WorldWonders

ఆ గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం

ఆ గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చదివాం. కొన్ని గ్రామాలు గాంధీజీ మాటల స్ఫూర్తితో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే.. మరికొన్ని గ్రామాలు వసతుల లేమితో వలసల కారణంగా ఖాళీ అవుతున్నాయి. పుట్టిన ఊరిలో ఉపాధి దొరక్క పట్టణాలకు పయనమయ్యే వారు కొందరైతే.. కనీస మౌలిక సదుపాయాలు కరువై బలవంతంగా ఊరును విడిచిపెట్టే వారు మరికొందరు. ఈ పరిస్థితులకు ఉదాహరణే అస్సాం (Assam)లోని నల్‌బరి (Nalbari) జిల్లాలో ఉన్న బర్ధ్‌నారా (Bardhanara) గ్రామం. ఒకప్పుడు ఊరి నిండా జనాభాతో కళకళలాడిన గ్రామంలో ప్రస్తుతం ఐదుగురు సభ్యులతో కూడిన ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం బర్ధ్‌నారా వెళ్లేందుకు నిర్మించిన రహదారిని అప్పటి సీఎం బిష్ణురామ్‌ మేధి (Bishnuram Medhi) స్వయంగా ప్రారంభించారు. తరచుగా వరదలు తలెత్తడంతో ఆ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ప్రభుత్వం తిరిగి రోడ్డు నిర్మించకపోవడంతో గ్రామం నుంచి ఒక్కో కుటుంబం వలస వెళ్లిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం బర్ధ్‌నారా గ్రామంలో 16 మంది నివసించేవారు. ప్రస్తుతం బీమ్లా దేకా అనే వ్యక్తి తన భార్య అనిమా, ముగ్గురు పిల్లలు నరేన్‌, దీపాలి, స్యూటీలతో కలిసి బర్ధ్‌నారాలో ఉంటున్నాడు.

నల్‌బరి జిల్లా కేంద్రానికి బర్ధ్‌నారా 12 కి.మీ దూరంలో ఉంటుంది. ప్రస్తుతం గ్రామంలో రోడ్డు సదుపాయంతోపాటు కరెంటు వసతి కూడా లేదు. వర్షాల కారణంగా గ్రామంలోని రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అధిక వర్షపాతంతో గ్రామంలోని దారులు జలమయం అవుతాయని దీంతో పడవ సాయంతో ఊరు దాటాల్సిందేనని బీమ్లా తెలిపాడు. ‘‘గ్రామ పరిస్థితి గురించి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల నుంచి స్పందన లేదు. పిల్లలు స్కూలు, కాలేజీకి వెళ్లేందుకు ఏదైనా వాహనం ఎక్కాలన్నా.. గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు నీళ్లు, బురదతో నిండిన దారిలోనే రావాలి. వర్షాకాలంలో పడవ సాయంతో పిల్లలను రోడ్డు దగ్గర విడిచిపెడతాం. కరెంటు సౌకర్యం లేకపోవడంతో కిరోసిన్‌ దీపాల వెలుతురులోనే చదువుకోవాల్సిన పరిస్థితి. వ్యవసాయం, పశువుల పెంపకమే మాకు ప్రధాన ఆదాయ వనరు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామంలో ఈ పరిస్థితి తలెత్తింది’’ అని అనిమా పేర్కొంది.

బర్ధ్‌నారా పరిస్థితి గురించి తెలుసుకున్న గ్రామ్య వికాస్‌ మంచా అనే ఎన్‌జీవో సంస్థ గ్రామంలోని భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తోంది. దానివల్ల ప్రజలు గ్రామంలోకి వచ్చి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి రోడ్డు, కరెంటు సౌకర్యాలు కల్పిస్తే ఊరు విడిచి వెళ్లినవారు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఎన్‌జీవో ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.