Business

రాష్ట్రంలో బియ్యం సేకరణపై కేంద్రం నిర్ణయం

రాష్ట్రంలో బియ్యం సేకరణపై కేంద్రం నిర్ణయం

రాష్ట్రంలో వానాకాలం(ఖరీఫ్‌) పంటలో వచ్చే వరి దిగుబడి నుంచి 50 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. బియ్యం సేకరణలు ఉన్న రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల కమిషనర్లతో కేంద్రం దిల్లీలో సోమవారం సమావేశం నిర్వహించింది. తెలంగాణ నుంచి వానాకాలంలో కోటి 52 లక్షల టన్నుల ధాన్యం పంట వస్తుందన్న అంచనాలున్నాయి. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 67 లక్షల టన్నుల బియ్యం వస్తుందనీ.. ఈ బియ్యాన్ని సేకరించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ మాత్రం 50 లక్షల టన్నుల బియ్యం తీసుకునేందుకు సుముఖత తెలిపింది. గత సంవత్సరం ఖరీఫ్‌లో 50 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ముందుకు రాగా, 44 లక్షల టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఇవ్వగలిగింది. వానకాలం సాగు, దిగుబడికి సంబంధించి ప్రస్తుతం అంచనాలు మాత్రమే ఉన్నాయి. లెక్కలపై వచ్చే నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.