DailyDose

జేపీ నడ్డాతో పురంధేశ్వరి భేటీ-TNI నేటి తాజా వార్తలు

జేపీ నడ్డాతో పురంధేశ్వరి భేటీ-TNI నేటి తాజా వార్తలు

జేపీ నడ్డాతో పురంధేశ్వరి భేటీ

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఏపీ స్టేట్ చీఫ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయనతో ఈ రోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.‘‘నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నాకిచ్చిన బాధ్యత విషయంలో నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చాను” అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

మోడీపై లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్స్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో భారత ప్రధానిగా ఎవరు వచ్చినా అతడు భార్య లేకుండా ఉండకూడదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన భార్య లేకుండా ప్రధాని నివాసంలో ఉండటం చాలా తప్పు అన్నారు. ఈ సంస్కృతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల పాట్నాలో విపక్షాల కూటమి మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని లాలూ సూచించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారాయి. నిజానికి ప్రధాని మోడీ తన సతీమణికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం లేని వ్యక్తికి దేశంలోని ప్రజల సాధక బాధకాలు ఏం తెలుస్తాయని మోడీ టార్గెట్‌గా కొన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానిగా ఎవరు ఉన్నా అతడు భార్య లేకుండా ఉండకూడదని చెప్పడం ఆసక్తిగా మారుతున్నది. వచ్చే ఎన్నికల్లో విపక్షాల కూటమికి 300 సీట్లు వస్తాయని ఈ సందర్భంగా లాలు ధీమా వ్యక్తం చేశారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

 కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,299 మంది భక్తులు దర్శించుకోగా.. 30,479 మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం హుండీ ఆదాయం రూ. 3.93కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

* కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు

కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 11 జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాలు నీటమునిగాయి. 6జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.బోట్ల సాయంతో NDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా,ఐదుగురు గల్లంతయ్యారు.

*  చిక్కుల్లో పడిన నేపాల్ ప్రధాని

నేపాల్ ప్రధాని ప్రచండ (పుష్పకమల్ దహల్) నోరు జారి చిక్కుల్లో పడ్డారు. తాను ప్రధాని పీఠం ఎక్కడానికి తెరవెనుక ఏం జరిగిందో చెప్పి సమస్యలను ఆహ్వానించారు. రోడ్స్ టు ద వ్యాలీ: ద లెగాసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని ప్రచండ ముఖ్య అతిథిగా హాజరాయ్యరు. నేపాల్ లో స్థిరపడిన భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ పై ఈ పుస్తకం తీసుకువచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని ప్రచండ మాట్లాడుతూ, తాను ప్రధానమంత్రి కావడానికి కారణం సర్దార్ ప్రీతమ్ సింగ్ అని వెల్లడించారు. తనను ప్రధాని పీఠం ఎక్కిండానికి సర్దార్ ప్రీతమ్ సింగ్ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరిపారని, ఖాట్మండూలోని రాజకీయ వర్గాలతో చర్చలు జరిపారని తెలిపారు. తాను ప్రధానిగా రావడం వెనుక సర్దార్ ప్రీతమ్ సింగ్ కృషి చాలా ఉందని కొనియాడారు. నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన తన వంతు సహకారం అందించారని వివరించారు.అయితే, ప్రధాని ప్రచండ వ్యాఖ్యలతో విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ ప్రధానిని న్యూఢిల్లీ నియమించినట్టు స్పష్టమవుంతోందని, ప్రధానిగా కొనసాగేందుకు ప్రచండ అనర్హుడని మండిపడ్డారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటులో దీనిపై నిరసనలు వ్యక్తం చేసింది. సభాసమావేశాలకు అడ్డుతగిలిన సీపీఎన్-యూఎంఎల్ పార్టీ ప్రధాని పదవి నుంచి ప్రచండ తప్పుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా ప్రచండ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశ సమగ్రత, పార్లమెంటు, రాజ్యాంగ వ్యవస్థలకు భంగకరం అని పేర్కొన్నారు.అయితే, తన వ్యాఖ్యల పట్ల ప్రధాని ప్రచండ వివరణ ఇచ్చారు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుందని చెప్పడం తన అభిమతం కాదని, సర్దార్ ప్రీతమ్ సింగ్ రాజకీయాల పట్ల కూడా ఆసక్తి చూపేవారని చెప్పడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. 60వ దశకంలో నేపాల్ లో అడుగుపెట్టిన సర్దార్ ప్రీతమ్ సింగ్ అక్కడ ట్రాన్స్ పోర్ట్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. రవాణా రంగంలో స్థానిక సంస్థలను వెనక్కినెట్టి తాను స్థాపించిన సంస్థను నెంబర్ వన్ గా నిలిపారు.

