Business

వైద్య నకిలీ పీజీ సీట్ల వల్ల ఎవరికెంత లాభం!

వైద్య నకిలీ పీజీ సీట్ల వల్ల ఎవరికెంత లాభం!

రాష్ట్రంలోని మూడు వైద్య కళాశాలలకు నకిలీ పీజీ సీట్ల కేటాయింపు కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీ మోసం జరగలేదు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టంగా.. ఈ మూడు కళాశాలలకు అదనపు సీట్లు కేటాయించలేదని, అవన్నీ నకిలీవని తేల్చేసింది. విద్యార్థులను ముంచేసి.. వారి జీవితాలతో ఆడుకుని, భారీగా లబ్ధి పొందే ఈ మోసంతో తమకు సంబంధం లేదంటే.. తమకు లేదంటూ ఇటు ఆరోగ్య విశ్వవిద్యాలయం, అటు కళాశాలల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ భారీ కుంభకోణానికి పాల్పడింది ఎవరు? ఎన్‌ఎంసీ నుంచి వచ్చినట్టే నకిలీ ఆదేశాలను పంపించింది ఎవరు? దీనివల్ల ఎవరికి లాభం? అసలు ఒకేసారి భారీగా ఇన్నేసి సీట్లను ఒక్కో కళాశాలకు కేటాయించడం సాధ్యమేనా? ఒక ఈ మెయిల్‌, సీల్డ్‌కవర్‌లో సమాచారం వచ్చిందంటూ.. కౌన్సెలింగ్‌లో ఆ నకిలీ సీట్లను అంత హడావుడిగా పెట్టేసి మరీ ప్రవేశాలను ఎందుకు కల్పించాలి?, నీట్‌ ర్యాంకులొస్తేనే.. విశ్వవిద్యాలయం నుంచి నేరుగా ఎన్‌ఎంసీకి వెళ్లి మరీ సీడీని తెచ్చి ధ్రువీకరించుకునే అధికారులు, వందకు పైగా పీజీ వైద్యసీట్ల విషయంలో కనీసం ఎన్‌ఎంసీతో నేరుగా మాట్లాడకుండా కౌన్సెలింగ్‌లో ఎలా పెట్టారనేది పలు అనుమానాలకు దారితీస్తోంది.

వైద్య కళాశాలల్లో ఒక్క పీజీ సీటు కొత్తగా మంజూరు చేయలన్నా అనేక నిబంధనలు పాఠించాలి. ఆరోగ్య విశ్వవిద్యాలయం చరిత్రలో ఒకేసారి ఇన్నేసి సీట్లను ఒక్కో కళాశాలకు కేటాయించింది లేదు. అదికూడా కీలకమైన గైనిక్‌, జనరల్‌ మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ, జనరల్‌ సర్జరీ లాంటి విభాగాల్లో రెండు మూడు సీట్లను మంజూరు చేయడమే గొప్ప. అలాంటిది నంద్యాల శాంతిరామ్‌ వైద్య కళాశాలకు ఒకేసారి కొత్తగా గైనిక్‌కు 12, జనరల్‌ మెడిసిన్‌ 17, జనరల్‌ సర్జరీకి 13 సీట్లను కేటాయించినట్టు నకిలీ ఆదేశాలు వచ్చినా విశ్వవిద్యాలయం గుర్తించకపోవడం ఏమిటో అధికారులకే తెలియాలి. రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ కళాశాలకు కూడా గైనిక్‌లో 10, జనరల్‌ మెడిసిన్‌లో 16, జనరల్‌ సర్జరీలో 16 చొప్పున కొత్తగా మంజూరైనట్టు నకిలీ ఆదేశాలొచ్చాయి. అయినా అధికారులకు అనుమానం రాలేదు. వాటిని మొదటి కౌన్సెలింగ్‌లోనే సీట్‌ మ్యాట్రిక్స్‌లో పెట్టేసి ప్రవేశాలు కల్పించేశారు.
ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ ఎలా?
తమ కళాశాలకు పీజీ వైద్య సీట్లు పెరిగినట్టుగా ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ స్పష్టంగా చూపించారని నంద్యాల శాంతిరామ్‌ కళాశాల యాజమాన్యం స్క్రీన్‌షాట్లను మీడియాకు విడుదల చేసింది. వాటిలో ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ 21 సీట్లు అనే చూపిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో చూస్తే అక్కడ ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ 4 సీట్లే కనిపిస్తున్నాయి. అంటే కళాశాలలు, యూనివర్సిటీకి నకిలీ ఆదేశాలు పంపించడంతో పాటు వెబ్‌సైట్‌లోనూ మార్చి చూపించారా అనేది తేలాల్సి ఉంది.

