా.. దక్షిణ కొరియా వాసులు సముద్రపు ఉప్పు, ఇతర వస్తువుల నిల్వలపై దృష్టి సారించారు.2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి సునామీ ఏర్పడి.. అక్కడి ఫుకుషిమా అణుకేంద్రం ధ్వంసం అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పెద్దమొత్తంలో రేడియోధార్మిక జలాలు ఇక్కడే పేరుకుపోయాయి. వీటిల్లో అణు రియాక్టర్‌ను చల్లబర్చేందుకు వాడినవి, వర్షపునీరు వంటివి ఉన్నాయి. ఆ కలుషిత జలాలను జపాన్‌ భారీ ట్యాంకుల్లో నిల్వ చేసి ఉంచింది. దీన్ని త్వరలోనే సముద్రంలో వదిలేందుకు సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక పద్ధతుల ద్వారా ఈ నీటిని శుద్ధి చేశామని, దీనిలో చాలా వరకు రేడియోధార్మిక వ్యర్థాలను తొలగించినట్లు జపాన్‌ చెబుతోంది.

అయితే, దీనిపై మత్స్యకార వర్గాలు, సమీప దేశాల తీరప్రాంతవాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రజారోగ్యానికి ముప్పు, సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని చెబుతూ చైనా కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలతో అప్రమత్తమైన దక్షిణ కొరియా ప్రజలు.. ఉప్పును భారీగా నిల్వ చేసుకుంటున్నారు. దీంతో రెండు నెలలుగా దక్షిణ కొరియాలో ఉప్పు ధర దాదాపు 27 శాతం పెరిగింది. ధరల పెరుగుదలపై అప్రమత్తమైన ప్రభుత్వం జూలై 11 వరకు మార్కెట్ ధరలతో పోలిస్తే 20 శాతం తగ్గింపుతో రోజుకు 50 మెట్రిక్ టన్నుల ఉప్పును అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. మరోవైపు.. భవిష్యత్తులో ఉప్పు మడుల్లో రేడియోధార్మికత పెరగకుండా నిఘా ఉంచుతామని దక్షిణ కొరియా మత్స్యవిభాగం అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియా ఇప్పటికే ఫుకుషిమా సమీప తీరంలోని సముద్ర ఆహారంపై నిషేధం విధించింది.