NRI-NRT

అమెరికాకు అక్రమ వలస వెళ్తూ భారతీయ కుటుంబం మృతి

అమెరికాకు అక్రమ వలస వెళ్తూ భారతీయ కుటుంబం మృతి

అమెరికాకు అక్రమంగా వలస వెళ్లే ప్రయత్నంలో రెండు కుటుంబాలకు చెందిన 8 మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ఒక కుటుంబం భారత్‌కు, మరొకటి రొమేనియాకు చెందినదిగా కెనడా అధికారులు శుక్రవారం ప్రకటించారు. మృతి చెందిన భారతీయుల పేర్లు ప్రవీణ్‌ చౌధరి (50), ఆయన భార్య దక్షాబెన్‌ (45), వారి కుమార్తె విధి (23), కుమారుడు మేత్‌ (20) అని వెల్లడించారు. భారత్‌లోని వారి బంధువుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే ఈ వివరాలను అధికారులు బహిర్గతం చేశారు. ఈ ఏడాది మార్చి 29న కెనడాలోని సెయింట్‌ లారెన్స్‌ నదిలో వీరు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. తొలి రోజు ఆరు, రెండో రోజు మరో రెండు మృతదేహాలను కెనడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పడవలో అమెరికాకు అక్రమంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించిన కేసీ ఓక్స్‌ అనే వ్యక్తి జాడ తెలియడంలేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి నెల రోజుల పాటు అన్వేషించినా ఓక్స్‌ ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 3న సెయింట్‌ లారెన్స్‌ నదిలో ఓ శవం లభించగా అతి కష్టం మీద అది అదృశ్యమైన కేసీ ఓక్స్‌దేనని పోలీసులు గుర్తించారు. దీంతో శుక్రవారం ఓక్స్‌తో పాటు నాలుగు నెలల క్రితం లభ్యమైన మృతదేహాల వివరాలనూ కెనడా అధికారులు వెల్లడించారు.