వసతులన్నీ సినీఫక్కీ విన్యాసాలే..
వాస్తవంగా ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సౌకర్యాలు చాలా వైద్య కళాశాలల్లో సరిగా ఉండవు. ఎన్‌ఎంసీ తనిఖీ బృందాలు వచ్చే సమయంలో సినీఫక్కీలో జిమ్మిక్కులు చేస్తుంటారు. మౌలిక వసతులను అప్పటికప్పుడే సినిమా సెట్ల మాదిరిగా వేస్తుంటారు. రోగులను పొరుగున ఉండే ఆసుపత్రుల నుంచి తీసుకొస్తారు. కొందరికి తెల్లకోట్లు వేసి వైద్యులుగా నిలబెట్టి.. వారినే అసిస్టెంట్లు, అసోసియేట్లుగా చూపిస్తారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడు బ్యాండేజీలు, తలకి కట్లు కట్టేసి..రోగులను తయారుచేసి మంచాలపై పడుకోబెడుతుంటారు. తనిఖీలకు వచ్చే బృందాలకూ ఇవన్నీ తెలిసినా వారిని ముందే బుట్టలో వేసుకునే యాజమాన్యాలు ఉన్నాయి.

ప్రవేశాల ప్రక్రియపై సన్నద్ధతేదీ..
పీజీ వైద్య సీట్ల భర్తీలో కీలకమైన ప్రవేశాల ప్రక్రియ నిర్వహించేముందు కనీస సన్నద్ధత అవసరం. ఈ ఏడాది ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు? ఏయే కళాశాలల్లో ఎన్ని ఉన్నాయి? కొత్తగా సీట్లు పెరిగితే ఎన్‌ఎంసీని సంప్రదించి ధ్రువీకరించుకోవడం.. లాంటివన్నీ ముందుగానే పక్కాగా పరిశీలించుకోవాలి. వీటి పర్యవేక్షణకు నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటుచేయాలి. కానీ ప్రస్తుతం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశాల ప్రక్రియలో ఇవేవీ పాటించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా దీనికి ప్రధాన కారణమే. ప్రవేశాల జీవోను ఒకటి రెండు రోజుల ముందు వరకూ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో హడావుడిగా సీట్‌మ్యాట్రిక్స్‌ను రూపొందించడం, సీట్ల ఎంపిక, ప్రవేశాలు కల్పించడం.. లాంటివన్నీ చేస్తున్నారు. ఈ ఏడాది నీట్‌ ర్యాంకులు వచ్చిన రెండు నెలల వరకూ ఫీజుల జీవోను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇవన్నీ ప్రవేశాల నిర్వహణకు అడ్డంకులుగా మారుతున్నాయి. కౌన్సెలింగ్‌ దగ్గర పడినప్పుడు కూడా కొత్తగా సీట్లు వచ్చాయంటూ హడావుడిగా కలిపేసి.. ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తాజాగా నకిలీ సీట్లకు ప్రవేశాల ప్రక్రియను ఇలాగే చేశారు. నిజంగా సీట్లు పెరిగాయా.. లేదా అనేది ఎన్‌ఎంసీని సంప్రదించి ధ్రువీకరించుకోకుండానే నకిలీ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లిపోయారు. చివరికి మొదటి కౌన్సెలింగ్‌ మొత్తాన్ని రద్దుచేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో గందరగోళం..

పీజీ మొదటి కౌన్సెలింగ్‌ రద్దవ్వడంతో సీట్లు వచ్చిన వేలమంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో పడిపోయారు. కౌన్సెలింగ్‌లో 1,295 మందికి సీట్లను కేటాయించారు. ప్రస్తుతం అంతా రద్దు చేయడంతో వీరందరి జీవితాలు గందరగోళంలో పడిపోయాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం, వైద్యవిద్య ప్రవేశాల విషయంలో గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గందరగోళంగా ఉంటున్నాయి. సొంత ప్రయోజనాల కోసం ఒత్తిడి తేవడం, విశ్వవిద్యాలయానికి సంబంధించిన రూ.400 కోట్లను వాడుకోవడం, బోధనేతర సిబ్బంది కొరతను పట్టించుకోకపోవడం, వ్యవస్థలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. నకిలీ సీట్ల కుంభకోణం దెబ్బకు పూర్తిగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియపైనే అనుమానాలు కలుగుతున్నాయి.