NRI-NRT

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ నెంబరుకు కాల్ చేయవచ్చు

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ నెంబరుకు కాల్ చేయవచ్చు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు కన్సల్టెన్సీలపై ఆధారపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌లో తాత్కాలిక యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌, వీసా అధికారి రెబెఖా డ్రేమ్‌ చెప్పారు. సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు అవగాహన కల్పించడానికి యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను నిర్వహించారు. 40 వర్సిటీల ప్రతినిధులతో నేరుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. దీన్ని ప్రారంభించిన అనంతరం రెబెఖా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

టోల్‌ ఫ్రీ నంబరు 18001031231
‘‘విద్యార్థులకు సలహాలు ఇచ్చేందుకు హైదరాబాద్‌ కాన్సులేట్‌ సహా దేశవ్యాప్తంగా యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌(యూఎస్‌ఐఈఎఫ్‌) కేంద్రాలు ఉన్నాయి. అక్కడుండే వారినుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. టోల్‌ఫ్రీ నంబరు (18001031231) ఉంది. ఫేస్‌బుక్‌లో ఎడ్యుకేషన్‌యూఎస్‌ఇండియాను ఫాలో కావొచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి సమాచారం పొందాలి. విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేయాలి’’ అని రెబెఖా వివరించారు.

అసలు ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి
ఇటీవల 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా వెనక్కి పంపడంపై రెబెఖా మాట్లాడుతూ ఆ విద్యార్థుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని చెప్పారు. ‘‘విద్యార్థులు అవసరమైన అన్ని అసలు ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి. నిజాయతీగా వ్యవహరించాలి. ఒకవేళ అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత కూడా అనుమానం వస్తే ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీ చేస్తారు’’ అని తెలిపారు. యూఎస్‌ విద్య ఫెయిర్‌ను సందర్శించేందుకు మొత్తం 3 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం అమెరికా ప్రభుత్వానికి రెండు రకాల ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, సెవిస్‌ రుసుం కింద 350 డాలర్లు, వీసా దరఖాస్తుకు 185 డాలర్లు చెల్లించాలని పేర్కొన్నారు.

మరో ఏడు చోట్ల ఫెయిర్‌ల నిర్వహణ
విద్యార్థులలో అవగాహన పెంచేందుకు మిషన్‌ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా ముంబయి, పుణె, దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో యూఎస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహించనున్నామని, తొలుత హైదరాబాద్‌లో ప్రారంభించామని రెబెఖా తెలిపారు. మిగిలినవి సెప్టెంబరు 3తో ముగుస్తాయని చెప్పారు. కరోనా తర్వాత ఇక్కడ కాన్సులేట్‌లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించి త్వరగా వీసా ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు.