DailyDose

రాజస్థాన్ సీఎంపై పరువు నష్టం దావా-TNI నేటి నేర వార్తలు

రాజస్థాన్ సీఎంపై పరువు నష్టం దావా-TNI నేటి నేర వార్తలు

* విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన:ఉపాధ్యాయుడు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు రెండేళ్లుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం లక్కారం జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముడుగు శామ్యూల్‌ తెలిపిన వివరాల ప్రకారం… ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు స్వామి తరగతిలో తమ పక్కన కూర్చుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 9, 10 తరగతుల విద్యార్థినులు బుధవారం హెచ్‌ఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేస్తున్నాడని అందులో పేర్కొన్నారు. రెండేళ్లుగా ఇలాగే ప్రవర్తిస్తున్నాడని, ఆయనపై ఫిర్యాదు చేస్తే మార్కులు తక్కువ వేస్తాడనే భయంతోనే ఇన్ని రోజులు చెప్పలేకపోయామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఆయన తీరులో మార్పు రాకపోవడంతో ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు హెచ్‌ఎం వివరించారు. ప్రధానోపాధ్యాయుడి నివేదిక, విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు బుధవారం సాయంత్రం ఉపాధ్యాయుడు స్వామిని డీఈవో ప్రణీత సస్పెండ్‌ చేశారు.

రాజస్థాన్ సీఎంపై పరువు నష్టం దావా

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్పై పరువునష్టం దావా నమోదైంది. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్.. గెహ్లాట్పై ఈ కేసు వేయగా.. ఆగస్టు 7న హాజరు కావాలంటూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. సంజీవని స్కాంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో షెకావత్ తన పరువుకు భంగం వాటిల్లిందంటూ.. గెహ్లాట్పై రూ.900 కోట్లకు పరువునష్టం దావా వేశారు.

* టిఫిన్ సెంటర్ యజమాని పై కత్తితో దాడికి యత్నించిన వ్యక్తి

దోష లేదన్నందుకు టిఫిన్ సెంటర్ యజమాని పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన సంఘటన రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీలో తోపుడు బండితో వీరమని టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.పట్టణానికి చెందిన మర్కు సామి అనే యువకుడు తోపుడు బండి టిఫిన్ సెంటర్ కి వెళ్లి దోశ ఇవ్వమన్నాడని తెలిపారు. దోష పిండి లేదని యజమాని వీరమని అనగా ఎందుకు టిఫిన్ సెంటర్ పెట్టావ్ అంటూ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడని తెలిపారు. ఆ ఆగ్రహంతో యువకుడు ఇంట్లో నుండి కత్తి తీసుకువచ్చి టిఫిన్ సెంటర్ యజమాని పై దాడి చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారని తెలిపారు. బాధితుడు వీరమని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు.

* మొగల్తూరు మండలంలో విషాదం

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది . జిల్లాలోని మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఇద్దరు జాలరులు చేపల వేటకు వెళ్తుండగా మార్గమధ్యలో విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామానికి చెందిన నారాయణ మృతి (59), వెంకటేశ్వర్లు (56) అనే ఇద్దరు గురువారం సమీపంలోని చెరువులో చేపల వేటకు ఇంటి నుంచి బయలు దేరారు.కొద్దిదూరంలో విద్యుత్‌ తీగలు(Wires) తెగి పడి ఉండడాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ కు గురై మృతి చెందారు. స్థానికుల సమాచారంతో విద్యుత్‌ సిబ్బంది కరెంట్‌ను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

* 2.5 లక్షలు విలువ చేసే టమాటా తోటలో చోరీ

దేశంలో టమాటా ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దీంతో దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో టమాటా పండించే రైతులు తమ పంటలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం టమాటాలను దోచుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో రూ.2.5 లక్షల విలువ చేసే టమాటాలను దొంగలు చోరీ చేశారు.వివరాల్లోకి వెళ్తే.. హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లికి చెందిన మహిళా రైతు ధరణి తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను వేసింది. కాపు కూడా బాగా కాసింది. ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 పైనే పలుకుతోంది. దీంతో తమకు కాసుల వర్షం కురిసినట్లేనని ధరణి భావించింది. రేపోమాపో టమాటా తెంచి, బెంగుళూరుకు తరలించాలని ఆమె ప్లాన్ చేసుకుంది.

