Business

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

ఎల్‌ఐసీ నుంచి మరో నయా పథకం

భారతదేశంలో ఎల్‌ఐసీ పథకాలకు ఉన్న ప్రజాదరణ వేరు. ఎల్‌ఐసీలో పెట్టుబడి పెడితే మంచి రాబడిపై నమ‍్మకం ఉండడంతో పాటు పెట్టుబడితో భరోసా ఉంటుందని సగటు భారతీయుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్తకొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. తాజాగా ఎల్‌ఐసీ ధన్‌వృద్ధి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ధన్ వృద్ధి సింగిల్ ప్రీమియం-నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ ప్లాన్. ఈ పాలసీ సెప్టెంబర్ 30, 2023 వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. పాలసీదారు మెచ్యూరిటీ సమయంలో హామీ ఇచ్చిన మెచ్యూరిటీ మొత్తాన్ని లాయల్టీ జోడింపును పొందుతారు. ఇది ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారుతుంది. కవర్ చేసిన జీవిత ప్రవేశ వయస్సు, బకాయి ఉన్న సింగిల్ ప్రీమియం ఆధారంగా, హామీ ఇచ్చిన మెచ్యూరిటీ మొత్తం లెక్కిస్తారు. కాబట్టి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హతతో పాటు ప్రీమియం వివరాల వంటి వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం. ఎంచుకున్న బీమా కాలాన్ని బట్టి ప్లాన్‌కు ప్రవేశ వయస్సు 90 రోజుల నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. మరోవైపు తీసుకున్న టర్మ్, పాలసీ నిర్ణయం ఆధారంగా గరిష్ట ప్రవేశ వయస్సు 32 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రాథమిక హామీ మొత్తం రూ. 1.25 లక్షలుగా ఉంటుంది.బేస్ సమ్ అష్యూర్డ్, ఏదైనా గ్యారెంటీ పెంపుదల-సమర్థవంతంగా ఆర్జించిన రిటర్న్‌లు-కాలానుగుణంగా కార్పస్ పెరగడానికి క్రెడిట్ చేసినవి, మెచ్యూరిటీ సమయంలో పాలసీదారునికి బేస్ సమ్ అష్యూర్డ్‌తో పాటు ఇస్తారు. వాగ్దానం చేసిన మొత్తం, ఏదైనా హామీ ఇవ్వబడిన అప్‌గ్రేడ్‌లు అభ్యర్థులు మరణించిన సందర్భంలో మధ్యంతర కాలంలో వారికి చెల్లిస్తారు. హామీ ఇచ్చిన చేర్పులు టర్మ్ సమయంలో ప్రతి బీమా సంవత్సరం చివరిలో జమ అవుతాయి. ఈ చెల్లింపులు ఆప్షన్ 1 కింద రూ. 60 నుంచి రూ. 75 వరకు, ఆప్షన్ 2 కింద రూ. 25 నుంచి రూ. 40 వరకు హామీ ఇచ్చినప్రతి రూ. 1,000కి ఉండవచ్చు.

 సింగపూర్ వెళ్లే వారికి ప్రత్యేక ఆఫర్

సింగపూర్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు బంపరాఫర్. కేవలం రూ.6300 రూపాయలకే సింగపూర్ విమానం ఎక్కొచ్చు. ఈ మేరకు ‘స్కూట్’ అనే సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ భారత ప్రయాణికుల కోసం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. వైజాగ్ తో పాటు దేశంలోని పలు నగరాల నుంచి అత్యల్ప రేట్లకు సింగపూర్ వెళ్లేందుకు టికెట్లను విక్రయిస్తున్నట్టు తెలిపింది. నిన్న మొదలైన ఈ ఆఫర్ సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు రోజుల సమయంలో సింగపూర్ లోని వివిధ ప్రాంతాలకు డిసెంబర్ 14వ తేదీ వరకు జరిగే ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను మాతమ్రే అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చని సదరు సంస్థ తెలిపింది

*  లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 79.22 పాయింట్లు పెరిగి.. 65,075.82 వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు పెరిగి 19,342.70 వద్ద స్థిరపడింది. దాదాపు 2,023 షేర్లు పురోగమించగా.. 1,475 షేర్లు క్షీణించాయి. 138 షేర్లు మారలేదు. ఇవాళ లాభాలతోనే మొదలైన సూచీలు.. కొద్దిసేపు అదే ఊపును కొనసాగించాయి. ట్రేడింగ్‌ చివరి గంటన్నరలో కొంత తడబడి.. చివరకు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీలో యూపీఎల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, హీరో మోటోకార్ప్‌, టాటా స్టీల్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలువగా.. భారతీయ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లూజర్స్‌గా నిలిచాయి. సెక్టార్లలో, మెటల్, పవర్, రియల్టీ ఒక్కొక్క శాతం లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మాస్టాక్స్‌లో అమ్మకాల జోరు కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.5శాతం చొప్పున పెరిగాయి.