ప్రధాని మోడీ పర్యటన: కిషన్ రెడ్డికి  భారీ ఏర్పాట్లు

తెలంగాణకు ఈ నెల 8న ప్రధనమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ప్రధాని మోదీ హనుమకొండకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈటెల రాజేందర్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్‌కు వెళ్లనున్నారు. అనంతరం సభ నిర్వహణ, జన సమీకరణపై సమీక్ష నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం 10.35 నిమిషాలకు వరంగల్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. మొదట భద్రకాళి అమ్మావారి దర్శనం, ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంకు చేరుకొని వ్యాగెన్ మ్యానిఫ్యాక్టరింగ్, POH నిర్మాణపనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ప్రదాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నా ఎస్‌పీజీ భద్రతా సిబ్బంది.. అయితే, మోదీ సభను విజయవంతం చేయడానికి జనసమీకరణ సహా పలు అంశాలపై కీలకంగా దృష్టి సారించారు బీజేపీ నేతలు. అన్ని జిల్లాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణకు ప్లాన్‌ చేస్తున్నారు.

* దలైలామా 88వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ

దలైలామా 88వ జన్మదిన సందర్భంగా ప్రధామంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ధర్మశాలలో ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది అతని అనుచరులు తరలివచ్చారు. సుగ్లాఖంగ్ ఆలయానికి వేడుకలు జరిపుకునేందుకు దలైలామ రావడంతో కళాకారులు ఆయన సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. తన జన్మదిన వేడుకలపై కూడా దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను 88వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాని.. కానీ నేను ఇప్పటికీ 50 సవంత్సారాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నానని నవ్వుతూ చెప్పారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రా క్రీడలు ప్రారంభం

సీఎం జగన్‌ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, యువత ప్రతిభను వెలికి తీసి రాష్ట్ర, దేశ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా క్రీడలు గాంధీ జయంతి అక్టోబర్ 02 న ప్రారంభించనున్నామని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం సాయత్రం స్థానిక గ్రాండ్ రిట్జ్ హోటల్ నందు యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ప్రిన్స్ పల్ సెక్రటరీ వాణి మోహన్ , ఎం.డి.హర్ష వర్ధన్ , సెట్విన్ సి ఇ ఓ మురళి కృష్ణ , చీఫ్ కోచ్ లతో పర్యాటక శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణ పై సమీక్షించారు.

* “జనసేనాని” పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా రికార్డ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక సినీ నటుడిగా పవర్ స్టార్ గా ప్రజలు అందరూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. కానీ రాజకీయ నాయకుడిగా అనే లోపు అంతగా స్పందన రావడం లేదన్నది కాదనలేని వాస్తవం. తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన ఇంస్టా గ్రామ్ ఖాతాను ఓపెన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఖాతాను తెరిచి కేవలం ఇది మూడవ రోజు, అప్పుడే పవన్ ను అనుసరిస్తున్న వారి సంఖ్య 2 మిలియన్ కు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు ఖాతా అయితే ఉంది కానీ ఒక్క పోస్ట్ ను కూడా పెట్టలేదు. అయినా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇంకా ఒక్క రోజులోనే 1 .7 మిలియన్ సభ్యులు చేరడం రికార్డు అని చెప్పాలి. ఈ రోజుతో 2 మిలియన్ అభిమానులు తన ఇంస్టా ను ఫాలో అవడంతో ఈ విషయం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇక పోస్టులు పెట్టడం స్టార్ట్ చేస్తే అవి ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాయో చూడాలి.

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం : రఘురామకృష్ణరాజు 

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయమని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటనలో ప్రధానితో ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలిసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాత్రి ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘ఎన్డీయేలో చేరడానికి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే తెలంగాణతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లటానికి సూత్రప్రాయంగా పెద్దలు అంగీకరించినట్లు తెలుస్తోంది.