Politics

నేటి నుంచి బీజేపీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

నేటి నుంచి బీజేపీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని వడపోసే పనిలో పడింది. ఇక ఈసారి తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. కాంగ్రెస్ బాటలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసేందుకు ప్రణాళిక రచించింది.ఇందులో భాగంగానే రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి బీజేపీ ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.

దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీ నియామకం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో జాతీయ నాయకత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తైన అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 17 తరువాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.