 నేడు బంగారం ధరలు

గత మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.50 కు తగ్గి రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.50 కు తగ్గి రూ.59,450 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే..22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,450,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,400 నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,450,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,400.

ఉత్పత్తి నిలిపివేసిన టయోటా

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ ‘టయోటా’ (Toyota) ఒక్కసారిగా షాక్ ఉత్పత్తి నిలిపివేసి కస్టమర్లకు షాకిచ్చింది. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అక్కడ మొత్తం 14 తయారీ కేంద్రాలలో ఈ రోజు (మంగళవారం) ఉత్పత్తి నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి సంస్థకు సంబంధించిన విడిభాగాల ఆర్డర్స్ పర్యవేక్షించే కంప్యూటర్ సిస్టంలో ఏర్పడిన లోపం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ మంది వాహన వినియోగదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బ్రాండ్లలో టయోటా ఒకటి. అయితే కంపెనీ ఉత్పత్తి నిలిపివేసిందనే వార్త కష్టమరల్లో ఒకింద భయాన్ని కలిగించింది. కాగా మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అంతే కాకుండా ఏ మోడల్స్ ఉత్పత్తులు నిలిచిపోయాయి అనేదానికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

 దేశంలో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. మంగళవారం దేశవ్యాప్తంగా 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఉజ్వల యోజన కింద సిలిండర్ తీసుకున్న వారికి రూ. 400 తగ్గింపు ఉంటుందని కేంద్రం తెలిపింది. దీంతో ఉజ్వల యోజన కింద రూ.700 కే సిలిండర్ వస్తుంది. అదే ఈ పథకంలో లేని వారికి రూ.900 కే సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని కేంద్రం 2016లో ప్రారంభించింది. దీని ద్వారా BPL కుటుంబాలకు 5 కోట్ల LPG కనెక్షన్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు కేంద్రం గ్యాస్ తగ్గింపు నిర్ణయం తీసుకోవడం ఒక కొసమెరుపు.

ఆ ఐకానిక్‌ బైక్‌ మళ్లీ వచ్చేసింది

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్  సరికొత్త బైక్‌ను (మంగళవారం, ఆగస్టు 29)  లాంచ్‌ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్‌ లాంచ్‌తో  కరిజ్మా బ్రాండ్‌ను  రీలాంచ్‌ చేసింది. అంతేకాదు ఈ  బైక్‌పై ఆకర్షణీయమైన్‌ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్‌ జనరేషన్‌ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది.  బుకింగ్‌లను కూడా షురూ చేసింది.రూ. 1,82,900  లాంచింగ్‌ ప్రైస్‌గా ఉన్న Karizma XMR  210  ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్  బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది  ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో  లభ్యం.210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ  అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది.లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్  అండ్‌ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఫ్యాటర్‌ రియల్‌ వెక టైర్‌తో వస్తుంది.ఇంకా ఈ బైక్‌లో కొత్త ఎల్‌ఈడీ లైట్లు , ఇండికేటర్‌లు, స్లీకర్‌ ఇంధన ట్యాంక్,  షార్ప్‌  లైన్‌లో, రైడర్‌కు ‍ప్రొటెక్షన్‌గా స్నాజీ విండ్‌స్క్రీన్‌తో యంగస్టర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.  కాల్‌ల్స్‌,  ఇతర నోటిఫికేషన్‌ అలర్ట్‌ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త  ఫుల్లీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్‌, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్  స్పీడోమీటర్ రీడింగ్‌ల వంటి సమాచారాన్ని అందిస్తుంది.