* తాళాలు పగలగొట్టి బంగారం చోరీ

గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 3.5 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. తమ బంధువులను ట్రైన్ ఎక్కించడానికి వ్యాపారి కుటుంబం విజయవాడ వెళ్లగా… తిరిగి వచ్చేసరికి తలుపుల తాళాలు పగలకొట్టి బంగారు, వెండి వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. దోపిడీకి గురైన మొత్తం రెండు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

* కిరాణా షాప్‌కు వెళ్లిన నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్‌ కాలనీలో నాలుగేళ్ల బాలిక కృష్ణవేణి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణాషాప్‌కి వెళ్లిన కృష్ణవేణి.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కిడ్నాప్‌ ఘటనతో అలర్టయిన పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. మతి స్థిమితం లేని వ్యక్తి బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్‌తో పాటు వేర్వేరు బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గంటలు గడిచినా బిడ్డ జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* సినిమా రేంజ్‌లో హత్య

హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసి డిమాండ్లకు తరలిస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లక్ష్యనాయక్ తాండ కు చెందిన విట్టల్ హత్యను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందుతులు ప్రయత్నించారు. అయితే.. ఈ విఠల్‌ మరణంపై అనుమానం ఉండటంతో ఆమె భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్ని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. వికారాబాద్ జిల్లా తాండాలో అధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డు తొలగించుకోవాలని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన హత్యను కేసును ఛేదించారు వికారాబాద్ పోలీసులు.

* పల్నాడు జిల్లాలో దారుణం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కసం రక్తసంబంధీకులే ముగ్గురిని మట్టుబెట్టారు. పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ధూళిపాళ్లకు చెందిన పెద్దమీర్సా, చిన్నమీర్సా అన్నదమ్ములు. పెద్దమీర్సా కుటుంబం కొన్నేళ్ల కిందటే ఉపాధి నిమిత్తం సత్తెనపల్లిలో స్థిరపడింది. చిన్నమీర్సా కుటుంబం స్వగ్రామంలోనే జీవిస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్ల కిందట మృతిచెందారు. చిన్న మీర్సాకు భార్య షేక్‌ రహిమున్నీసా(65), కుమార్తె మాలింబీ (36), కుమారుడు రహమాన్‌(38) ఉన్నారు. వీరికి రెండెకరాల పొలం ఉంది. ఆ పొలంపై పెద్దమీర్సా కుమారుడు ఖాసిం కన్నేశాడు. పొలంలో సగభాగం రాసివ్వాలని తరచూ రహిమున్నీసాతో గొడవ పడేవాడు. బుధవారం మధ్యాహ్నం ఖాసిం తన కుమారుడైన బాలుడితో కలిసి సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్లకు బయలుదేరాడు. దారిలో ఎదురైన రహమాన్‌పై దాడిచేసి చంపేసి, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి ఓ దాబా వెనుక గుంతలో పడేశాడు. అనంతరం రహమున్నీసా ఇంటికి వెళ్లి, కర్రలతో దాడిచేశాడు. అడ్డువచ్చిన ఆమె కూతురు మాలింబీని విచక్షణారహితంగా కొట్టాడు. రహిమున్నీసా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మాలింబీని సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. దాడి అనంతరం ఖాసిం, ఆయన కుమారుడు పరారయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. రహమాన్‌ మృతదేహాన్ని గుర్తించారు.

* కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి

దారుణ ఉదంతంలో ఎట్టకేలకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. భారత సంతతికి చెందిన యువతిని ఆమెను ప్రేమించిన వ్యక్తే అతికిరాతకంగా హత్య చేశాడు. అదీ బతికుండగానే కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి మరీ పూడ్చిపెట్టి సజీవ సమాధి చేశాడు. తనను దూరం పెట్టిందనే కోపంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్ట్రేలియా ఈ ఘోరం రెండేళ్ల కిందట చోటు చేసుకుంది.

* మురికివాడలో గ్యాస్ లీక్

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని మురికివాడలో విషాదం చోటు చేసుకుంది. మురికివాడలో గుర్తు తెలియని గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 16 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మృతుల్లో చిన్నారులు కూడా ఉండగా.. సంవత్సరం వయస్సు గల బాలుడు కూడా మృతి చెందాడు. గ్యాస్ లీక్‌కు అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో గ్యాస్ లీక్ కారణంగా ఊపిరి ఆడక చనిపోయిన వారి మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ చెప్పారు. ఈ విషాద సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జోహన్నెస్‌బర్గ్‌ అధికారులు తెలిపారు.