భారీగా తగ్గుతున్న టమాటా ధర

ద్రవ్యోల్బణం తగ్గడం ప్రారంభమైంది. దాదాపు 70 రోజుల తర్వాత టమాటా మళ్లీ పాత ధరకు చేరుకుంది. దీంతో సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభించింది. కొన్ని వారాల క్రితం వరకు కిలో రూ.150 నుంచి 200 వరకు లభించే టమాటా ఇప్పుడు కిలో రూ.14కు విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలు చేసేందుకు జనం గుమిగూడారు. మండీల్లో టమోటాల సరఫరా ఇలాగే కొనసాగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటకలో టమోటా ధర ఇంత భారీ తగ్గుదల నమోదైంది. ఇక్కడి మైసూరు ఏపీఎంసీలో టమాటా ధర కిలో రూ.14కు తగ్గింది. దీంతో సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభించింది. నగరంలోని పరిసర ప్రాంతాల ప్రజలు టమాట కొనుగోలు కోసం మైసూరు ఏపీఎంసీకి చేరుకుంటున్నారు. విశేషమేమిటంటే గత శనివారం ఇక్కడ టమాటా కిలో రూ.20కి విక్రయించారు. అదే సమయంలో టమాటా ధర పతనం ప్రభావం మైసూరుతో పాటు ఇతర నగరాల్లోనూ కనిపిస్తోంది. ఇప్పుడు బెంగళూరు రిటైల్ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.30-35కి పడిపోయింది. అంటే బెంగళూరులో రూ.30కి కిలో టమాటా కొనుగోలు చేయవచ్చురైతులు ఖర్చు కూడా రాబట్టుకోలేకపోతున్నారు. మండీలకు టమాట రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని మైసూరు ఏపీఎంసీ కార్యదర్శి ఎంఆర్ కుమారస్వామి చెబుతున్నారు. ఏపీఎంసీకి నిత్యం 40 క్వింటాళ్ల టమాటా వస్తుందన్నారు. అదే సమయంలో ఆకస్మికంగా ధరలు తగ్గిన తరువాత టమోటాలు, ఇతర కూరగాయల ధరలను అరికట్టాలని కర్ణాటక రాజ్య రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఇమ్మవు రఘు ప్రభుత్వాన్ని కోరారు.

అమెజాన్‌  ఉద్యోగులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

దిగ్గజ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్‌ (Amazon) తమ ఉద్యోగులకు (Employees) స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఉద్యోగులు ఇక ఇంటి వద్ద నుంచి కాకుండా వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ‘ఇక ఇంటి నుంచి పనిచేయడం కుదరదు. వారానికి కనీసం మూడు రోజులు తప్పకుండా ఆఫీసుకు రావాల్సిందే. ఇది సంస్థ నిబంధన. సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వారిని ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తుంది’ అని కంపెనీ అంతర్గత సమావేశంలో సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) హెచ్చరికలు జారీ చేశారు.కాగా, అమెజాన్‌ సంస్థ తమ ఉద్యోగుల్ని ఆఫీసుకు రామని చెప్పడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. మే నెల నుంచి ఉద్యోగులు వారానికి 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని సీఈవో కోరారు. అయితే, అప్పట్లో కొందరు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఆఫీసులకు వెళ్లకుండా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే గతంలో ఉద్యోగులను ఆఫీసులకు రావాలని అభ్యర్థించిన సీఈఓ.. ఇప్పుడు మాత్రం ఆఫీసుకు రావాల్సిందే అని గట్టి వార్నింగే ఇచ్చారు.కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా మూడేళ్ల క్రితం పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి ప్రభావం తగ్గడంతో అన్ని కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. అయితే, కొందరు ఉద్యోగులు సంస్థ ఆదేశాలను పెడచెవిన వేసుకోవడం లేదు. దీంతో పలు కంపెనీలు ఉద్యోగులకు గట్టి ఆదేశాలు జారీ చేస్తున్నాయి. వస్తే రండి లేదంటే.. మానేయండి అంటూ కరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) కూడా తమ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేనని.. రాని వారిని తొలగించేందుకు కూడా సంకోచించబోమని తేల్చి చెప్పింది. మరో సోషల్‌ మీడియా దిగ్గజం మెటా (Meta) కూడా ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. ఉద్యోగులు ఇకపై ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా అమెజాన్‌ తమ ఉద్యోగులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది.

*  8 కోట్లతో ప్రాపర్టీ కొనుగోలు చేసిన కాజోల్

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ముంబైలో మరో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనూ కాజోల్ ముంబైలో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడం గమనార్హం. తాజాగా ఆమె కార్యాలయ వినియోగానికి ఉద్దేశించిన ప్రాపర్టీని రూ.7.64 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఓషివారా ప్రాంతంలోని సిగ్నేచర్ బిల్డింగ్ లో 194.67 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని జులై 28న కొనుగోలు చేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో 2,493 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను కాజోల్ రూ.16.50 కోట్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. కాజోల్ భర్త అజయ్ దేవ్ గణ్ సైతం ఇటీవలే రూ.45 కోట్లతో ఐదు కార్యాలయ భవనాలను సొంతం చేసుకున్నారు. ఈ దంపతులు తమ ఆదాయంతో ఖరీదైన ఆస్తులు సమకూర్చుకుంటున్నట్టు వారి కొనుగోళ్లను పరిశీలిస్తే తెలుస్తుంది. కాజోల్ నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ, లస్ట్ స్టోరీస్ 2, ద ట్రయల్ లో కనిపిస్తుండడం తెలిసిందే.